భద్రాచలం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లు క్లైమాక్స్‌కు చేరుకున్న దశలోనూ భద్రాచలమే హాట్‌టాపిక్‌గా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం సీమాంధ్రలో ఉంటే ముంపు ప్రాంతం తెలంగాణలో ఉండటమే దీనికి కారణం. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి సమావేశమైన కేంద్ర కేబినెట్ బిల్లుకు కీలక సవరణలు చేస్తూ తుదిరూపు ఇచ్చింది.
పోలవరం ముంపు కింద వచ్చే జిల్లాలోని 134 రెవెన్యూ గ్రామాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి భద్రాచలం డివిజన్ ఎటువైపు అనేది తీవ్ర చర్చనీయాంశంగానే మారింది. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపంపై పూర్తి స్థాయిలో సమీక్ష లేకుండానే కేంద్ర కేబినెట్ హడావిడి నిర్ణయాలు తీసుకోవటమే ఈ గందరగోళానికి కారణమని వాదన వినిపిస్తోంది.
పోలవరం ముంపు ప్రాంతాలివే..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భద్రాచలం డివిజన్‌లోని వీఆర్‌పురం, కూనవరం మండలాలు పూర్తిగానూ, చింతూరు, భద్రాచలం మండలాలు పాక్షికంగానూ ముంపునకు గురవుతాయి. ఈ నాలుగు మండలాల్లో మొత్తం 98 రెవెన్యూ గ్రామాలు ముంపు పరిధిలోకి వస్తాయి. ఈ మండలాలకు ఎదురుగా గోదావరి నదికి అవతల ఒడ్డున ఉన్న పాల్వంచ డివిజన్ పరిధిలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగానూ, బూర్గంపాడు మండలం పాక్షికంగా ముంపు పరిధిలోకి వస్తుంది. మొత్తంగా పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లో 36 రెవెన్యూ గ్రామాలు పోలవరం ముంపు కిందకు వస్తాయి. వీటి పరిధిలో మొత్తం 205 గ్రామాలు (హ్యాబిటేషన్)ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ బిల్లులో చేసిన సవరణల ప్రకారం పై గ్రామాలన్నీ సీమాంధ్రకు చెందుతాయి.
గతంలో ఏం చేప్పారంటే..
తెలంగాణ బిల్లు ఢిల్లీకి వెళ్లిన సమయంలో సమావేశమైన జీవోఎం రాష్ట్ర అసెంబ్లీ నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు సవరణలు చేపట్టింది. దీనినే కేంద్ర కేబినెట్ యథాతథంగా ఆమోదించింది. దీని ప్రకారం భద్రాచలం రెవెన్యూ డివిజన్, పాల్వంచ డివిజన్‌లోని 37 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రలో కలుపేందుకు నిర్ణయించారు. భద్రాచలం టెంపుల్ టౌన్( అంటే భద్రాచలం పట్టణం)ను మాత్రం తెలంగాణలోనే కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా ఏం నిర్ణయం తీసుకున్నారంటే
బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లుపై చర్చించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ముంపు గ్రామాలనే సీమాంధ్రలో విలీనం చేస్తారు. ఈ లెక్కన ఏడు మండలాల్లోని ముంపు ప్రాంతాలు మాత్రమే సీమాంధ్రకు వెళ్తాయి. ముంపు పరిధిలో లేని గ్రామాలన్నీ యథాతథంగా తెలంగాణలోనే ఉంటాయి. ఈ రకంగానే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.
ఆదివాసీలకు ఒరిగిందేంటి?
పోలవరం నిర్మాణమంటూ జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా...తెలంగాణలో ఉన్నా ఎప్పటికైనా ముంపు గ్రామాలను ఖాళీ చేయాల్సిందే. ఆదివాసీలు రాష్ట్ర విభజన అంశం పక్కన పెట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన లేకుంటే ఏదో రీతిన దీన్ని అడ్డుకోవచ్చని ఇప్పటి వరకు ఆదివాసీలు భావించారు. దీనిపై కోర్టులలో కేసులు కూడా వేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని బహుళార్థక సాధ క ప్రాజెక్టుగా గుర్తించింది. దీన్ని నిర్మించేందుకు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు నిర్ణయించింది.ఇది ఆదివాసీలకు గొడ్డల పెట్టులా మారింది.
భౌగోళికంగా ఇబ్బందులే
భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లు ముక్కలు చేసి ముంపు ప్రాంతాలను సీమాంధ్రకు, మిగతా గ్రామాలు తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు భావిస్తున్న నిర్ణయం భౌగోళిక ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. చింతూరు, భద్రాచలం, బూర్గంపాడు మండలాలతో పాటు పూర్తిగా ముంపునకు గురయ్యే మండలాల్లో కూడా ఇళ్లు ఒక రాష్ట్రంలో ఉంటే వారి భూములు మరో రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తైబ్యాక్ వాటర్ వచ్చేంత వరకు ఇక్కడనే ఉంటూ వారి భూములను అనుభవించ వచ్చనేది రైతులు ఆశ.
కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో డివిజన్‌లు ముక్కలు అవుతుండటం వారికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇక రహదారుల పరిస్థితి కూడా ఇదే రీతిన ఉంటుంది. ఉదాహరణకు భద్రాచలం మండలంలోని విస్సాపురం, చలంపాలెం పరిసర గ్రామాలు వారు ప్రస్తుతం నందిగామ మీదగా భద్రాచలం రావాల్సి ఉంటుంది. కానీ విభజనలో నందిగామ సీమాంధ్ర రాష్ట్రంనకు వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విస్సాపురం వాసులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గ్రామాల మీదగా మళ్లీ తెలంగాణలోని భద్రాచలానికి రావాల్సి ఉంటుంది. వీటి న్నింటి పై సరైన స్పష్టత లేకుండా భౌగోళికంగా సరైన సరిహద్దులు చూపకుండా విభజిస్తే తమ పరిస్థితి ఏంటని ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.
ముంపు అటే..!
Published Thu, Feb 13 2014 2:16 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement