
అనంతపురం జిల్లాలో 48 గంటల బంద్
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ, సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం జిల్లా బంద్ జరుగుతోంది. 48 గంటల పాటు బంద్ చేపడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, పు రామచంద్రారెడ్డి తెలిపారు. బంద్‌లో ప్రజా సంఘాలు, ఎన్‌జీఓలు, విద్యార్థి సంఘాలు.. ఇలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బంద్ తీవ్రత ఢిల్లీని తాకాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పెద్దలు కేవలం ఓ ప్రాంతానికి న్యాయం చేయడం కోసం సీమాంధ్ర ప్రజల హక్కులను కాలరాశారని విమర్శించారు. ఇప్పటికీ వారు ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలుసుకుని రాజీనామా చేశారని తెలిపారు.
జననేత వైఎస్ జగన్ సీమాంధ్ర ప్రజల మనోభావాలకు పట్టం కట్టారని కొనియాడారు. ఆయన నిర్బంధంలో ఉన్నప్పటికీ అహర్నిశలు ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటే తాము స్వాగతిస్తామని ఎప్పుడో చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టాలని హితవు పలికారు.