Man uses Uber to rob bank, asks driver to wait outside to take him home - Sakshi
Sakshi News home page

ఉబర్‌లో కారు బుక్ చేసుకుని వెళ్లి బ్యాంకు దోపిడి.. అంతా ప్లాన్ ప్రకారమే జరిగినా.. చివరకు..

Published Mon, Nov 21 2022 2:31 PM | Last Updated on Mon, Nov 21 2022 3:12 PM

Man Orders Uber Robbed Bank Makes Driver Take Him Back Home - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ దొంగ సినీఫక్కీలో చోరీ చేశాడు. దర్జాగా ఉబర్‌లో కారు బుక్ చేసుకుని వెళ్లి బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడు. అనంతరం అదే కారులో ఇంటికి తిరిగివెళ్లాడు. ఇంత జరిగినా ‍డ్రైవర్‌కు దొంగతనం గురించి అసలు తెలియకపోవడం గమనార్హం. పోలీసులు వచ్చాకే అతనికి అసలు విషయం తెలిసి కంగుతిన్నాడు.

అమెరికా మిచిగాన్‌ సౌత్‌ఫీల్డ్‌లో నవంబర్ 16న ఈ ఘటన జరిగింది. చోరీకి పాల్పడిన వ్యక్తి పేరు జెసన్ క్రిస్ట్‌మస్(42). ప్లాన్ ప్రకారం కారు బుక్ చేసుకున్న ఇతడు బ్యాంకులో పని ఉందని డ్రైవర్‌ను హంటింగ్‌టన్ బ్యాంకు వద్దకు తీసుకెళ్లాడు. తాను తిరిగి వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పాడు. దీంతో డ్రైవర్‌ బ్యాంకు బయటే ఉన్నాడు.

అనంతరం తుపాకీతో  బ్యాంకు లోపలికి వెళ్లిన జేసన్.. అధికారులను బెదిరించి డబ్బు తీసుకున్నాడు. తర్వాత హుందాగా తిరిగి కారు వద్దకు వచ్చాడు. మళ్లీ ఇంటికి తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్పాడు. దీంతో అతడు జేసన్‌న తిరిగి తన ఫ్లాట్‌లో డ్రాప్ చేశాడు.

వెంటనే పట్టుకున్న పోలీసులు..
అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే జేసన్ ఫ్లాట్‌కు వెళ్లారు. అతడికి బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. కానీ దొంగ దస్తులపై ఎరుపు రంగు కన్పించడంతో ఎవరైనా షూట్ చేశారా? అని పోలీసులు అడిగారు. అలాంటిదేం లేదని, అది రంగు అని.. బ్యాంకు నుంచే తీసుకువచ్చినట్లు నిందితుడు చెప్పాడు.
మరోవైపు డ్రైవర్‌ను కూడా అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను చూసి అతడు షాక్ అయ్యాడు. తనకు ఈ దొంగతనం గురించి ఏమీ తెలియదని వాపోయాడు. పోలీసులు కూడా అతనికి నిజంగానే సంబంధం లేదని నిర్ధరించుకున్నారు. ప్యాసెంజర్ గురించి వివరాలు తెలుసుకోకుండా రైడ్‌కెలా తీసుకెళ్లావని ప్రశ్నించారు. మరోసారి ఎవరైనా అనుమానంగా కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ తరహా దొంగతనాలు నగరంలో జరగలేదని పోలీసులు చెప్పారు. క్యాబ్ బుక్‌ చేసుకుని వెళ్లి దోపిడీలు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని బంధువులు, కుటుంబసభ్యులకు ఖరీదైన బహుమతులు, వస్తువులు ఇవ్వడానికే జేసన్ క్రిస్టియన్ ఈ దోపిడీ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లకు కూడా ఎర్ర రంగు అంటుకొని ఉంది.
చదవండి: ఖరీదైన రెస్టారెంట్‌.. బిల్లుచూసి కళ్లు తేలేసిన నెటిజన్లు.. ఏకంగా రూ.1.3 కోట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement