seeamandhra
-
ఉద్యోగులకు కుర్చీలు, టేబుళ్లు కరువు
-
సచివాలయం.. గందరగోళమయం
అస్తవ్యస్తంగా ఉద్యోగులు, ఫైళ్ల మార్పిడి పలు శాఖలకు ఇక్కడ, అక్కడ ఐఏఎస్‌లు లేరు ఇన్‌చార్జీలతో తాత్కాలిక ఏర్పాటు చేసిన సీమాంధ్ర సర్కారు సీమాంధ్ర ఆర్థిక శాఖ ఉద్యోగులకు కుర్చీలు, టేబుళ్లు కరువు సెక్షన్లకు అనువుగా లేని నార్త్ హెచ్ బ్లాకు సీమాంధ్రకు కేటాయించిన బ్లాకుల్లో కనీస వసతులు లేవు హైదరాబాద్: ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర రాష్ట్రాల పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో ఉద్యోగులు, ఫైళ్ల మార్పిడి గందరగోళంగా తయారైంది. అలాగే ఇటు తెలంగాణలోను, అటు సీమాంధ్రలోను పలు శాఖలకు ఐఏఎస్ అధికారులు లేకపోవడంతో సాధారణంగా కొనసాగాల్సిన పరిపాలన స్తంభించిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్‌లలో 44 మందిని తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తాత్కాలికంగా కేటాయించడంతో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్‌లను ఇచ్చింది. దీంతో ఆ ఐఏఎస్ అధికారులందరూ తెలంగాణ ప్రభుత్వానికి చెందిన శాఖల పాలన పనులకే పరిమితం అయ్యారు. ఉదాహరణకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె. జోషి తెలంగాణ ప్రభుత్వానికి వెళ్లిపోవడంతో సీమాంధ్ర ప్రభుత్వంలో మున్సిపల్ శాఖకు ముఖ్యకార్యదర్శి ఎవరూ లేరు. దీంతో ఆ శాఖలో విభజన పనులు అస్తవ్యస్తంగా మారాయి. ఇలా 44 మంది ఐఏఎస్‌లు వదిలి వెళ్లిన శాఖల్లో ప్రస్తుత పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రభుత్వం బుధవారం 22 శాఖలకు ఇన్చార్జిలుగా ఐఏఎస్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీమాంధ్ర పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణ సర్కారుకు కేవలం 44 మంది ఐఏఎస్‌లనే కేటాయించడంతో చాలా శాఖలకు ఐఏఎస్‌లు లేకుండా పోయారు. దీంతో ఆయా శాఖల్లో సాధారణ పరిపాలన అంశాలు కూడా ముందుకు కదలడం లేదు. గదులున్నాయ్.. కుర్చీలు, టేబుళ్లు లేవ్.. మరో పక్క సీమాంధ్ర ప్రభుత్వానికి సచివాలయంలో కేటాయించిన చాలా బ్లాకుల్లో ఉద్యోగులు పనిచేయడానికి కనీస వసతులు కూడా లేవు. దీని కారణంగా తెలంగాణకు చెందిన బ్లాకుల నుంచి సీమాంధ్ర బ్లాకుల్లోకి ఉద్యోగుల మార్పిడిలో జాప్యం జరుగుతోంది. అదే సమయంలో తెలంగాణకు చెందిన ఉద్యోగులు, అధికారులు వారికి కేటాయించిన బ్లాకుల్లోకి రావాలంటే సీమాంధ్రకు చెందిన వారు ఆ బ్లాకులు మారి వెళ్లాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుతం సచివాలయంలోని డీ బ్లాకులో ఆర్థిక శాఖ పనిచేస్తోంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగులకు నార్త్ హెచ్ బ్లాకును కేటాయించారు. ఆ బ్లాకులో రెండో అంతస్తులోని ఐఏఎస్‌ల కార్యాలయాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. అయినా ఆర్థిక శాఖ అధికారులు అజేయ కల్లం, పీవీ రమేశ్, ప్రేమచంద్రారెడ్డి వెళ్లిపోయారు. అయితే అదే బ్లాకులో ఆర్థికశాఖ ఉద్యోగులు పనిచేయడానికి ఏ మాత్రం వీలుగా లేదు. సెక్షన్స్ పనిచేయడానికి వీలుగా అక్కడ విద్యుత్ కనెక్షన్లు, నెట్వర్క్ కనెక్షన్ లేదు. కంప్యూటర్లపై పనిచేయడానికి ఏర్పాట్లు కూడా లేవు. అక్కడ గదులు తప్ప వాటిలో కుర్చీలు, టేబుళ్లు లేవు. ఏ సెక్షన్లో ఎన్ని ఫైళ్లు: బుధవారం డి-బ్లాకులోని సీమాంధ్ర ఆర్థిక శాఖ ఉద్యోగులు ఫైళ్లు, పుస్తకాలను గోనె సంచుల్లో కట్టి సిద్ధంగా పెట్టుకున్నారు. ఏ రాష్ట్రానికి చెందిన ఫైళ్లను ఆ రాష్ట్రానికి ఇచ్చేందుకు వీలుగా.. పలు ఫైళ్లను స్కానింగ్ చేశారు. అయితే ఏ సెక్షన్లో ఎన్ని ఫైళ్లు ఉన్నాయో లెక్క తేల్చలేదు. దీంతో ఇరు రాష్ట్రాలకు చెందిన సెక్షన్ ఆఫీసర్లు.. ఫైళ్ల మార్పిడిపై సందిగ్ధంలో పడ్డారు. ఎన్ని ఉన్నాయో తెలియకుండా ఫైళ్లు అప్పగించారంటూ.. నో డ్యూ సర్టిఫికెట్ ఎలా ఇస్తామనే సందేహం సెక్షన్ ఆఫీసర్లలో నెలకొంది. -
మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పండి
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ : కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం జిల్లాకు వచ్చిన మోసగాళ్లను నమ్మవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి ప్రజలకు సూచించారు. అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటూ మభ్యపెడుతున్న టీడీపీ నాయకులకు ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. శనివారం గుంటూరు నలందానగర్లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలకు, ఉద్యమాలకు, విప్లవాలకు గుంటూరు జిల్లా పెట్టింది పేరు అని, ఇక్కడి ప్రజలు చాలా వివేకవంతులని చెప్పారు. చంద్రబాబు మాయ పథకాలను ప్రజలు విశ్వసించబోరన్నారు. అధికారం కోసం మైనార్టీలు, బీసీలు, కాపులకు ప్రత్యేక బడ్జెట్లు అని ప్రకటిస్తూ రోజుకో కొత్త పథకం ప్రకటిస్తున్న తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారం కోసం ఏగడ్డి క రవటానికైనా సిద్ధపడతారని విమర్శించారు. రాష్ర్టంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని చెప్పారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయటం ద్వారా మహిళలు ఆర్ధికంగా ఎదుగుతారని తెలిపారు. సీమాంధ్ర కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలా అని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు లాలుపురం రాము, థామస్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ముంపు అటే..!
భద్రాచలం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లు క్లైమాక్స్‌కు చేరుకున్న దశలోనూ భద్రాచలమే హాట్‌టాపిక్‌గా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం సీమాంధ్రలో ఉంటే ముంపు ప్రాంతం తెలంగాణలో ఉండటమే దీనికి కారణం. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి సమావేశమైన కేంద్ర కేబినెట్ బిల్లుకు కీలక సవరణలు చేస్తూ తుదిరూపు ఇచ్చింది. పోలవరం ముంపు కింద వచ్చే జిల్లాలోని 134 రెవెన్యూ గ్రామాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి భద్రాచలం డివిజన్ ఎటువైపు అనేది తీవ్ర చర్చనీయాంశంగానే మారింది. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపంపై పూర్తి స్థాయిలో సమీక్ష లేకుండానే కేంద్ర కేబినెట్ హడావిడి నిర్ణయాలు తీసుకోవటమే ఈ గందరగోళానికి కారణమని వాదన వినిపిస్తోంది. పోలవరం ముంపు ప్రాంతాలివే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భద్రాచలం డివిజన్లోని వీఆర్‌పురం, కూనవరం మండలాలు పూర్తిగానూ, చింతూరు, భద్రాచలం మండలాలు పాక్షికంగానూ ముంపునకు గురవుతాయి. ఈ నాలుగు మండలాల్లో మొత్తం 98 రెవెన్యూ గ్రామాలు ముంపు పరిధిలోకి వస్తాయి. ఈ మండలాలకు ఎదురుగా గోదావరి నదికి అవతల ఒడ్డున ఉన్న పాల్వంచ డివిజన్ పరిధిలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగానూ, బూర్గంపాడు మండలం పాక్షికంగా ముంపు పరిధిలోకి వస్తుంది. మొత్తంగా పాల్వంచ రెవెన్యూ డివిజన్లో 36 రెవెన్యూ గ్రామాలు పోలవరం ముంపు కిందకు వస్తాయి. వీటి పరిధిలో మొత్తం 205 గ్రామాలు (హ్యాబిటేషన్)ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ బిల్లులో చేసిన సవరణల ప్రకారం పై గ్రామాలన్నీ సీమాంధ్రకు చెందుతాయి. గతంలో ఏం చేప్పారంటే.. తెలంగాణ బిల్లు ఢిల్లీకి వెళ్లిన సమయంలో సమావేశమైన జీవోఎం రాష్ట్ర అసెంబ్లీ నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు సవరణలు చేపట్టింది. దీనినే కేంద్ర కేబినెట్ యథాతథంగా ఆమోదించింది. దీని ప్రకారం భద్రాచలం రెవెన్యూ డివిజన్, పాల్వంచ డివిజన్లోని 37 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రలో కలుపేందుకు నిర్ణయించారు. భద్రాచలం టెంపుల్ టౌన్( అంటే భద్రాచలం పట్టణం)ను మాత్రం తెలంగాణలోనే కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏం నిర్ణయం తీసుకున్నారంటే బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లుపై చర్చించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ముంపు గ్రామాలనే సీమాంధ్రలో విలీనం చేస్తారు. ఈ లెక్కన ఏడు మండలాల్లోని ముంపు ప్రాంతాలు మాత్రమే సీమాంధ్రకు వెళ్తాయి. ముంపు పరిధిలో లేని గ్రామాలన్నీ యథాతథంగా తెలంగాణలోనే ఉంటాయి. ఈ రకంగానే బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఆదివాసీలకు ఒరిగిందేంటి? పోలవరం నిర్మాణమంటూ జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా...తెలంగాణలో ఉన్నా ఎప్పటికైనా ముంపు గ్రామాలను ఖాళీ చేయాల్సిందే. ఆదివాసీలు రాష్ట్ర విభజన అంశం పక్కన పెట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన లేకుంటే ఏదో రీతిన దీన్ని అడ్డుకోవచ్చని ఇప్పటి వరకు ఆదివాసీలు భావించారు. దీనిపై కోర్టులలో కేసులు కూడా వేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని బహుళార్థక సాధ క ప్రాజెక్టుగా గుర్తించింది. దీన్ని నిర్మించేందుకు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు నిర్ణయించింది.ఇది ఆదివాసీలకు గొడ్డల పెట్టులా మారింది. భౌగోళికంగా ఇబ్బందులే భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లు ముక్కలు చేసి ముంపు ప్రాంతాలను సీమాంధ్రకు, మిగతా గ్రామాలు తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు భావిస్తున్న నిర్ణయం భౌగోళిక ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. చింతూరు, భద్రాచలం, బూర్గంపాడు మండలాలతో పాటు పూర్తిగా ముంపునకు గురయ్యే మండలాల్లో కూడా ఇళ్లు ఒక రాష్ట్రంలో ఉంటే వారి భూములు మరో రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తైబ్యాక్ వాటర్ వచ్చేంత వరకు ఇక్కడనే ఉంటూ వారి భూములను అనుభవించ వచ్చనేది రైతులు ఆశ. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో డివిజన్లు ముక్కలు అవుతుండటం వారికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇక రహదారుల పరిస్థితి కూడా ఇదే రీతిన ఉంటుంది. ఉదాహరణకు భద్రాచలం మండలంలోని విస్సాపురం, చలంపాలెం పరిసర గ్రామాలు వారు ప్రస్తుతం నందిగామ మీదగా భద్రాచలం రావాల్సి ఉంటుంది. కానీ విభజనలో నందిగామ సీమాంధ్ర రాష్ట్రంనకు వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విస్సాపురం వాసులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గ్రామాల మీదగా మళ్లీ తెలంగాణలోని భద్రాచలానికి రావాల్సి ఉంటుంది. వీటి న్నింటి పై సరైన స్పష్టత లేకుండా భౌగోళికంగా సరైన సరిహద్దులు చూపకుండా విభజిస్తే తమ పరిస్థితి ఏంటని ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. -
సమైక్య ‘భజన’
=పులిచింతల సభలో సమైక్యవాదం = సీఎం గొంతుచించుకున్నా స్పందన కరువు = మధ్యలోనే సగం కుర్చీలు ఖాళీ = ప్రాజెక్టు కోసం కృషి చేసిన రైతుల ప్రస్తావన శూన్యం సాక్షి, విజయవాడ : అధిష్టానంపై నిప్పులు చెరిగినా, తాను ఎంత సమైక్యవాదినని గొంతు చించుకున్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగానికి సభికుల నుంచి స్పందన కరువైంది. పులిచింతలను జాతికి అంకితం చేసే సభను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూర్తిగా విభజనపై తన వాదం వినిపించేందుకు ఉపయోగించుకున్నారు. పులిచింతల ఏర్పాటుకోసం తపించి, ఉద్యమాలు చేసిన రైతు నాయకుల ప్రస్తావన కూడా లేకుండా పోయింది. నిరసనలు వ్యక్తమవుతాయన్న భయంతో విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేశారు. విజయవాడలో పట్టాల సమస్య, కార్పొరేషన్ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు, నగరంలో ముంపు ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తారంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన ప్రసంగంలో చెప్పినా.. సీఎం కనీసం పట్టించుకోలేదు. 13 లక్షల ఎకరాలకు సంబంధించి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ ప్రాజెక్టు అయినప్పటికీ రైతులు ఈ సభకు రావడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు పూర్తిగా డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా మహిళలను తరలించడంపై దృష్టి పెట్టారు. చాలా మందికి చెక్కులు ఇస్తామని ఆశపెట్టి తీసుకువచ్చారు. ఇక్కడకు వ చ్చాక బహిరంగ సభ కావడంతో సగం మంది వెనుతిరిగి వెళ్లిపోయారు. జనాన్ని కదిలించలేకపోయిన ప్రసంగాలు... శనివారం సాయంత్రం విజయవాడ స్వరాజ్‌మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు జనాన్ని తరలించగలిగిన కాంగ్రెస్ నేతలు తమ ప్రసంగాలతో వాళ్లను కదిలించలేకపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అధిష్టానాన్నే లక్ష్యంగా చేసుకొని మాటల తూటాలు పేల్చారు. కేంద్రంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవడమే తప్పా అని ప్రశ్నించారు. 2004 తరువాతే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందంటూ పరోక్షంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషిని సీఎం ప్రస్తావించారు. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ కెఎల్.రావు సాగర్ పులిచింతల ప్రాజెక్ట్ ప్రారంభంతో దశాబ్దాల నాటి కల నెరవేరిందన్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులిచింతల ప్రాజె క్టుకు శంకుస్థాపన చేశారని చెబుతుండగా సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ 13 లక్షల ఎకరాలకు సాగునీరందించే పులిచింత ప్రాజెక్ట్ చరిత్రలో నిల్చిపోతుందన్నారు. ఆకట్టుకోని లగడపాటి డైలాగులు... జై సమైక్యాంధ్ర అంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వినూత్న తరహాలో ప్రసంగాన్ని ప్రారంభించినప్పటికీ జనాన్ని ఆకట్టుకోలేకపోయారు. సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ధర్మ పోరాటంలో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి పద్మవ్యూహంలో అభిమన్యుడవుతాడా, లేక అర్జునుడవుతాడా అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందంటూ సినీఫక్కీలో చేసిన డైలాగ్‌కు స్పందన కనిపించలేదు. సగం ఖాళీ పాలకపక్షం నేతలు, అధికార యంత్రాంగం గత వారం రోజులుగా హైరానాపడి సీఎం సభకు భారీగానే జనాన్ని తరలించగలిగారు. డ్వాక్రా మహిళలు, కిరాయి కార్యకర్తలతో ఎట్టకేలకు మధ్యాహ్నానికి సభాస్థలిని నింపగలిగారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు ప్రసంగాలు చేస్తుండగానే జనం కుర్చీల్లోంచి లేవడం ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన మంత్రులు వెంటనే మైక్ సీఎం చేతికి ఇచ్చారు. అప్పటికే వెనక వైపు సగం కుర్చీలు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కాసు కృష్ణారెడ్డి, మాణిక్య వరప్రసాద్, పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, ఎమ్మెల్సీలు పాలడుగు వెంకట్రావ్, గాదె వెంకటరెడ్డి, సింగం బసవ పున్నయ్య, కృష్ణారెడ్డి, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి, దిరిశం పద్మజ్యోతి, డీవై దాస్, కారుమూరి నాగేశ్వరరావు (తణుకు), ఉగ్రనరసింహారెడ్డి (కనిగిరి), మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి సమావేశమౌతున్న జీవోఎం
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన సంబంధిత విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) శనివారం మరోసారి భేటీ కానుంది. ఈరోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయంలో జీవోఎం సమావేశం కానుంది. హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, ఆర్థిక మంత్రి చిదంబరం, ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్, పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్‌తో పాటు ప్రత్యేక ఆహ్వానితునిగా ప్రధాని కార్యాలయ సహాయమంత్రి నారాయణసామి పాల్గొననున్నారు. అవసరమైన పక్షంలో జీవోఎంకు స్వయంగా వివరణలివ్వడానికి అందుబాటులో ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వంలోని సాగునీటి పారుదల, ఆర్థిక, హోం, విద్యుత్, మౌలిక సదుపాయాల శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విభజనకు నిరసనగా సీమాంధ్రలో ఒకపక్క ఆందోళనలు ఉవ్వెత్తున కొనసాగుతుండగా మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన జీవోఎం శనివారం కీలక అంశాలపై దృష్టిసారించనున్నట్టు సమాచారం. -
ఒక్కటే లక్ష్యం.. ముమ్మరంగా ఉద్యమం
సాక్షి: ఒక్కటే లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించడం.. 39రోజులుగా విరామం లేకుండా ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రజ శనివారం సమైక్య పోరాటాన్ని పతాకస్థాయిలో చేపట్టింది. హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో శనివారం ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సంఘీభావంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ప్రదర్శనలు మిన్నంటాయి. హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర న్యాయవాదులపై దాడులకు నిరసనగా వాడవాడలా నిరసనలు చేపట్టారు. చెప్పులు కుట్టి, భిక్షాటన చేసి.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి, చెప్పులు కుట్టి నిరసన వ్యక్తం చేశారు. పాతపట్నంలో మానవహారం, టెక్కలిలో విద్యార్థుల పిరమిడ్ ప్రదర్శన, పలాసలో వైశ్యుల ర్యాలీ జరిగింది. విజయనగరం జిల్లా గరివిడిలో ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాగర్జనను 10 వేల మందికిపైగా సమైక్యవాదులు హోరెత్తించారు. గజపతినగరంలో విశ్వబ్రాహ్మణులు శాంతి ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలో వైద్య ఉద్యోగులు ధర్నా, మున్సిపల్ ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కోలా గురువులు ఆధ్వర్యంలో సమైక్యవాదులు సముద్రంలో పడవలపై నిరసన చేపట్టారు. ఏయూలో దీక్షలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటిపాక గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్)ను శనివారం ముట్టడించారు. ఈ నెల 10లోగా జీసీఏస్, రిఫైనరీ, గెయిల్ ఉత్పత్తి కేంద్రాల్లో కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయకపోతే 11న మూడింటినీ ముట్టడించి కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఉప్పలగుప్తంలో మేకలు, గొర్రెలతో రాస్తారోకో చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు ఆటంకం కలిగిస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మునిసిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో నాలుగు గంటల అనంతరం వారంతా ట్యాంక్ దిగి వచ్చారు. ఏపీఎన్జీవోలకు సంఘీభావంగా పలుచోట్ల బంద్ నిర్వహించారు. విజయవాడలో దుర్గ గుడి ఉద్యోగులు శాంతి హోమం నిర్వహించారు. పొక్లెయిన్ యజమానులు మానవహారం నిర్మించారు. గెజిటెడ్ అధికారులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రోడ్లపై వంటవార్పు నిర్వహించారు. మంగళగిరిలో రిలేదీక్షలు చేస్తున్న పద్మశాలీ సంఘాలకు పట్టణ ప్రజలు సంఘీభావం తెలిపారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన ఉద్యోగులు, న్యాయవాదులు, సాక్షర భారత్ కోఆర్డినేటర్లు గుండ్లకమ్మ నదిలో నిలబడి నిరసన ప్రదర్శన చేపట్టారు. చీరాలలో న్యాయవాదులు నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఉలవపాడులో ఆర్యవైశ్య సంఘం ర్యాలీ చేపట్టింది. సింగరాయకొండలో యూటీఎఫ్ ర్యాలీ, మానవహారం జరిగాయి. సమరయోధుడి దీక్ష భగ్నం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని గండిపాళెంలో స్వాతంత్య్ర సమరయోధుడు అంకయ్య చౌదరి చేపట్టిన ఆమరణదీక్షను శనివారం పోలీసులు భగ్నం చేశారు. చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో తెలుగుతల్లికి పాలాభిషేకం చేశారు. పలమనేరులో ఉపాధ్యాయులు విద్యార్థులకు రోడ్డుపై పాఠాలు చెప్పారు. వైఎస్సార్ జిల్లా కడపలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో డీసీఎంస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోట నరసింహారావు, బీకోడూరు మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి చేపట్టిన ఆమరణదీక్షలు శనివారంతో ఆరో రోజుకు చేరాయి. హైదరాబాద్‌లో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా రాజంపేట, జమ్మలమడుగులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉరితాళ్లు వేసుకుని నిరసన అనంతపురంలో లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఉరితాళ్లు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో దళిత గర్జన హోరెత్తింది. రొద్దంలో వృద్ధులు రిలే దీక్షలు చేపట్టారు. ఉరవకొండలో ముస్లింలు భారీ ర్యాలీ, రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. సీమాంధ్ర న్యాయవాదులపై దాడికి నిరసనగా ఎస్కేయూలో విద్యార్థులు, ఉద్యోగులు రాస్తారోకో చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన పొదుపు లక్ష్మీ గ్రూపు మహిళలు రాస్తారోకో చేశారు. ఎమ్మిగనూరులో సకల జనుల సింహగర్జనను విశేష స్పందన లభించింది. కాగా, సమైక్య సభకు సీమాంధ్ర ఉద్యోగులు వెళ్తున్న వాహనాలపై రాళ్లతో దాడులు చేయడం వంటి దృశ్యాలను టీవీల్లో చూస్తూ ఉద్వేగానికి గురై శనివారం గుండెపోటుతో ఆరుగురు మరణించారు. -
రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటు
జెఎన్టీయూ (విజయనగరం రూరల్), న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రజలు ఆందోళనలు చేపట్టి నెల రోజులు దాటుతున్నా పాలకులు తమ పదవులకు రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గురాన అయ్యలు అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం స్థానిక జాతీయ రహదారిపై జగన్మోహన్రెడ్డి మాస్కులు ధరించి బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే కేసీఆర్ డౌన్ డౌన్, బొత్స డౌన్ డౌన్, సోనియా డౌన్ డౌన్ అంటూ నినదించారు. అనంతరం అయ్యలు మాట్లాడుతూ, స్వార్థ రాజకీయం కోసం రాష్ట్రాన్ని విడగొట్టడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర పాలకులు బుద్ధి తెచ్చుకుని రాష్ర్ట విభజనను వ్యతిరేకించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీయూ(కె) విద్యార్థులు కళాశాల కూడలి, జాతీయ రహదారి పక్కన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సమైక్య రాష్ట్రానికి మద్దతుగా నినాదాలు చేశారు. -
'సమైక్యంగా ఉంచకుంటే రాజకీయలకు గుడ్ బై '
యూపీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తమ పదవులకు రాజీనామా చేయడం అంత పెద్ద విషయం కాదని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు కూడా రాజీనామాలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నారని తెలిపారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలను సస్పెన్షన్ చేసిన సభను సజావుగా సాగకుండా తమ సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్య గళం వినిపించిన సంగతిని లగడపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేసిన పక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే అడ్డుకునే వారు ఎవరు ఉండని ఆయన పేర్కొన్నారు. దాంతో వేర్పాటువాదులకు తమ రాజీనామా ఓ వరంలో మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఎవ్వరు తమ పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామాలు చేయలేదని లగడపాటి తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ విద్యార్థులు లగడపాటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లగడపాటి పై విధంగా స్పందించారు. -
సీమాంధ్ర జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీఎం
ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర జేఏసీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రొళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్వీ మండల శాఖ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణపట్ట వివక్షతతో వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్, టీడీపీ నాయకులు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీమాంధ్రలో కొనసాగుతున్న కృత్రిమ ఉద్యమాల వెనక పెట్టుబడిదారుల హస్తం ఉందన్నారు. వ్యాపారాలు, ఆస్తుల రక్షణ కోసమే పెట్టుబడిదారులు సీమాంధ్రలో ఉద్యమాలను నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు అబ్బసాని యాదగిరియాదవ్, టీఆర్ఎస్వీ మేడ్చల్ నియోజకవర్గ అధ్యక్షుడు చాప భాస్కర్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు అరవింద్, మేడ్చల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ రవీందర్‌యాదవ్, సెక్రెటరీ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు అనంతగిరి, న్యూస్‌లైన్: రెండురోజుల క్రితం హైదరాబాద్‌లో తెలంగాణ న్యాయవాదుల అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ పిలుపుమేరకు వికారాబాద్‌లో శుక్రవారం లాయర్లు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంపూర్ణ ఆనంద్, మాధవరెడ్డిలు మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణలోనూ ఉద్యమం ఉధృతి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు నాగరాజు, జాయింట్ సెక్రెటరీ రమేష్, న్యాయవాదులు నాగేందర్‌గౌడ్, రాంచెందర్‌రావు తదితరులున్నారు. -
ఆజాద్‌ను కలిసిన సీమాంధ్ర ఎంపీలు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అవసరం అయితే మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధమేనని బహిరంగ ప్రకటన చేసిన సీమాంధ్ర ఎంపీలు శుక్రవారం కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను వారు ఈ సందర్భంగా ఆజాద్ దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తాము లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపించాలని వారు డిమాండ్ చేశారు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఆజాద్ ఎంపీలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు సీమాంధ్ర కేంద్రమంత్రులు కూడా డైలమాలో పడ్డారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు పునరాలోచనలో పడ్డాయని, కాంగ్రెస్ కూడా ఆలోచించాలని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈమేరకు వారు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. -
సచివాలయంలో పోటాపోటీ నిరసన ర్యాలీలు
-
సచివాలయంలో పోటాపోటీ నిరసన ర్యాలీలు
సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీగా నిరసన ర్యాలీలు చేశారు. ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనుమతి లేకున్నా సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. తమను అడ్డుకున్న పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సీమాంధ్ర ఉద్యోగులు జే బ్లాక్ వద్ద బైటాయించారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి సచివాలయంతో పాటు హైదరాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు ప్రతిరోజు నిరసనలు, ఆందోళనలకు దిగుతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగులు ప్రదర్శనలు చేపడుతున్నారు. దీంతో సచివాలయంలో నిరసన ప్రదర్శనలపై ప్రభుత్వం నిషేధం విధించింది. -
సీమాంధ్రుల భద్రతకు ఢోకాలేదు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: హైదరాబాద్ నగరంలో సీమాంధ్రులు స్వేచ్ఛగా జీవించవచ్చని, వారి భద్రతకు తాము భరోసా ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. యాచారంలో బోనాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి ఆదివారం ఉదయం శేరిగూడలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు హైదరాబాదే రాజధానిగా ఉంటుందని, ఏ జిల్లా, రాష్ట్రంవారైనా ఇక్కడ ఉండొచ్చని... ఎవరి హక్కులకూ భంగం వాటిల్లదని అన్నారు. హైదరాబాద్ తమ వల్ల అభివృద్ధి చెందిందని సీమాంధ్ర నాయకులు కొందరు పేర్కొనడం హాస్యాస్పదమని అన్నారు. అన్ని ప్రాంతాలవారితో అంచెలంచెలుగా హైదరాబాద్ అభివృద్ధిని సాధించిందే తప్ప ఏ ఒక్కరివల్లనో కాదని అన్నారు. సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మెతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా... క్రమంగా అంతా సద్దుమణుగుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని మొదట్లో చెప్పిన కొన్ని పార్టీలు ఆ తర్వాత ప్లేటు ఫిరాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత సీమాంధ్రకు ప్యాకేజీ అంటూ మాట్లాడటం ఆయనరెండు నాల్కల ధోరణికి నిదర్శనమని విమర్శించారు. తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సమంజసమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దేశంలో హిందీ మాట్లాడే ప్రజలకు ఏడు రాష్ట్రాలున్నాయనే సంగతిని సీమాంధ్ర నాయకులు గుర్తుంచుకోవాలని, రెచ్చగొట్టే ప్రకటనలు మానుకొని అన్నదమ్ముల్లా విడిపోవడానికి సహకరించాలని ఆయన కోరారు. సీమాంధ్రులు తమ సమస్యలను ఆంటోనీ కమిటీకి, కేంద్ర ప్రభుత్వం కొత్తగా వేసిన కమిటీకి తెలుపుకోవాలని మంత్రి సూచించారు. విలేకరుల సమావేశానికి ముందు మంత్రి సారయ్యను పూలమాలలు, శాలువాలతో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, పీసీసీ సభ్యుడు పాశం లక్ష్మీపతి గౌడ్, మాజీ ఎంపీపీలు పి.కృపేశ్, రాచర్ల వెంకటేశ్వర్లు, నాగన్‌పల్లి సింగిల్ విండో చైర్మన్ లక్ష్మణ్‌రావు, కాంగ్రెస్ నాయకులు పండాల రమేశ్ గౌడ్, కర్రె శశిధర్, కప్పాటి రఘు, శ్రీనివాస్‌గౌడ్, జగాల్‌రెడ్డి పాల్గొన్నారు. బీసీ బాలికల వసతిగృహం తనిఖీ సమస్యలు ఏకరువు పెట్టిన విద్యార్థినులు, గ్రామస్తులు యాచారం: మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతిగృహాన్ని ఆదివారం రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య తనిఖీ చేశారు. నేరుగా వంట గదిలోకి వెళ్లిన ఆయన వంటపాత్రల మూత లు తీసి భోజనాన్ని పరిశీలించారు. అనంతరం సమస్యల గురించి విద్యార్థినులను, గ్రామస్తులను ఆరా తీశారు. వార్డెన్ సక్రమం గా ఉండటం లేదని, ఆమె భర్త వచ్చి విద్యార్థినుల గదుల్లో కూర్చొని సిగరెట్లు తాగుతూ ఇబ్బంది కలిగిస్తున్నాడని గ్రామస్తులు ఫిర్యా దు చేశారు. వార్డెన్‌ను మార్చాలని మంత్రిని కోరారు. తాగునీటి వసతి లేకపోవడంతో సమీపంలోని పాఠశాల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని, నెలనెల బిల్లులు కూడా సక్రమంగా అందడం లేదని విద్యార్థినులు సమస్యలు ఏకరువు పెట్టారు. వసతిగృహానికి ప్రహరీ కూడా లేకపోవడంతో రాత్రిళ్లు భయంభయంగా గడుపుతున్నామని తెలిపా రు. విద్యార్థినులు మాట్లాడుతుండగా వార్డెన్ కల్పించుకొని ఏదో చెప్పబోతుండగా మంత్రి వారించారు. పనితీరు మార్చుకోకపోతే చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. వెంటనే విద్యార్థినులకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ మారోజ్ కళమ్మను మంత్రి ఆదేశించారు. కాగా, భవనం కొత్తదైనా నాణ్యత లోపించిందని, పగుళ్లు కన్పిస్తుండటంతో ఎప్పుడు కూలుతోందనని విద్యార్థినులు భయపడుతున్నారని ఉప సర్పంచ్ బాషా, మాజీ ఎంపిపీ రాచర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. నూతన భవన నిర్మాణానికి రూ.30లక్షలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. విద్యార్థినులకు ఆంగ్ల భాషలో నైపుణ్యం కోసం ప్రత్యేక బోధకుడిని నియమించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థినుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఉన్నారు. -
శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలకు సమైక్య సెగ
అనంతపురం జిల్లా వ్యాప్తంగా సీమాంధ్ర నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెనుకొండలో ఈ నెలాఖరున జరగనున్న ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలను వాయిదా వేసినట్లు అనంతపురం ఆర్డీవో శుక్రవారం వెల్లడించారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు ఉత్సవాల ఎప్పుడు జరిగేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఆ ఉత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభించవలసి ఉంది. అయితే జిల్లాలో మాత్రం సమైక్యవాదులు చేపట్టిన నిరసనలు శుక్రవారం 17వ రోజుకు చేరుకుంది. ఏపీఎన్జీవో, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉవ్వెతున్న సాగుతోంది. జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని జాక్టో,రెవెన్యూ, ఉద్యోగులు అనంతపురం నగరంలో రిలే నిరాహర దీక్షలు చేపడుతున్నారు. జిల్లాలోని ధర్మవరం, హిందూపురం, కదిరి, గుంతకల్ పట్టణాల్లో సమైక్య నిరసనలు మిన్నంటుతున్నాయి. -
కాంగ్రెస్ దురాలోచనతోనే విభజన: అమరనాథ్ రెడ్డి
వైఎస్ జగన్‌కు రాష్ట్రంలో అడ్డుకట్ట వేయాలనేదే కాంగ్రెస్ దురాలోచనతోనే రాష్ట్ర విభజనకు పూనుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఈ రోజు రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి కారణం సోనియా గాంధీయేనని ఆయన విమర్శించారు. తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న ఆలోచనతోనే విభజనకు సోనియా మొగ్గు చూపారని ఆయన దుయ్యబట్టారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తోందని అమరనాథ్‌రెడ్డి నిన్న ఆరోపించారు. 1995, 98 మధ్య కాలంలో బీజేపీని మతతత్వ పార్టీ అంటూ తిట్టి, అంటరానిదిగా పరిగణించి వామపక్షాలతో దోస్తీ చేసిన చంద్రబాబు 1999 సంవత్సరం వచ్చే నాటికి బీజేపీ గాలి వీస్తోందని తెలుసుకుని అటు వెళ్లారని విమర్శించారు. తనపై కేసులు పెడతారని, సీబీఐ దర్యాప్తు జరుగుతుందని భీతిల్లిన చంద్రబాబు కొంత కాలంగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నారని.. కేంద్రంలో బీజేపీ వస్తుందేమోనన్న అంచనాతో వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు. -
‘సమైక్యాంధ్ర’కు మద్దతుగా సంఘీభావ సభ
వర్సోవ, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంతాలలో జరుగుతున్న ఉద్యమానికి స్ఫూర్తిని, సంఘీభావాన్ని అందించేందుకు ‘ముంబై తెలుగు బహుజన అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సంఘీభావ సభను ఏర్పాటు చేశారు. తూర్పు అంధేరిలోని పంప్‌హౌజ్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్రపై వక్తలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బి.బి.రాజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చేయడంపై మండిపడ్డారు. తాము ఏంచేసినా అడిగేవారు లేరనే ధీమాతో కాంగ్రెస్ తన ఇష్టానికి నడుచుకుంటోందని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగే సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై ఆంధ్రాలోనే కాకుండా మహారాష్ట్రలో కూడా చర్చలు జరుగుతున్నాయన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన మనల్ని ప్రభుత్వం విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి వి.జె.రావు, ఆంధ్ర యువజన సంఘం అధ్యక్షులు ఎస్.బాబు, కార్యదర్శి వి.జేమ్ విక్టర్, ఆంధ్ర ప్రజా సంఘం, విశాలాంధ్ర సంఘం, ఆంధ్ర దళిత యువజన సంఘం, ముంబై తెలుగు పాస్టర్ లీడర్స్ అసోసియేషన్, ముంబై తెలుగు యువసేన, చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్, ఆంధ్ర క్రిస్టియన్ చర్చ్ తదితర సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అనంతపురం జిల్లాలో 48 గంటల బంద్
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ, సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం జిల్లా బంద్ జరుగుతోంది. 48 గంటల పాటు బంద్ చేపడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, పు రామచంద్రారెడ్డి తెలిపారు. బంద్‌లో ప్రజా సంఘాలు, ఎన్జీఓలు, విద్యార్థి సంఘాలు.. ఇలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బంద్ తీవ్రత ఢిల్లీని తాకాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పెద్దలు కేవలం ఓ ప్రాంతానికి న్యాయం చేయడం కోసం సీమాంధ్ర ప్రజల హక్కులను కాలరాశారని విమర్శించారు. ఇప్పటికీ వారు ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలుసుకుని రాజీనామా చేశారని తెలిపారు. జననేత వైఎస్ జగన్ సీమాంధ్ర ప్రజల మనోభావాలకు పట్టం కట్టారని కొనియాడారు. ఆయన నిర్బంధంలో ఉన్నప్పటికీ అహర్నిశలు ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటే తాము స్వాగతిస్తామని ఎప్పుడో చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. -
దిగజారుడు విమర్శలు చేస్తున్న సీఎం: బాబూరావు
రాష్ట్రంలో పులిలా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ముందు ఎందుకు పిల్లిలా మారిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రశ్నించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేయడం సీఎం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. వైఎస్ హయాంలోనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రులు చాలా మంది రాష్ట్రాన్ని ఏలినా ఎందుకు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయారని ప్రశ్నించారు. విశాఖలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ ఆరోపించారు. అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయేతర ఐక్యకార్యాచరణ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. -
సీఎం వ్యాఖ్యలపై గీతారెడ్డి నో కామెంట్
పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని మంత్రి జె. గీతారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై ఎవరెన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోవాల్సినసరం లేదని ఆమె అన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో సహజ వనరులు, బొగ్గు గనులు పుష్కలంగా ఉన్నాయని ఆమె తెలిపారు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు గీతారెడ్డి నిరాకరించారు. సీమాంధ్రకు చెందిన ఎంపీలు, మంత్రులకు విభజన గురించి ముందే తెలుసునని గీతారెడ్డి నిన్న హైదరాబాద్‌లో అన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఉద్యమాలు, ఇతర పరిణామాలు, వాటి వెనుక ఎవరున్నారనే అంశాలపై కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా అందరిపైనా అధిష్టానం పెద్దలు కన్నేసి ఉంచారని పేర్కొన్నారు. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని, రాష్ర్టం విడిపోయాక కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, సీమాంధ్రుల రక్షణకు పార్టీ, ప్రభుత్వం తరఫున తాము భరోసా ఇస్తున్నామని చెప్పారు. -
కిరణ్ మాటలన్నీ సోనియావే: కిషన్‌రెడ్డి
రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీవేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎంగా కొనసాగే అర్హత కిరణ్‌కు లేదని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల ఆందోళన వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ వెలువరించిన నిర్ణయాన్ని మీ పార్టీ నేతలు వ్యతిరేకిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళనలపై ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ ఎందుకు స్పందిచడం లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది స్వార్ధపూరిత విష భావజాలం అని విమర్శించారు. -
ప్రజలదే సీమాంధ్రలో ఉద్యమం: శైలజానాథ్
సీమాంధ్రలో ఉద్యమం ప్రజలే నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ తెలిపారు. ప్రజల నాయకత్వంలో తాము పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. తమ ఒత్తిడి వల్లే విభజన అంశంపై చర్చించేందుకు ఏకే ఆంటోని ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ విడిచి వెళ్లాలంటూ కేసీఆర్ చేసిన వివాదస్పద వాఖ్యలపై శైలజానాథ్ అంతకుముందు మండిపడ్డారు. కేసీఆర్ బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నారని చెప్పారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో తమ ఉద్యోగులు హైదరాబాద్‌లో బతకాల్సిన పని లేదని అన్నారు. హైదరాబాద్ కేసీఆర్ జాగీరేమీ కాదని చెప్పారు. రాజ్యంగం ప్రకారం ఎక్కడైనా ఉండే హక్కు తమకుందని తెలిపారు. -
సమైక్యమే శ్వాస.. ధ్యాస
రాష్ట్రాన్ని సమైక్యాంధ్ర గానే కొనసాగించాలనే ఏకైక డిమాండ్‌తో సీమాంధ్ర జిల్లాల్లో వెల్లువెత్తిన ఉద్యమం తాజాగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ‘ఆప్షన్లుండవు’ ప్రకటనతో తారాస్థాయికి చేరుతోంది.అనంతపురం సబ్‌ట్రెజరీ సర్కిల్లో నిరసన వ్యక్తంచేస్తున్న సమైక్యవాదులు కడప నగరంలో విద్యార్థుల భారీ ర్యాలీ నెల్లూరులో వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్సీపీ కార్యకర్తల బైక్‌ర్యాలీ వైఎస్సార్ జిల్లాలో సోనియా దిష్టిబొమ్మ దహనం చేస్తున్న దృశ్యం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో సమైక్యవాదుల ర్యాలీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సోనియా దిష్టిబొమ్మకు శవయాత్ర శ్రీకాకుళంలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్న దృశ్యం తిరుపతిలో సోనియాగాంధీ దిష్టి బొమ్మ చితికి నిప్పంటించిన ఆందోళనకారులు విజయనగరం జిల్లా గజపతినగరంలో సమైక్యవాదుల ఆందోళన రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో ఎడ్లబండ్లతో ర్యాలీ విశాఖలో కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది మానవహారంగుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో సమైక్య నిరసనలు