
సాక్షి, చెన్నై : అర్జున్ సంపత్ దాఖలు చేసిన పరువునష్టం కేసును రద్దు చేయాలని కోరుతూ నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చింది. ఆ వివరాలు ఆదివారం వెల్లడయ్యాయి. హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్. ఇతని గురించి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన స్వామి నిత్యానంద కొన్ని పరువునష్టం వ్యాఖ్యలు చేశారు. నిత్యానందపై కోయంబత్తూరు ఒకటో సెషన్స్ కోర్టులో అర్జున్ సంపత్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు రద్దు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో నిత్యానంద కేసు దాఖలు చేశారు. అందులో 2011లో ఇచ్చిన ఇంటర్వ్యూకు మూడేళ్ల తర్వాత తనపై పరువునష్టం కేసును అర్జున్ సంపత్ దాఖలు చేశారని తెలిపారు. ఈ కేసు రద్దు చేయాలని కోరారు. దీనిపై అనేకసార్లు న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ఇలావుండగా ఈ కేసు న్యాయమూర్తి ఎం దండపాణి సమక్షంలో గత వారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో నిత్యానంద తరఫున హాజరైన న్యాయవాది బాలా డైసీ తన వకాల్తాను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. మరో న్యాయవాది నిత్యానంద తరఫున హాజరుకానున్నట్లు తెలిపారు. న్యాయమూర్తి నిత్యానంద కైలాసం పేరిట ప్రత్యేక దేశాన్ని రూపొందించినట్లు, అక్కడ అతను బసచేసినట్లు చెబుతున్నారని, అతని కోసం కోర్టు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఒక దేశపు సృష్తికర్తను ఎలా సంప్రదిస్తారని వ్యంగ్యంగా ప్రశ్నించారు. తర్వాత ఈ కేసును ఫిబ్రవరి 28కి వాయిదా వేశారు. ఈ కేసుపై మళ్లీ విచారణ జరగగా నిత్యానంద తరఫున న్యాయవాదులు ఎవరూ హాజరుకాలేదు. నిత్యానంద పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment