నకిలీ బాబాల్లో నిత్యానంద ఎందుకు లేడు?
నకిలీ బాబాల్లో నిత్యానంద ఎందుకు లేడు?
Published Wed, Sep 13 2017 5:19 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలు శిక్ష పడిన నేపథ్యంలో దేశంలో 14 మంది నకిలీ బాబాలు ఉన్నారంటూ అఖిల భారత అఖార పరిషద్ ఆదివారం ఓ జాబితాను విడుదల చేసింది. అయితే అందులో స్వామి నిత్యానంద పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాబాల్లో ఒకడైన నిత్యానందపై 2009లో కర్ణాటకలో రేప్ కేసు దాఖలైంది. ఆయన స్థాపించిన ఫౌండేషన్‌పై ఏడు అవినీతి కేసులు ఉన్నాయి. అమెరికా నుంచి కూడా ఆయనకు అక్రమంగా నిధులందాయన్న ఆరోపణలూ ఉన్నాయి.
నకిలీ బాబాల జాబితాలో నిత్యానంద పేరును కూడా చేర్చాలని జునా అఖారాకు చెందిన హరిగిరి ప్రతిపాదించినప్పటికీ మహానిర్వాణి అఖారాలు తీవ్రంగా అభ్యంతరం పెట్టడంతో ఆయన పేరు జాబితాలో చేరలేదని నిర్వాణి అఖారాకు చెందిన చీఫ్ ధరమ్ దాస్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 13 అఖారాలు ఆదివారం నాడు అలహాబాద్‌లో సమావేశమై నకిలీ బాబాల జాబితాను తయారు చేశారు. నకిలీ బాబాల కారణంగా అసలైన బాబాల ప్రతిష్ట కూడా దిగజారిపోతోందని, అందుకనే నకిలీ బాబాల జాబితాను విడుదలచేసి వారికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునివ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది.
ఈ 13 అఖారాల్లో ఏడు శైవ తెగకు చెందిన అఖారాలుకాగా మూడు వైష్ణవ తెగకు, మూడు సిక్కు తెగకు చెందిన అఖారాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏర్పాటయినదే అఖిల భారత అఖార పరిషద్. 2013, అలహాబాద్ కుంభమేళాలో నిత్యానంద్‌కు మహామండలేశ్వర్, మహానిర్వాణి అఖారాకు చెందిన ప్రధాన పూజారి పట్టాభిషేకం చేసినందున ఆయన పేరును నకిలీ బాబాల జాబితాలో చేర్చేందుకు మహానిర్వాణి అఖారాలు నిరాకరించారు. నకిలీ బాబాల జాబితాలో గుర్మీత్ సింగ్ సహా ఆరెస్సెస్ సభ్యుడు అసీమానంద్ లేదా ఆశారామ్, ఆయన కుమారుడు నారాయణ్ సాయి, రాధేమా, సచ్‌దానంద్ గిరి, నిర్మల్ బాబాల పేర్లు చోటుచేసుకున్నాయి.
సమాజం నుంచి నకిలీ బాబాలను నిర్మూలించడం పట్ల మహానిర్వాణి అఖారాలకు చిత్తశుద్ధి లేదని, దిగంబర అఖారాకు చెందిన బాబా హఠ్ యోగి విమర్శించారు. అఖారాల్లో చాలా మంది పేరుకే సాధువులని, వారు డబ్బులు తీసుకొని కావాల్సిన బిరుదులు ఇస్తుంటారని నిర్వాణి అఖారాకు చెందిన సత్యేంద్ర దాస్ ఆరోపించారు. నకిలీ బాబాల జాబితా నుంచి నిత్యానందను తప్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన అఖిల భారత ఆఖార పరిషద్ అధ్యక్షుడు నరేంద్ర గిరిపైనే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. రియల్టర్ వ్యాపారం చేసే ఆయనకు ఓ బారు కూడా ఉందన్నది అందులో ఓ ఆరోపణ.
Advertisement