ముంబై: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 28 శాతం ఎగిసింది. గత క్యూ3లో రూ.69 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.87 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ తెలియజేసింది. ఆర్జించిన వడ్డీ ఆదాయం నుంచి చెల్లించిన వడ్డీ ఆదాయాన్ని తీసివేయగా వచ్చే నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగిందని పేర్కొంది.
ఈ వడ్డీ ఆదాయం రూ.377 కోట్ల నుంచి రూ.452 కోట్లకు వృద్ధి చెందింది. రుణ నాణ్యత మెరుగుపడినట్లు బ్యాంక్ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 4.13 శాతం నుంచి 3.97 శాతానికి, నికర మొండి బకాయిలు 3.04 శాతం నుంచి 2.85 శాతానికి తగ్గాయని పేర్కొంది. ఇతర ఆదాయం 46 శాతం వృద్ధితో రూ.195 కోట్లకు, నిర్వహణ లాభం 87 శాతం వృద్ధితో రూ.322 కోట్లకు చేరుకున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.226 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ3లో రూ.196 కోట్లకు తగ్గాయని, అయితే గత క్యూ3 కేటాయింపులైన రూ.101 కోట్లతో పోలిస్తే రెట్టింపయ్యాయని బ్యాంక్ తెలిపింది. నికర లాభం 28 శాతం పెరగడం, మొండి బకాయిలు తగ్గి రుణ నాణ్యత మెరుగుపడడంతో బీఎస్‌ఈలో కర్ణాటక బ్యాంక్ షేర్ 3 శాతం లాభంతో రూ.167 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment