భద్రాచలం, న్యూస్‌లైన్ : ‘భద్రాచలం తెలంగాణలోనే ఉంటుంది...ముంపు ప్రాంతాలు ఆంధ్రాకు వెళ్తాయి’....అనే వార్తలు గట్టిగా వస్తుండడంతో భద్రాచలం ప్రాంతంలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన నే పథ్యంలో భద్రాచలం మాదంటే...మాదని ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర ప్రాంత నాయకులు ప్రకటనలు చేయటం, హైదరాబాద్ తర్వాత కీలకాంశంగా మారిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో విలీనం చేస్తారని ప్రచారం జోరుగా సాగటంతో దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణలోనే ఉంటామని భద్రాచలం డివిజన్ వాసులు కూడా ఉద్యమ బాట పట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడింది.
ఇరు ప్రాంతాల నాయకులకు ఊరటనిచ్చే విధంగా భద్రాచలం రామాలయంతో పాటు డివిజన్‌లోని కొన్ని మండలాలను తెలంగాణలో ఉంచేలా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే గ్రామాలన్నింటినీ సీమాంధ్రలో కలిపేం దుకు దాదాపు నిర్ణయం జరిగిపోయినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. జీవోఎం పొందుపరిచిన 11 అంశాల్లో నదీ జలాల సమస్య ప్రధానం కావటంతో భద్రాచలం ప్రాంతం తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం జిల్లాలోని 205 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని ఆ ప్రాంత నాయకులు కేంద్ర ప్రభుత్వానికి నివే దికలు ఇచ్చారు. 1956కు ముందు భద్రాచలం తూర్పుగోదావరి జిల్లా పరిధిలో భాగంగా ఆంధ్రలోనే ఉండేద నే వాదనలు లేవనెత్తారు.
అయితే పరిపాలన సౌలభ్యం కోసం అప్పట్లో భద్రాచలం డివిజన్‌ను కాకినాడ నుంచి వేరు చేశారని, పోలవరం ప్రాజెక్టు కోసమని మళ్లీ ఆంధ్రలో కలిపితే డివిజన్ అన్ని రంగాల్లోనూ తీవ్రంగా వెనుకబడిపోయే ప్రమాదముందని భావించిన ఈ ప్రాంత వాసులు ఆంధ్ర నాయకుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణలోనే ఉంటామంటూ చేపట్టిన టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ద్వారా తమ ఆకాంక్షను ఢిల్లీ స్థాయిలో వినిపించారు.
ముంపు ప్రాంతం ఆంధ్రలోకి వెళితే....
పోలవరం ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే గ్రామాలన్నీ ఆంధ్రలోనే కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే జిల్లాలోని 7 మండలాల్లో గల 205 గ్రామాలు తెలంగాణ నుంచి వేరు చేయబడతాయి. భద్రాచలం, పాల్వంచ డివిజన్‌ల పరిధిలో గల 60 పంచాయతీలు ముంపు ప్రాంతంలోకి వస్తాయి. భద్రాచలం డివిజన్‌లోని వీఆర్‌పురం, కూనవరం, పాల్వంచ డివిజన్‌లోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ముంపు ప్రభావం పూర్తిగా ఉంటుంది. అదే విధంగా చింతూరు, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయి. వేలేరుపాడు మండలంలో 38 గ్రామాలు, కుక్కునూరులో 35, బూర్గంపాడులో 9, భద్రాచలంలో 13, కూనవరంలో 48, వీఆర్ పురంలో 45, చింతూరులో 17 గ్రామాలు ముంపు కింద వస్తాయి. ప్రస్తుతం జీవోఎం నిర్ణయించినట్లుగా వస్తున్న ప్రచారం నిజమైతే ఈ గ్రామాలన్నీ తెలంగాణ నుంచి వేరు చేయబడి ఆంధ్రలో కలుస్తాయి. దీన్ని తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలోని ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదులుకోబోమని చెబుతున్నారు. దీనిపై ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల ద్వారా జీవోఎం దృష్టికి తీసుకెళ్తున్నారు.
సరిహద్దులతో ఇబ్బందులే :
ముంపు గ్రామాలు ఆంధ్రలో కలిపితే సరిహద్దు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అంతేకాకుండా ఆంధ్రలో కలిపే ముంపు గ్రామాలకు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో ఉండదని వారి వాదన. భద్రాచలం మండలం వరకూ చూస్తే ముంపు కింద ఎన్‌టీఆర్ కాలనీ ఉంది. అదే విధంగా టీపీ వీడు ముంపు పరిధిలోనే ఉంటుంది. కానీ ఈ రెండు గ్రామాల మధ్యన ఉన్న తోటపల్లి మాత్రం ముంపు పరిధిలోకి రాదు. ఒక వేళ ముంపు ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకొని సరిహద్దులు విభజిస్తే రెండు వైపులా ఆంధ్రకు చెందిన గ్రామాలు ఉంటే మధ్యలో తెలంగాణకు చెందిన గ్రామం ఉంటుంది. భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే రహదారిలో ఉన్న తోటపల్లికి టీపీవీడు గ్రామాన్ని దాటుకొనే వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు చాలా గ్రామాలకు ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో సరిహద్దు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. ఇదే విషయమై రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు ఇక్కడి టీజేఏసీ తగు ఆధారాలతో నివేదిక సిద్ధం చేస్తోంది.
తప్పదా...?!
Published Fri, Nov 29 2013 6:15 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement