
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు.(ఇన్ సెట్లో) సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఫోర్డ్ కారు
సూర్యాపేటలో అనుమానాస్పదంగా ఫోర్డ్ కారు
* ఎస్పీ ఆదేశానుసారం డిక్కీని పగలగొట్టిన పోలీసులు
* గన్నీ బ్యాగ్ నుంచి కరెన్సీ కట్టలు బయటపడిన వైనం
* కారు, డబ్బును వదిలివెళ్లిన గుర్తుతెలియని దుండగులు
* కర్ణాటక బీజాపూర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు డబ్బుగా అనుమానం
సూర్యాపేట: ఉదయం నుంచి అక్కడో ఫోర్డ్ కారు నిలిపి ఉంది. దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే సాయంత్రం పోలీసులకు అనుమానమొచ్చి డిక్కీ పగలగొట్టి చూడగా... కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. రూ.లక్ష కాదు.. రూ.రెండు లక్షలు కాదు.. ఏకంగా కోటిన్నర రూపాయలు.. మొత్తం రూ.500, రూ.1000 నోట్ల కట్టలే. వాటిని చూసి పోలీసులే అవాక్కయ్యారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఫోర్డ్ కారును వదిలివెళ్లారు. జిల్లా ఎస్పీ దుగ్గల్ ఆదేశానుసారం సూర్యాపేట డీఎస్పీ ఎంఏ రషీద్ వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు లాక్ చేసి ఉండటంతో డిక్కీని పగలగొట్టి తనిఖీచేయగా డబ్బుల సంచి (గన్నీబ్యాగ్), ఒక పెట్టె బయటపడ్డాయి. వాటిలో రూ.కోటి 50 లక్షలు ఉండడంతో సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తమకు అందిన సమాచారం మేరకు కారును తనిఖీ చేయగా రూ.కోటి 50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎంఏ రషీద్ విలేకరులకు తెలిపారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని కర్ణాటకలోని బీజాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐలు సంతోష్‌కుమార్, శ్రీనివాస్, ఇతర సిబ్బంది ఉన్నారు.
కారు ఎక్కడిదీ? ఇక్కడే ఎందుకు ఆపారు?
కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ కారు ఎక్కడి నుంచి వచ్చిందో.. తెలియదు. కానీ సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో చెట్ల కింద ఉదయం నుంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించిన డబ్బు రవాణా అవుతున్నట్టు అక్కడి పోలీసులు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
ఈ డబ్బు చోరీకి గురైందా? లేక బ్యాంకులో పనిచేసే ఉద్యోగులే ఈ ఉదంతానికి పాల్పడ్డారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన ఈ కారు సూర్యాపేటలో నిలపడానికి గల కారణం తెలియాల్సి ఉంది. కారు ఇక్కడ నిలిపిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు చెప్పారు. కర్ణాటక పోలీసులు వస్తే పూర్తి సమాచారం తెలిసే అవకాశముంది.