Akhil Bharatiya Akhara Parishad
-
నకిలీ బాబాల్లో నిత్యానంద ఎందుకు లేడు?
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలు శిక్ష పడిన నేపథ్యంలో దేశంలో 14 మంది నకిలీ బాబాలు ఉన్నారంటూ అఖిల భారత అఖార పరిషద్ ఆదివారం ఓ జాబితాను విడుదల చేసింది. అయితే అందులో స్వామి నిత్యానంద పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాబాల్లో ఒకడైన నిత్యానందపై 2009లో కర్ణాటకలో రేప్ కేసు దాఖలైంది. ఆయన స్థాపించిన ఫౌండేషన్‌పై ఏడు అవినీతి కేసులు ఉన్నాయి. అమెరికా నుంచి కూడా ఆయనకు అక్రమంగా నిధులందాయన్న ఆరోపణలూ ఉన్నాయి. నకిలీ బాబాల జాబితాలో నిత్యానంద పేరును కూడా చేర్చాలని జునా అఖారాకు చెందిన హరిగిరి ప్రతిపాదించినప్పటికీ మహానిర్వాణి అఖారాలు తీవ్రంగా అభ్యంతరం పెట్టడంతో ఆయన పేరు జాబితాలో చేరలేదని నిర్వాణి అఖారాకు చెందిన చీఫ్ ధరమ్ దాస్ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 13 అఖారాలు ఆదివారం నాడు అలహాబాద్‌లో సమావేశమై నకిలీ బాబాల జాబితాను తయారు చేశారు. నకిలీ బాబాల కారణంగా అసలైన బాబాల ప్రతిష్ట కూడా దిగజారిపోతోందని, అందుకనే నకిలీ బాబాల జాబితాను విడుదలచేసి వారికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునివ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది. ఈ 13 అఖారాల్లో ఏడు శైవ తెగకు చెందిన అఖారాలుకాగా మూడు వైష్ణవ తెగకు, మూడు సిక్కు తెగకు చెందిన అఖారాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏర్పాటయినదే అఖిల భారత అఖార పరిషద్. 2013, అలహాబాద్ కుంభమేళాలో నిత్యానంద్‌కు మహామండలేశ్వర్, మహానిర్వాణి అఖారాకు చెందిన ప్రధాన పూజారి పట్టాభిషేకం చేసినందున ఆయన పేరును నకిలీ బాబాల జాబితాలో చేర్చేందుకు మహానిర్వాణి అఖారాలు నిరాకరించారు. నకిలీ బాబాల జాబితాలో గుర్మీత్ సింగ్ సహా ఆరెస్సెస్ సభ్యుడు అసీమానంద్ లేదా ఆశారామ్, ఆయన కుమారుడు నారాయణ్ సాయి, రాధేమా, సచ్దానంద్ గిరి, నిర్మల్ బాబాల పేర్లు చోటుచేసుకున్నాయి. సమాజం నుంచి నకిలీ బాబాలను నిర్మూలించడం పట్ల మహానిర్వాణి అఖారాలకు చిత్తశుద్ధి లేదని, దిగంబర అఖారాకు చెందిన బాబా హఠ్ యోగి విమర్శించారు. అఖారాల్లో చాలా మంది పేరుకే సాధువులని, వారు డబ్బులు తీసుకొని కావాల్సిన బిరుదులు ఇస్తుంటారని నిర్వాణి అఖారాకు చెందిన సత్యేంద్ర దాస్ ఆరోపించారు. నకిలీ బాబాల జాబితా నుంచి నిత్యానందను తప్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన అఖిల భారత ఆఖార పరిషద్ అధ్యక్షుడు నరేంద్ర గిరిపైనే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. రియల్టర్ వ్యాపారం చేసే ఆయనకు ఓ బారు కూడా ఉందన్నది అందులో ఓ ఆరోపణ. -
బాబా రాందేవ్‌పై డిగ్గీరాజా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అనుచరులను మరీ ముఖ్యంగా ఆయన భక్తులుగా అభివర్ణించుకునే వారిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఇటీవల ఓ పోస్ట్ పెట్టిన దిగ్విజయ్.. తాజాగా యోగా గురువు బాబా రాందేవ్ ను దొంగ బాబా అని పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అఖిల భారతీయ ఆకార పరిషత్ ఆదివారం 14 మంది దొంగ బాబాల పేర్లను వెల్లడించింది. కానీ బాబా రాందేవ్ పేరును దొంగ బాబాల జాబితాలో చేర్చకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తూ.. నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం చేసే రాందేవ్ కూడా నకిలీ బాబేనని దిగ్విజయ్ అన్నారు. మనుస్మృతి ప్రకారం కాషాయం ధరించి ఆధ్యాత్మికవేత్తగా ఉన్న వ్యక్తి వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలంటూ అఖిల భారతీయ ఆకార పరిషత్ ను అడిగారు. అదేవిధంగా నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరును చేర్చాలంటూ పరిషత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. 14 మంది నకిలీ బాబాలు ఉన్నారంటూ అఖిల భారతీయ ఆకార పరిషత్ ఆదివారం వారి జాబితా విడుదల చేసింది. ఇందులో ఆశారాం బాబు, రాధేమా, సచ్‌దరంగి, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఓం బాబా, నిర్మల్ బాబా, విశ్వానంద్, స్వామి అశ్మిదానంద్, ఓం నమః శివాయ్, నారాయణ్ సాయి రాంపాల్‌లు ఉన్నారు. దీనిపై స్పందించిన దిగ్విజయ్.. నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరు లేకపోవడం విచారకరమన్నారు.