బెంగళూరు: తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామానికి చెందిన ప్రేమజంట రాధిక(19), నాగరాజులు వేడుకుంటున్నారు. వివరాలు... జంతులూరు గ్రామానికి చెందిన రాధిక, నాగరాజులు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి రాధిక తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు అంగీకరించకపోవడంతో వీరిరువురూ గ్రామం వదలి వచ్చేశారు. అప్పటి నుంచి రాధిక బంధువులు నాగరాజు తల్లిని, ఆమె బంధువులను ఇబ్బందులు పెడుతున్నారని వీరు చెబుతున్నారు. నాగరాజు తల్లితో పాటు అతని బంధువులపై కూడా భౌతిక దాడులకు కూడా దిగుతున్నారని ప్రేమికులు ఇద్దరూ ‘సాక్షి’తో వాపోయారు.
ఈ విషయమై రాధిక మాట్లాడుతూ...‘మా అమ్మనాన్నలకు మా వివాహం ఇష్టమే, అయితే బంధువల ఒత్తిడితో వారు మా పెళ్లికి అంగీకరించడం లేదు. ముఖ్యంగా అధికార టీడీపీ పార్టీ అండతో మా చిన్నాన్న నాగభూషణం, పెదనాన్న గోపాల్ నాయుడు, మరోపెదనాన్న, సర్పంచ్ రామానాయుడుతో పాటు మామ ధనుంజయ్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నాగరాజు ప్రాణాలు తీయడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు స్థానిక పోలీసులు కూడా ఒత్తాసు పలుకుతున్నారు. నాగరాజుతో పాటు వాళ్ల అమ్మ, చెల్లెలు, బావమరదితో పాటు నాకు ఎటువంటి హాని జరిగినా వీరే కారణమవుతారు.’ అని పేర్కొన్నారు.
తాను మేజర్‌నని తన ఇష్టపూర్వకంగానే నాగరాజుతో కలిసి ఇంటి నుంచి వచ్చేశానని రాధిక తెలిపారు. నాగరాజును తాను మనస్పూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాని ఈ విషయాన్ని ఇంతటితో వదిలి వేయాలని రాధిక తన తల్లిదండ్రులు, బంధువులను కోరారు.
మాకు రక్షణ కల్పించండి
Published Sun, Mar 6 2016 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM
Advertisement
Advertisement