వర్సోవ, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంతాలలో జరుగుతున్న ఉద్యమానికి స్ఫూర్తిని, సంఘీభావాన్ని అందించేందుకు ‘ముంబై తెలుగు బహుజన అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సంఘీభావ సభను ఏర్పాటు చేశారు. తూర్పు అంధేరిలోని పంప్‌హౌజ్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్రపై వక్తలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బి.బి.రాజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చేయడంపై మండిపడ్డారు. తాము ఏంచేసినా అడిగేవారు లేరనే ధీమాతో కాంగ్రెస్ తన ఇష్టానికి నడుచుకుంటోందని విమర్శించారు.
ఆంధ్ర రాష్ట్రంలో జరిగే సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై ఆంధ్రాలోనే కాకుండా మహారాష్ట్రలో కూడా చర్చలు జరుగుతున్నాయన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన మనల్ని ప్రభుత్వం విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి వి.జె.రావు, ఆంధ్ర యువజన సంఘం అధ్యక్షులు ఎస్.బాబు, కార్యదర్శి వి.జేమ్ విక్టర్, ఆంధ్ర ప్రజా సంఘం, విశాలాంధ్ర సంఘం, ఆంధ్ర దళిత యువజన సంఘం, ముంబై తెలుగు పాస్టర్ లీడర్స్ అసోసియేషన్, ముంబై తెలుగు యువసేన, చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్, ఆంధ్ర క్రిస్టియన్ చర్చ్ తదితర సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘సమైక్యాంధ్ర’కు మద్దతుగా సంఘీభావ సభ
Published Tue, Aug 13 2013 12:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
Advertisement