21 శాతం తగ్గిన కర్నాటక బ్యాంక్ నికర లాభం
ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్నాటక బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.107 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్ధిక సంవత్సరం (2014-15) ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.134 కోట్లు)తో పోల్చితే 21 శాతం క్షీణత నమోదైందని కర్నాటక బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు పెరగడమే దీనికి కారణమని వివరించింది. 2014-15 క్యూ4లో రూ.1,308 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,448 కోట్లకు ఎగసిందని పేర్కొంది. మొండి బకాయిలు, ఇతర అంశాలకు కేటాయింపులు రూ.4 కోట్ల నుంచి రూ.113 కోట్లకు పెరిగాయని వివరించింది. స్థూల మొండి బకాయిలు 2.95 శాతం నుంచి 3.44 శాతానికి, నికర మొండి బకాయిలు 1.98 శాతం నుంచి 2.35 శాతానికి పెరిగాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది.
ఇక ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే 2014-15 లో రూ.451 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.415 కోట్లకు పడిపోయిందని, మొత్తం ఆదాయం మాత్రం రూ.5,205 కోట్ల నుంచి రూ.5,535 కోట్లకు పెరిగిందని కర్నాటక బ్యాంక్ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కర్నాటక బ్యాంక్ షేర్ 7 శాతం లాభంతో రూ.120 వద్ద ముగిసింది.