
చంద్రబాబు నాయుడు ఆస్థాన సర్వే చిలక, కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మళ్లీ బోగస్
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్థాన సర్వే చిలక, కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మళ్లీ బోగస్ అని తేలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు జతకట్టిన మహాకూటమికి మేలు జరిగేలా బోగస్ సర్వేతో మాయ చేసిన లగడపాటి.. ఏపీ ఎన్నికల విషయంలోను అదే పంథాను కొనసాగించి పరువు తీసుకున్నారు. ఆర్‌జీ ఫ్లాష్ టీమ్ పేరుతో ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెల్లడించిన లగడపాటి.. ఏపీలో మళ్లీ అధికారం టీడీపీ చేబట్టబోతుందని జోస్యం చెప్పారు. అన్ని సర్వే సంస్థలు, జాతీయ చానెళ్లు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైస్సార్‌సీపీకి పట్టం కట్టగా.. లగడపాటి మాత్రం భిన్నంగా టీడీపీ గెలుస్తుందని చెప్పారు. తీరా ఫలితాలు చూస్తే లగడపాటి చెప్పినవన్నీ బోగస్ అని స్పష్టమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించుతూ వైఎస్సార్‌సీపీ ఏకంగా 152 సీట్ల ఆధిక్యంతో చరిత్ర సృష్టించే దిశగా కొనసాగుతుంది. ఈ ఫలితంతో లగడపాటి విశ్వసనీయత కోల్పోయారు.
ఆయనపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ క్యాడరే లగడపాటి కనిపిస్తే చితక్కొట్టాలనే కసితో ఉంది. ఆయన చెప్పిన సర్వే వివరాలతో సోషల మీడియా వేదికగా అనవసర సవాళ్లకు దిగిన తెలుగు తమ్ముళ్లు ఫలితాలతో ముఖం చాటేశారు. దీనికి కారణమైన లగడపాటిపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌ను ట్రెండ్స్ చేస్తున్నారు. ‘ఎయ్ లగడపాటి నువ్వెక్కడా? మళ్లీ సర్వే అంటూ మీడియా ముందుకు వచ్చావో?’ అంటూ అసభ్య పదజాలంతో మండిపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లోనే లగడపాటి సర్వేతో బెట్టింగ్‌రాయిళ్లు కోట్ల రూపాయలు నష్టపోయారని, బెట్టింగ్‌ల కమిషన్ కోసమే మళ్లీ తప్పుడు సర్వే వివరాలను వెల్లడించారని ధ్వజమెత్తుతున్నారు. మొత్తానికి లగడపాటి మళ్లీ సర్వే అని నోరెత్తకుండా.. అతని అంచనాలకు భిన్నంగా రెండు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడం గమనార్హం.
— Ram Gopal Varma (@RGVzoomin) 23 May 2019