ఇంతకూ నిత్యానంద కథేంటి? | Is Nityananda Kailasam Country False | Sakshi
Sakshi News home page

ఇంతకూ నిత్యానంద కథేంటి?

Published Sun, Dec 8 2019 7:47 PM | Last Updated on Sun, Dec 8 2019 8:17 PM

Is Nityananda Kailasam Country False - Sakshi

జంతువులతో మాట్లాడిస్తానన్నాడు. ఏలియన్స్‌తో ముచ్చట్లు పెట్టానని కోతలు కోశాడు! తిక్కరేగి ఓసారి.. సూర్యోదయాన్ని కూడా ఆపేశానంటూ భక్తులకు గుండెపోటు తెప్పించాడు. ఆ మాటకొస్తే తనను మించిన భగవంతుడే లేడని చెప్పుకున్నాడు నిత్యానంద. కట్ చేస్తే..దేశం విడిచి పరారయ్యాడు. ఇంతకూ నిత్యానంద కథేంటి..? వేలసంఖ్యలోఅనుచర గణాన్ని పోగేసుకున్న నిత్యానందకు.. దేశం విడిచి పారిపోవాల్సిన అవసరం ఏం వచ్చింది?

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గుట్టుచప్పుడు కాకుండా కొన్ని నెలల మందే దేశం నుంచి జంపయ్యాడు. గుజరాత్‌ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. అనేక వివాదాలతో పలుమార్లు పతాక శీర్షికలు ఎక్కిన నిత్యానంద..తమిళనాడులోని బిడిదితో పాటు  అహ్మదాబాద్‌లో నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్ధనశర్మ అనే ఓ వ్యక్తి కేసు పెట్టాడు. ఈ కంప్లైంట్‌ గుజరాత్ హైకోర్టు వరకూ వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

గుజరాత్‌లో ఆశ్రమాన్ని నిర్వహిస్తోన్న సాధ్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధ్వి కిరణ్ అనే ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమంలో పరిస్థితిని చూసిన పోలీసులు..అక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు. నిత్యానంద ఆశ్రమంలోనుండి బయట పడ్డ 15 ఏళ్ల బాలిక అక్కడ జరుగుతున్న అరాచకాలను వివరించింది. నిత్యానంద ఆశ్రమంలో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసేవారని చెప్పుకొచ్చింది. స్వామీజీకి విరాళాలు సేకరించేందుకు తమతో ప్రమోషనల్‌ వీడియోలు చేయించేవారని..మాట వినకపోతే చిత్రహింసలు పెట్టేవారని వివరించింది.

నిత్యానందను తొమ్మిదేళ్లనాటి కేసు వెంటాడుతోంది. ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారం చేసాడని ఆరోపణ దాదాపు నిర్ధారణ అయింది. అప్పట్నుంచే నిత్యానంద బైట కన్పించడం లేదు. మరోవైపు గతంలో ఉన్న కేసుల్లో నిత్యానంద 40కిపైగా వాయిదాలకు కోర్టులో హాజరుకాలేదు.ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో నిత్యానంద నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయాడు. 2010 నటి రంజితతో సరసాల వీడియో బయటకు వచ్చిన తర్వాత పరువు పోగొట్టుకున్నాడు నిత్యానంద. ఈ కేసులో నిత్యానందను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల తర్వాత బెయిలుపై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా అనేకమార్లు వార్తల్లో నిలిచాడు. జంతువులకు తమిళ్, సంస్కృతంలో మాట్లాడేలా ట్రైనింగ్‌ ఇస్తా అంటూఆ మధ్య సవాల్‌ కూడా విసిరాడు నిత్యానంద. అందుకోసం ఐన్ స్టీన్ ఫేమస్ సూత్రం E= MC 2 ఉపయోగపడుతుందంటూ లాజిక్‌ లేని మ్యాజిక్‌ కబుర్లు చెప్పాడు. సూర్యుడిని 40 నిమిషాలు ఉదయించకుండా ఆపానని కూడా ఓసారి చెప్పుకొచ్చాడు ఈ నిత్యానందుడు.

శాస్త్రవేత్తలు అంగారకుడిపై జీవం కోసం ఇప్పటికీ వెతుకుతుంటే..చాలా ఏళ్ల క్రితమే చాలా గ్రహాలపై జీవం ఉందని నిత్యానంద చెప్పేశాడు. అక్కడి నుంచి వారు ఎడ్యుకేషనల్ టూర్ కోసం భూమిపైకి వస్తుంటారని..వాళ్లతో చాలాసార్లు మాట్లాడనంటూ భక్తుల చెవిలో పువ్వులు పెట్టాడు నిత్యానంద. ఇలా నిత్యనంద వాదనలు, ప్రవచనాల లిస్టు చాలా పెద్దదే. అయితే, నిత్యానందను నమ్మేవారి సంఖ్య ఇప్పటికీ వేల సంఖ్యలో ఉంది.మనదేశంతో పాటు విదేశాల్లో కూడా ఇతగాడికి భక్తులు ఉన్నారు. తమిళనాడులో పుట్టిన నిత్యానంద..తనను తాను భగవంతుడిగా చెప్పుకుంటాడు.ఇక ఆశ్రమాల్లో ఇతడు చేసే డ్యాన్సులకు, వింతవింత చేస్టలకైతే కొదవేలేదు. వరుస వివాదాలు, అరెస్ట్‌ భయంతో దేశం విడిచిపోవాలని నిత్యానంద ఎప్పటినుండో ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది.చిత్రమేంటంటే.. నిత్యానంద పాస్‌పోర్ట్ 2018 సెప్టెంబర్‌లోనే గడువు తీరిపోయింది. అది తిరిగి రెన్యువల్ కాలేదు. అలాంటి వ్యక్తి విదేశాలకు ఎలా పారిపోయారన్నది తేలాల్సి ఉంది. చేతులు కాలాకా ఇప్పుడు తీరిగ్గా ఆకులు పట్టుకున్న కేంద్ర విదేశాంగ శాఖ ఆయన్ని తిరిగి భారత్‌ రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. అది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చెప్పలేని పరిస్థితి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement