రాష్ట్ర విభజన సంబంధిత విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) శనివారం మరోసారి భేటీ కానుంది.
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన సంబంధిత విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) శనివారం మరోసారి భేటీ కానుంది. ఈరోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయంలో జీవోఎం సమావేశం కానుంది. హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, ఆర్థిక మంత్రి చిదంబరం, ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్, పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్‌తో పాటు ప్రత్యేక ఆహ్వానితునిగా ప్రధాని కార్యాలయ సహాయమంత్రి నారాయణసామి పాల్గొననున్నారు.
అవసరమైన పక్షంలో జీవోఎంకు స్వయంగా వివరణలివ్వడానికి అందుబాటులో ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వంలోని సాగునీటి పారుదల, ఆర్థిక, హోం, విద్యుత్, మౌలిక సదుపాయాల శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు.
విభజనకు నిరసనగా సీమాంధ్రలో ఒకపక్క ఆందోళనలు ఉవ్వెత్తున కొనసాగుతుండగా మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన జీవోఎం శనివారం కీలక అంశాలపై దృష్టిసారించనున్నట్టు సమాచారం.