సీఎం వ్యాఖ్యలపై గీతారెడ్డి నో కామెంట్
పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని మంత్రి జె. గీతారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై ఎవరెన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోవాల్సినసరం లేదని ఆమె అన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్లో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో సహజ వనరులు, బొగ్గు గనులు పుష్కలంగా ఉన్నాయని ఆమె తెలిపారు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు గీతారెడ్డి నిరాకరించారు.
సీమాంధ్రకు చెందిన ఎంపీలు, మంత్రులకు విభజన గురించి ముందే తెలుసునని గీతారెడ్డి నిన్న హైదరాబాద్లో అన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఉద్యమాలు, ఇతర పరిణామాలు, వాటి వెనుక ఎవరున్నారనే అంశాలపై కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా అందరిపైనా అధిష్టానం పెద్దలు కన్నేసి ఉంచారని పేర్కొన్నారు. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని, రాష్ర్టం విడిపోయాక కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, సీమాంధ్రుల రక్షణకు పార్టీ, ప్రభుత్వం తరఫున తాము భరోసా ఇస్తున్నామని చెప్పారు.