ఘనంగా ప్రారంభమైన ఉత్సవాలు వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన
సాక్షి, ముంబై:
నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మాఘీ గణేశ్ ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. టపాసులు కాల్చుతూ, బ్యాండు మేళాలు వాయిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని విగ్రహాలను సోమవారం ప్రతిష్ఠించారు. కొందరు ఆలంకరణల కోసం ఒకటి రెండు రోజుల ముందుగానే వినాయకుని విగ్రహాలను తమ మండళ్ల వద్దకు తీసుకురాగా, మరికొందరు సోమవారం తీసుకువచ్చి మండళ్ల వద్ద ప్రతిష్ఠించారు.
వినాయక చవితి సందర్భంగా జరుపుకునే ఉత్సవాల మాదిరిగా ఈ మాఘీ ఉత్సవాలు కూడా గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వినాయకుని జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఈ ఉత్సవాలు ప్రారంభంలో కేవలం మొక్కులు తీర్చుకునేందుకు చేసేవారు. అనంతరం ఈ ఉత్సవాలను సార్వజనిక మండళ్లు నిర్వహించడం మొదలైంది. ఈసారి ముంబైలో సుమారు 1,200కు పైగా సార్వజనిక మండళ్లు వినాయక విగ్రహాలను ప్రతిష్టించాయి.
తూర్పు దాదర్‌లోని ‘సార్వజనిక్ మాఘీ గణేశ్ ఉత్సవ మండలి’ 44వసారి వేడుకలను నిర్వహిస్తోంది. ఈ మండలివారు ఆదివారం సాయంత్రం వినాయకుని ఊరేగిస్తూ తీసుకువచ్చి ప్రతిష్టించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని మండలి ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు క్రికెట్, చిత్రకళా పోటీలను నిర్వహిస్తున్నారు. మరోవైపు గోరేగావ్‌లోని సంకల్ప్ గణేష్ మందిరం ఆధ్వర్యంలో భజనలు, కీర్తనలు, హోమాలు, ఊరేగింపులు చేస్తున్నారు. సిద్ధి వినాయకుని ఆలయం ఆధ్వర్యంలో కూడా మాఘీ గణేశ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాకడ్ హారతి, మహాపూజా, శోభయాత్ర, రథయాత్ర, భజన తదితర అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు బోరివలిలోని గణేష్ మందిరం కావడంతో పాటు భక్తులు పెద్ద ఎత్తున వినాయకున్ని దర్శించుకునేందుకు చేరుకుంటున్నారు.
ఠాణే జిల్లాలో...
ఠాణేతోపాటు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మాఘీ గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఠాణే లోకమాన్యనగర్ పాడ నంబర్ రెండులోని ‘సాయినాథ్ మిత్ర మండలి’ ఆధ్వర్యంలో ప్రతియేటా మాదిరిగానే ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు సుధీర్ బర్గే తెలిపారు. 13వ సంవత్సరం సందర్భంగా జైపూర్‌లోని దేవీ ఆలయం నమూనాను అలంకరించామన్నారు. అలంకరణ కోసం ఆదివారం సాయంత్రం వినాయకుని విగ్రహాన్ని తీసుకువచ్చినప్పటికీ సోమవారం ఉదయం ప్రతిష్టించామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. టీట్‌వాలాతోపాటు రాష్ట్రంలోని అష్టవినాయకుని ఆలయాల్లో భక్తుల రద్దీ కన్పించింది.
సిద్ది వినాయకుని ఆలయానికి బస్సులు...
ప్రతి మంగళవారంతోపాటు సంకష్టి చతుర్ధశి రోజున సిద్ధి వినాయకున్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం బెస్టు ప్రత్యేక బస్సు సేవలను నగర మేయర్ సునీల్ ప్రభూ ఆదివారం ప్రారంభించారు. దాదర్ రైల్వే స్టేషన్ నుంచి సిద్ధి వినాయకుని ఆలయం వరకు ‘దాదర్ ఫేరీ-3’ అనే పేరుతో ఈ బస్సు సేవలకు నామకరణం చేశారు. ఈ బస్సులు వృత్తాకారంలో దాదర్ రైల్వేస్టేషన్ (కబూతర్‌ఖానా) నుంచి బయలుదేరి శారదాశ్రమం మీదుగా సిద్ధి వినాయకుని మందిరం, ప్రభాదేవి, ప్రభాదేవి మందిరం, రవీంద్ర నాట్యమందిరం, శ్రీసిద్దవినాయక్ మందిరం (శంకర్‌గానేకర్‌మార్గం), శారాదాశ్రమం, దాదర్ రైల్వేస్టేషన్ (కబూతర్‌ఖానా) మీదుగా సేవలందించనున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ బస్సు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవలను భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని బెస్టు అధికారులు తెలిపారు. సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని చెప్పారు.
మాఘీ గణేశుడికి జై...
Published Tue, Feb 4 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
Advertisement
Advertisement