న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 22 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.134 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.163 కోట్లకు చేరుకున్నట్లు కర్ణాటక బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభమని బ్యాంక్ ఎమ్‌డీ, సీఈఓ ఎమ్.ఎస్.మహాబలేశ్వర చెప్పారు. రుణ నాణ్యత మెరుగుపడటం, నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, నిర్వహణ లాభం పెరగడంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించామని తెలియజేశారు. నికర వడ్డీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.469 కోట్లకు చేరిందన్నారు. నిర్వహణ లాభం 19 శాతం పెరిగి రూ.369 కోట్లకు పెరగ్గా, ఇతర ఆదాయం మాత్రం 4 శాతం క్షీణించి రూ.209 కోట్లకు తగ్గిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.1,548 కోట్ల నుంచి రూ.1,616 కోట్లకు ఎగసిందని వెల్లడించారు.
తగ్గిన మొండి బకాయిలు..
గత క్యూ1లో 4.32 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు 4.72 శాతానికి పెరిగాయని మహాబలేశ్వర పేర్కొన్నారు. అయితే అంతకు ముందటి క్వార్టర్ స్థూల మొండిబకాయిలతో (4.92 శాతం)తో పోల్చితే ఈ క్యూ1లో తగ్గాయని వివరించారు. ‘‘నికర మొండి బకాయిలు మాత్రం 3.2 శాతం నుంచి 2.92 శాతానికి తగ్గాయి. అంతకు ముందటి క్వార్టర్‌లో 2.96 శాతంగా ఉన్నాయి. కేటాయింపులు రూ.199 కోట్ల నుంచి రూ.222 కోట్లకు చేరాయి. అంతకు ముందటి క్వార్టర్‌తో పోలిస్తే కేటాయింపులు 59 శాతం తగ్గాయి. అంతకు ముందటి క్వార్టర్‌లో 41.1 శాతంగా ఉన్న ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఈ జూన్ క్వార్టర్‌లో 67.21 శాతానికి పెరిగింది. ఈ క్యూ1లో బ్యాంక్ డిపాజిట్లు 12 శాతం వృద్ధితో రూ.62,725 కోట్లకు, రుణాలు 24 శాతం వృద్ధితో రూ.47,731 కోట్లకు ఎగిశాయి’’ అని వివరించారు. ఆర్థిక ఫలితాలు బాగుండటంతో బీఎస్‌ఈలో కర్ణాటక బ్యాంక్ షేర్ 5 శాతం లాభంతో రూ.124 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment