swamy nityananda
-
ఐక్యరాజ్య సమితి చర్చల్లో నిత్యానంద ‘యూఎస్‌కే’ ప్రతినిధి
ఐక్యరాజ్యసమితి: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్థాపించిన దేశం ‘కైలాస’ ఐక్యరాజ్యసమితి చర్చల్లో పాలుపంచుకుంది. జెనీవాలో సుస్థిర అభివృద్ధి అంశంపై ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ ఈ నెల 24న చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధినంటూ విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఈ చర్చలో పాల్గొని, ప్రసంగించారు. హిందూ మతాన్ని, ఆచార సంప్రదాయాలను ప్రచారం చేస్తున్న నిత్యానందను భారతదేశం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. యూఎస్‌కే తరఫున ఇయాన్ కుమార్ అనే వ్యక్తి కూడా చర్చల్లో పాల్గొన్నారు. అత్యాచారం, అపహరణ కేసుల్లో అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో 2019లో నిత్యానంద దేశ విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అజ్ఞాతంలో ఉంటూనే ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ దీవిని తన సొంత కైలాస దేశమని, 200 కోట్ల మంది హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటించారు. ఐరాస గుర్తింపు పొందాలంటే భద్రతా మండలి, సర్వప్రతినిధి సభ ఆమోదం ముందుగా అవసరం. 193 దేశాల జాబితాలో యూఎస్‌కే లేదు. అయితే, జెనీవా చర్చలో పాల్గొన ద్వారా ఐరాస గుర్తింపు లభించిందనే తప్పుడు అభిప్రాయం కల్పించేందుకు యూఎస్‌కే ప్రయత్నించిందని పరిశీలకులు అంటున్నారు. -
కైలాసనాథుడ్ని ఎలా సంప్రదిస్తారు?
సాక్షి, చెన్నై : అర్జున్ సంపత్ దాఖలు చేసిన పరువునష్టం కేసును రద్దు చేయాలని కోరుతూ నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చింది. ఆ వివరాలు ఆదివారం వెల్లడయ్యాయి. హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్. ఇతని గురించి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన స్వామి నిత్యానంద కొన్ని పరువునష్టం వ్యాఖ్యలు చేశారు. నిత్యానందపై కోయంబత్తూరు ఒకటో సెషన్స్ కోర్టులో అర్జున్ సంపత్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు రద్దు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో నిత్యానంద కేసు దాఖలు చేశారు. అందులో 2011లో ఇచ్చిన ఇంటర్వ్యూకు మూడేళ్ల తర్వాత తనపై పరువునష్టం కేసును అర్జున్ సంపత్ దాఖలు చేశారని తెలిపారు. ఈ కేసు రద్దు చేయాలని కోరారు. దీనిపై అనేకసార్లు న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇలావుండగా ఈ కేసు న్యాయమూర్తి ఎం దండపాణి సమక్షంలో గత వారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో నిత్యానంద తరఫున హాజరైన న్యాయవాది బాలా డైసీ తన వకాల్తాను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. మరో న్యాయవాది నిత్యానంద తరఫున హాజరుకానున్నట్లు తెలిపారు. న్యాయమూర్తి నిత్యానంద కైలాసం పేరిట ప్రత్యేక దేశాన్ని రూపొందించినట్లు, అక్కడ అతను బసచేసినట్లు చెబుతున్నారని, అతని కోసం కోర్టు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఒక దేశపు సృష్తికర్తను ఎలా సంప్రదిస్తారని వ్యంగ్యంగా ప్రశ్నించారు. తర్వాత ఈ కేసును ఫిబ్రవరి 28కి వాయిదా వేశారు. ఈ కేసుపై మళ్లీ విచారణ జరగగా నిత్యానంద తరఫున న్యాయవాదులు ఎవరూ హాజరుకాలేదు. నిత్యానంద పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. -
కైలాసం పూర్తయింది!
సాక్షి, చెన్నై: పరారీలో ఉన్న స్వామి నిత్యానంద తాజా వీడియో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. కైలాసం నిర్మాణం పూర్తయిందని, ఇకపై తాను తమిళనాడుకు రానని అతడు చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. కాగా స్వామి నిత్యానందపై బెంగళూరుకు చెందిన జనార్దన్ శర్మ గుజరాత్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందులో శర్మ తన ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్ చేసి అహ్మదాబాద్ ఆశ్రమంలో నిర్బంధించారంటూ చేసిన ఫిర్యాదుతో నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైంది. వరుస కేసుల క్రమంలో నిత్యానంద విదేశాలకు పరారయ్యాడు. కిడ్నాప్ కేసులో గుజరాత్ పోలీసులు అంతర్జాతీయ పోలీసుల (ఇంటర్‌పోల్) సాయం కోరారు. అయినప్పటికీ అతను ఉన్న ప్రాంతాన్ని గుర్తించలేకపోయారు. ఇలావుండగా నిత్యానంద వెల్లడించినట్లుగా ఒక కొత్త వీడియో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. అందులో నిత్యానంద కైలాసం నిర్మాణం పూర్తయిందని, ఇకపై తాను తమిళనాడుకు రానని వెల్లడించాడు. తాను మృతి చెందితే తన భౌతికకాయాన్ని బిడది శ్రమంలో ఖననం చేయాలని, అదే తన చివరి ఆశ అని అందులో తెలిపాడు. కాగా నిత్యానంద ఈక్వెడార్ సమీపం కైలాసం పేరుతో కొత్త దీవిని ఏర్పాటుచేసి స్వత్రంత్ర దేశంగా రూపొందించే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డ విషయం విదితమే. -
ఇంతకూ నిత్యానంద కథేంటి?
జంతువులతో మాట్లాడిస్తానన్నాడు. ఏలియన్స్‌తో ముచ్చట్లు పెట్టానని కోతలు కోశాడు! తిక్కరేగి ఓసారి.. సూర్యోదయాన్ని కూడా ఆపేశానంటూ భక్తులకు గుండెపోటు తెప్పించాడు. ఆ మాటకొస్తే తనను మించిన భగవంతుడే లేడని చెప్పుకున్నాడు నిత్యానంద. కట్ చేస్తే..దేశం విడిచి పరారయ్యాడు. ఇంతకూ నిత్యానంద కథేంటి..? వేలసంఖ్యలోఅనుచర గణాన్ని పోగేసుకున్న నిత్యానందకు.. దేశం విడిచి పారిపోవాల్సిన అవసరం ఏం వచ్చింది? వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గుట్టుచప్పుడు కాకుండా కొన్ని నెలల మందే దేశం నుంచి జంపయ్యాడు. గుజరాత్ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. అనేక వివాదాలతో పలుమార్లు పతాక శీర్షికలు ఎక్కిన నిత్యానంద..తమిళనాడులోని బిడిదితో పాటు అహ్మదాబాద్‌లో నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్ధనశర్మ అనే ఓ వ్యక్తి కేసు పెట్టాడు. ఈ కంప్లైంట్ గుజరాత్ హైకోర్టు వరకూ వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. గుజరాత్లో ఆశ్రమాన్ని నిర్వహిస్తోన్న సాధ్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధ్వి కిరణ్ అనే ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమంలో పరిస్థితిని చూసిన పోలీసులు..అక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు. నిత్యానంద ఆశ్రమంలోనుండి బయట పడ్డ 15 ఏళ్ల బాలిక అక్కడ జరుగుతున్న అరాచకాలను వివరించింది. నిత్యానంద ఆశ్రమంలో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసేవారని చెప్పుకొచ్చింది. స్వామీజీకి విరాళాలు సేకరించేందుకు తమతో ప్రమోషనల్ వీడియోలు చేయించేవారని..మాట వినకపోతే చిత్రహింసలు పెట్టేవారని వివరించింది. నిత్యానందను తొమ్మిదేళ్లనాటి కేసు వెంటాడుతోంది. ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారం చేసాడని ఆరోపణ దాదాపు నిర్ధారణ అయింది. అప్పట్నుంచే నిత్యానంద బైట కన్పించడం లేదు. మరోవైపు గతంలో ఉన్న కేసుల్లో నిత్యానంద 40కిపైగా వాయిదాలకు కోర్టులో హాజరుకాలేదు.ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో నిత్యానంద నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయాడు. 2010 నటి రంజితతో సరసాల వీడియో బయటకు వచ్చిన తర్వాత పరువు పోగొట్టుకున్నాడు నిత్యానంద. ఈ కేసులో నిత్యానందను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల తర్వాత బెయిలుపై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా అనేకమార్లు వార్తల్లో నిలిచాడు. జంతువులకు తమిళ్, సంస్కృతంలో మాట్లాడేలా ట్రైనింగ్ ఇస్తా అంటూఆ మధ్య సవాల్ కూడా విసిరాడు నిత్యానంద. అందుకోసం ఐన్ స్టీన్ ఫేమస్ సూత్రం E= MC 2 ఉపయోగపడుతుందంటూ లాజిక్ లేని మ్యాజిక్ కబుర్లు చెప్పాడు. సూర్యుడిని 40 నిమిషాలు ఉదయించకుండా ఆపానని కూడా ఓసారి చెప్పుకొచ్చాడు ఈ నిత్యానందుడు. శాస్త్రవేత్తలు అంగారకుడిపై జీవం కోసం ఇప్పటికీ వెతుకుతుంటే..చాలా ఏళ్ల క్రితమే చాలా గ్రహాలపై జీవం ఉందని నిత్యానంద చెప్పేశాడు. అక్కడి నుంచి వారు ఎడ్యుకేషనల్ టూర్ కోసం భూమిపైకి వస్తుంటారని..వాళ్లతో చాలాసార్లు మాట్లాడనంటూ భక్తుల చెవిలో పువ్వులు పెట్టాడు నిత్యానంద. ఇలా నిత్యనంద వాదనలు, ప్రవచనాల లిస్టు చాలా పెద్దదే. అయితే, నిత్యానందను నమ్మేవారి సంఖ్య ఇప్పటికీ వేల సంఖ్యలో ఉంది.మనదేశంతో పాటు విదేశాల్లో కూడా ఇతగాడికి భక్తులు ఉన్నారు. తమిళనాడులో పుట్టిన నిత్యానంద..తనను తాను భగవంతుడిగా చెప్పుకుంటాడు.ఇక ఆశ్రమాల్లో ఇతడు చేసే డ్యాన్సులకు, వింతవింత చేస్టలకైతే కొదవేలేదు. వరుస వివాదాలు, అరెస్ట్ భయంతో దేశం విడిచిపోవాలని నిత్యానంద ఎప్పటినుండో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.చిత్రమేంటంటే.. నిత్యానంద పాస్‌పోర్ట్ 2018 సెప్టెంబర్‌లోనే గడువు తీరిపోయింది. అది తిరిగి రెన్యువల్ కాలేదు. అలాంటి వ్యక్తి విదేశాలకు ఎలా పారిపోయారన్నది తేలాల్సి ఉంది. చేతులు కాలాకా ఇప్పుడు తీరిగ్గా ఆకులు పట్టుకున్న కేంద్ర విదేశాంగ శాఖ ఆయన్ని తిరిగి భారత్ రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. అది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. -
ఆవుతో మాట్లాడిస్తా..
చెన్నై : వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. జంతువులతో తాను మాట్లాడిస్తానని శాస్ర్తీయంగా దీన్ని నిరూపిస్తానని చెప్పారు. గోవులు మీతో తమిళం, సంస్కృతంలో మాట్లాడేలా చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అత్యున్నత స్పృహ ద్వారా జంతువులకు భాషపై స్పృహ, మాట్లాడే వరం ప్రసాదించవచ్చని నిత్యానంద చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. శాస్త్ర ఆధారాలతో తాను దీన్ని నిరూపిస్తానని ఆయన అంటున్నారు. కోతులు సహా ఇతర జంతువులకు మనకు ఉన్నన్ని శరీర అవయవాలు లేకున్నా నిత్యచైతన్య శక్తిని ప్రేరేపించడం ద్వారా అవి ఆయా అవయవాలను పెంపొందించుకోగలుగుతాయని, శాస్త్రపరంగా, వైద్యపరంగా ఈ అంశాన్ని తాను రుజువు చేస్తానని చెప్పారు. ఏడాదిలోగా తాను దీన్ని ప్రజల ముందుకు తీసుకువస్తానన్నారు. తాను త్వరలోనే కోతులు, పులులు, సింహాల కోసం ఫోనెటిక్, భాషా సామర్థ్యమున్న వోకల్ కార్డును అభివృద్ధి చేస్తానన్నారు. మనతో సంస్కృతంలో, తమిళంలో స్పష్టంగా మాట్లాడే ఎద్దులు, ఆవులను మనం చూడబోతున్నామని చెప్పుకొచ్చారు. -
రాసలీలల వీడియోలో ఉన్నది నిత్యానందే....
సాక్షి, న్యూఢిల్లీ : వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. తన అనుంగు శిష్యురాలు రంజితతో కలిసి సన్నిహితంగా... వీడియో టేపులలో ఉన్నది స్వామి నిత్యానందేనని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేసింది. దీంతో ఈ సాములోరు మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా నటి రంజితతో కలిసి ఉన్న రాసలీలల వీడియోల్లో ఉన్నది తాను కాదని, మార్ఫింగ్ జరిగిందంటూ ఇప్పటివరకూ నిత్యానంద వాదిస్తూ వచ్చారు. అయితే సీడీల్లో ఉన్నది నిత్యానందేనని ధ్రువీకరిస్తూ... ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ఓ నివేదిక బుధవారం వెలుగులోకి వచ్చింది. 2010లో స్వామి నిత్యానంద రాసలీలల సీడీని ఆయన కారు డ్రైవర్ లీక్ చేయడంతో... ఆ దృశ్యాలు మీడియాతో పాటు, సోషల్ మీడియాలోనూ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రపన్నారని ఆయన ఆరోపణలు కూడా చేశారు. కాగా ఇప్పటికే నిత్యానందపై పలు కేసులు నమోదు అయిన విషయం విదితమే. అంతేకాకుండా నిత్యానంద తనపై అత్యాచారం చేశారంటూ ఆరతీరావ్ అనే శిష్యురాలు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2010 సంవత్సరంలో ఆయనపై రేప్ కేసు నమోదు అయింది. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని, అందువల్ల తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించకూడదన్న నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లింగ సామర్ధ్య నిర్దారణ పరీక్షలకు ఆయన అంగీకరించకపోవడంపై ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించింది కూడా. -
నకిలీ బాబాల్లో నిత్యానంద ఎందుకు లేడు?
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలు శిక్ష పడిన నేపథ్యంలో దేశంలో 14 మంది నకిలీ బాబాలు ఉన్నారంటూ అఖిల భారత అఖార పరిషద్ ఆదివారం ఓ జాబితాను విడుదల చేసింది. అయితే అందులో స్వామి నిత్యానంద పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాబాల్లో ఒకడైన నిత్యానందపై 2009లో కర్ణాటకలో రేప్ కేసు దాఖలైంది. ఆయన స్థాపించిన ఫౌండేషన్‌పై ఏడు అవినీతి కేసులు ఉన్నాయి. అమెరికా నుంచి కూడా ఆయనకు అక్రమంగా నిధులందాయన్న ఆరోపణలూ ఉన్నాయి. నకిలీ బాబాల జాబితాలో నిత్యానంద పేరును కూడా చేర్చాలని జునా అఖారాకు చెందిన హరిగిరి ప్రతిపాదించినప్పటికీ మహానిర్వాణి అఖారాలు తీవ్రంగా అభ్యంతరం పెట్టడంతో ఆయన పేరు జాబితాలో చేరలేదని నిర్వాణి అఖారాకు చెందిన చీఫ్ ధరమ్ దాస్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 13 అఖారాలు ఆదివారం నాడు అలహాబాద్‌లో సమావేశమై నకిలీ బాబాల జాబితాను తయారు చేశారు. నకిలీ బాబాల కారణంగా అసలైన బాబాల ప్రతిష్ట కూడా దిగజారిపోతోందని, అందుకనే నకిలీ బాబాల జాబితాను విడుదలచేసి వారికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునివ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది. ఈ 13 అఖారాల్లో ఏడు శైవ తెగకు చెందిన అఖారాలుకాగా మూడు వైష్ణవ తెగకు, మూడు సిక్కు తెగకు చెందిన అఖారాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏర్పాటయినదే అఖిల భారత అఖార పరిషద్. 2013, అలహాబాద్ కుంభమేళాలో నిత్యానంద్‌కు మహామండలేశ్వర్, మహానిర్వాణి అఖారాకు చెందిన ప్రధాన పూజారి పట్టాభిషేకం చేసినందున ఆయన పేరును నకిలీ బాబాల జాబితాలో చేర్చేందుకు మహానిర్వాణి అఖారాలు నిరాకరించారు. నకిలీ బాబాల జాబితాలో గుర్మీత్ సింగ్ సహా ఆరెస్సెస్ సభ్యుడు అసీమానంద్ లేదా ఆశారామ్, ఆయన కుమారుడు నారాయణ్ సాయి, రాధేమా, సచ్దానంద్ గిరి, నిర్మల్ బాబాల పేర్లు చోటుచేసుకున్నాయి. సమాజం నుంచి నకిలీ బాబాలను నిర్మూలించడం పట్ల మహానిర్వాణి అఖారాలకు చిత్తశుద్ధి లేదని, దిగంబర అఖారాకు చెందిన బాబా హఠ్ యోగి విమర్శించారు. అఖారాల్లో చాలా మంది పేరుకే సాధువులని, వారు డబ్బులు తీసుకొని కావాల్సిన బిరుదులు ఇస్తుంటారని నిర్వాణి అఖారాకు చెందిన సత్యేంద్ర దాస్ ఆరోపించారు. నకిలీ బాబాల జాబితా నుంచి నిత్యానందను తప్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన అఖిల భారత ఆఖార పరిషద్ అధ్యక్షుడు నరేంద్ర గిరిపైనే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. రియల్టర్ వ్యాపారం చేసే ఆయనకు ఓ బారు కూడా ఉందన్నది అందులో ఓ ఆరోపణ. -
స్వామి నిత్యానందకు ఊరట
చెన్నై: తమిళనాడులోని నాలుగు మఠాలకు సంబంధించి నిత్యానందపై నమోదైన కేసుకు సంబంధించి ఆయనకు మద్రాస్ హైకోర్టులో అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బెంగళూరు సమీపంలోని బిడది మఠం పీఠాధిపతిగా ఉన్న నిత్యానంద 2014 ఏప్రిల్ 15న వేదారణ్యంలోని పీకే సాధువుల మఠం, పంచనాదకుళం శ్రీ అరుణాచల జ్ఞానదేశికనస్వామి మఠం, తిరువారూరు సోమనాథస్వామిగళ్ మఠం, తంజావూరు బాలస్వామి, శంకరస్వామి మఠాలకు చట్టప్రకారం మఠాధిపతిగా నియమితులయ్యారు. అయితే ఆ నాలుగు మఠాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాగుతుండగా కొంతమంది ప్రోద్బలంతో ఆత్మానంద, ధ్రువానంద, జ్ఞానేశ్వరానంద తదితరులు తమ మద్దతుదారులకు ఆశ్రయమిచ్చి సంఘవ్యతిరేక కలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆత్మానందతో పాటు అతని అనుచరులను తొలగించాలని కోరుతూ దీనిపై ఆయన నాగపట్టణం అనుబంధ న్యాయస్థానంలో కేసు వేశారు. నాలుగు మఠాలపై హక్కు తనకు ఉందని, అయితే కొంతమంది తన పేరుకు కళంకం ఏర్పడే విధంగా నడుచుకుంటున్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నాలుగు మఠాల నిర్వహణ హక్కు, అనుభవం నిత్యానందకు ఉందని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో సమర్పించిన అప్పీలుపై విచారణ జరిపిన న్యాయమూర్తి నాగపట్టణం అనుబంధ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చెల్లుబాటు అవుతుందని తీర్పు వెల్లడించారు.