ఇది చంద్రబాబునాయు డిపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయం మాత్రమే కాదు; తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ సీపీ గెలుపు మాత్రమే కాదు; అంతకు మించి తెలుగు మీడియా పరాజయం! మే 23 సూర్యోదయం తర్వాత న్యూస్ చానల్స్ అ..ఆ.. ఉ.. ఊ.. అంటూ తమను తాము సవరించుకోవడం ప్రారంభించాయి. అదే పూటనుంచి పత్రికల వెబ్‌సైట్లు, మరుసటి రోజు పత్రికలు ఏ విషయాలైతే చెప్పడం ఇష్టం లేదో వాటినే చెప్పక తప్పలేదు కనుక ఇప్పుడు ఇలా సాగు తున్నాయి. ఇంతవరకు పత్రికలనూ, చానళ్లనూ ప్రధాన స్రవంతి మీడియా అనీ, సోషల్ మీడియాను ప్రత్యామ్నాయ మీడియా అనీ పరిగణించేవారం. మీడియా ఎప్పుడైతే ప్రజలకు దూరంగా నిలిచి, యజమానుల రాజకీయ అవసరాల చిలుకపలుకులు వల్లెవేయడం ప్రారంభించిందో.. అప్పటినుంచే సోషల్ మీడియా ప్రజలకూ, ఆలోచనాపరులకూ, కళాకారులకూ సాధనం అయింది. ఇందులో పనికి రాని విషయాలు బోలెడు ఉండవచ్చు కానీ ప్రధాన మీడియా ఇవ్వని, ప్రచురించని అంశాలకు సోషల్ మీడియా వాహకమయ్యింది.
మీడియా ఆది నుంచి స్వచ్ఛంగా ఉందని ఎవరూ అనడం లేదు. యజమానుల ఆశలూ, రాజ కీయ అవసరాలూ ఎంతో కొంత తీరుస్తూ సాగడం కొత్త కాదు. అయితే 21వ శతాబ్దంలో తెలుగు మీడియా పూర్తిగా సంచలనంగా, పాక్షిక దృష్టితోనే సాగటం మొదలైంది. దీనికి 2003 చివరినుంచి మొదలైన తెలుగు న్యూస్ చానల్స్ మరింత ఆజ్యం పోశాయి. పత్రికలతో పోటీపడుతూ చానళ్లూ, చాన ళ్లకు మరింత పోటీనిస్తూ పత్రికలు సాగుతూ విమర్శ బదులు నిందలు, విశ్లేషణలకు బదులు మరిన్ని ఉదాహరణలు ఇస్తూ తెలుగువారి ఆలోచనకు, నిష్పా క్షిక దృష్టికి మంగళం పాడుతూ సర్క్యులేషన్లు, టీఆర్ పీలు పెంచుకున్నాయి. దీనికి విరుగుడుగా వైఎస్సార్ ఒక తెలుగు దినపత్రిక, ఒక వార్తా చానల్ ప్రారం భించక తప్పలేదు. అవరోధం ఏమిటో, దానికి సాధనం ఏమిటో గమనించి సిద్ధం చేశారు కనుకే జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు మెజారిటీ తెలుగు మీడియా మీద అఖండ విజయం సాధించారు. అందుకే ఇది మొనగాడి విజయం!
ఈ సమస్య రెండు దశాబ్దాలలో మరింత విస్తృ తంగా మారి మేధావులకూ సోకింది. అధికారం, ధనం ఉన్నవారు అవకాశ వాదులుగా మారిపోతున్న పుడు మేధస్సు ఉన్నవారు తామెందుకు గట్టున కూచోవడమని భావించారు. నిజానికి ఆ రెండు వర్గాలకు లేనిదీ, ఈ వర్గానికి ఉన్నదీ తెలివి. దాని ఆధారంగా వీరు తమ చిరునామా మార్చుకుని ఉండాల్సింది కాదు. కానీ పత్రికల్లో ఫొటోతోబాటూ వ్యాసమూ, ఫోన్ నంబరూ, చానళ్లలో విజువల్స్‌గా చెలామణి పెరిగిపోతున్నప్పుడు ప్రలోభాలదే పై చేయి అయింది. చానల్ బట్టి మాటా, పత్రిక బట్టి బాణి మారిపోతున్నాయి. యజమాని ఆలోచనా ధోరణి మారగానే మీడియాలో పనిచేసే నిపుణులు, తమ నైపుణ్యాలు అందించే మేధావులు ఆ రీతిలో స్పందించడం అలవాటయింది. మరోవైపు సోషల్ మీడియా సామా న్యులకూ, పత్రికల్లో చానళ్లలో అవ కాశం దొరకని వారికీ వేదికగా మారిపోయింది. ఈ కోణంలోనే ప్రధాన మీడియాకు చెమటలు పట్టించింది సోషల్ మీడియా.
ఈ సందర్భంగా 1971 మార్చి 12న నార్ల వెంక టేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’లో ‘మేము, మా పరా జయం’ అనే సంపాదకీయం గురించి చెప్పుకోవాలి. వాదనా బలం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే..! ఇలా చెప్పు కోవడానికి కూడా సిగ్గుపడనక్కర లేదు. అప్పటి కాలం వేరు, విలువలు వేరు. ఇప్పుడు మీడియా ఏ ప్రాంతానికా ప్రాంతంలో, ఏ పూటకాపూట విభి న్నంగా విలక్షణంగా సాగుతోంది. తమిళనాడులో ‘దినతంతి’ అనే అగ్రశ్రేణి దినపత్రిక ఏ పార్టీ అధి కారంలోకి వస్తే ఆ పార్టీని బలపరుస్తుంది. దీనికి ఈ పత్రిక చెప్పే కారణం– ఎక్కువమంది ప్రజలు ఎన్ను కునే పార్టీ అధికారం పొందుతుంది కనుక, మేము బలపరుస్తాము అనే..! ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ, ఎన్నికయిన ప్రతినిధులు, అధికార వర్గాలతో సమానంగా ‘ఫోర్త్ ఎస్టేట్’ అనే గౌరవం, స్థాయి పొందిన మీడియా పలు రకాలుగా దిగజారడం ఒక పార్శ్వం కాగా, మీడియాలో ప్రవేశించిన వ్యక్తుల సంపద, అధికారం విశేషంగా పెరగడం దీని వెనుక ఉన్న ఇంకో పార్శ్వం.
సగటు మనిషి అవకాశం వచ్చినప్పుడు తనలో గూడుకట్టుకుని ఉన్న భావాలకు పోలింగ్ బూత్ ద్వారా భాష్యం చెబుతారు. మీడియా యజమానులు మారతారా, తమ పొరపాట్లు గుర్తిస్తారా అనే విష యాలు ఇక్కడ అవసరం లేదు. అయితే మీడియా ద్వారా చిలుకపలుకులు వల్లించే మేధావులు మాత్రం గౌరవం కోల్పోక తప్పదు. కనుక వ్యక్తిగతమైన, తమకే కనిపించే ప్రలోభాలకు ఈనాటి మీడియా మేధావులు లొంగకుండా సాగితే మంచిది.
డా.నాగసూరి వేణుగోపాల్
వ్యాసకర్త వర్తమాన అంశాల వ్యాఖ్యాత,
రచయిత మొబైల్ : 94407 32392
Comments
Please login to add a commentAdd a comment