
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 228 శాతం దూసుకెళ్లి రూ. 411 కోట్లను అధిగమించింది. ఇది ఒక క్వార్టర్‌లో బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 125 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం సైతం 26 శాతం ఎగసి రూ. 803 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.03 శాతం నుంచి 3.36 శాతానికి, నికర ఎన్‌పీఏలు 2.16 శాతం నుంచి 1.72 శాతానికి దిగివచ్చాయి. ఫలితాల నేపథ్యంలో కర్ణాటక బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో 20 శాతం దూసుకెళ్లి రూ. 113 వద్ద ముగిసింది.