బాబా రాందేవ్‌పై డిగ్గీరాజా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అనుచరులను మరీ ముఖ్యంగా ఆయన భక్తులుగా అభివర్ణించుకునే వారిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఇటీవల ఓ పోస్ట్ పెట్టిన దిగ్విజయ్.. తాజాగా యోగా గురువు బాబా రాందేవ్ ను దొంగ బాబా అని పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అఖిల భారతీయ ఆకార పరిషత్ ఆదివారం 14 మంది దొంగ బాబాల పేర్లను వెల్లడించింది. కానీ బాబా రాందేవ్ పేరును దొంగ బాబాల జాబితాలో చేర్చకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.
నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తూ.. నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం చేసే రాందేవ్ కూడా నకిలీ బాబేనని దిగ్విజయ్ అన్నారు. మనుస్మృతి ప్రకారం కాషాయం ధరించి ఆధ్యాత్మికవేత్తగా ఉన్న వ్యక్తి వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలంటూ అఖిల భారతీయ ఆకార పరిషత్ ను అడిగారు. అదేవిధంగా నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరును చేర్చాలంటూ పరిషత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.
14 మంది నకిలీ బాబాలు ఉన్నారంటూ అఖిల భారతీయ ఆకార పరిషత్ ఆదివారం వారి జాబితా విడుదల చేసింది. ఇందులో ఆశారాం బాబు, రాధేమా, సచ్‌దరంగి, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఓం బాబా, నిర్మల్ బాబా, విశ్వానంద్, స్వామి అశ్మిదానంద్, ఓం నమః శివాయ్, నారాయణ్ సాయి రాంపాల్‌లు ఉన్నారు. దీనిపై స్పందించిన దిగ్విజయ్.. నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరు లేకపోవడం విచారకరమన్నారు.