
'సమైక్యంగా ఉంచకుంటే రాజకీయలకు గుడ్ బై '
యూపీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తమ పదవులకు రాజీనామా చేయడం అంత పెద్ద విషయం కాదని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు కూడా రాజీనామాలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నారని తెలిపారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలను సస్పెన్షన్ చేసిన సభను సజావుగా సాగకుండా తమ సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్య గళం వినిపించిన సంగతిని లగడపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తమ పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేసిన పక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే అడ్డుకునే వారు ఎవరు ఉండని ఆయన పేర్కొన్నారు. దాంతో వేర్పాటువాదులకు తమ రాజీనామా ఓ వరంలో మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఎవ్వరు తమ పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామాలు చేయలేదని లగడపాటి తెలిపారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ విద్యార్థులు లగడపాటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లగడపాటి పై విధంగా స్పందించారు.