స్వామి నిత్యానందకు ఊరట
చెన్నై: తమిళనాడులోని నాలుగు మఠాలకు సంబంధించి నిత్యానందపై నమోదైన కేసుకు సంబంధించి ఆయనకు మద్రాస్ హైకోర్టులో అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బెంగళూరు సమీపంలోని బిడది మఠం పీఠాధిపతిగా ఉన్న నిత్యానంద 2014 ఏప్రిల్ 15న వేదారణ్యంలోని పీకే సాధువుల మఠం, పంచనాదకుళం శ్రీ అరుణాచల జ్ఞానదేశికనస్వామి మఠం, తిరువారూరు సోమనాథస్వామిగళ్ మఠం, తంజావూరు బాలస్వామి, శంకరస్వామి మఠాలకు చట్టప్రకారం మఠాధిపతిగా నియమితులయ్యారు.
అయితే ఆ నాలుగు మఠాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాగుతుండగా కొంతమంది ప్రోద్బలంతో ఆత్మానంద, ధ్రువానంద, జ్ఞానేశ్వరానంద తదితరులు తమ మద్దతుదారులకు ఆశ్రయమిచ్చి సంఘవ్యతిరేక కలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆత్మానందతో పాటు అతని అనుచరులను తొలగించాలని కోరుతూ దీనిపై ఆయన నాగపట్టణం అనుబంధ న్యాయస్థానంలో కేసు వేశారు.
నాలుగు మఠాలపై హక్కు తనకు ఉందని, అయితే కొంతమంది తన పేరుకు కళంకం ఏర్పడే విధంగా నడుచుకుంటున్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నాలుగు మఠాల నిర్వహణ హక్కు, అనుభవం నిత్యానందకు ఉందని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో సమర్పించిన అప్పీలుపై విచారణ జరిపిన న్యాయమూర్తి నాగపట్టణం అనుబంధ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చెల్లుబాటు అవుతుందని తీర్పు వెల్లడించారు.