ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: హైదరాబాద్ నగరంలో సీమాంధ్రులు స్వేచ్ఛగా జీవించవచ్చని, వారి భద్రతకు తాము భరోసా ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. యాచారంలో బోనాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి ఆదివారం ఉదయం శేరిగూడలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు హైదరాబాదే రాజధానిగా ఉంటుందని, ఏ జిల్లా, రాష్ట్రంవారైనా ఇక్కడ ఉండొచ్చని... ఎవరి హక్కులకూ భంగం వాటిల్లదని అన్నారు. హైదరాబాద్ తమ వల్ల అభివృద్ధి చెందిందని సీమాంధ్ర నాయకులు కొందరు పేర్కొనడం హాస్యాస్పదమని అన్నారు. అన్ని ప్రాంతాలవారితో అంచెలంచెలుగా హైదరాబాద్ అభివృద్ధిని సాధించిందే తప్ప ఏ ఒక్కరివల్లనో కాదని అన్నారు. సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మెతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా... క్రమంగా అంతా సద్దుమణుగుతుందన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని మొదట్లో చెప్పిన కొన్ని పార్టీలు ఆ తర్వాత ప్లేటు ఫిరాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత సీమాంధ్రకు ప్యాకేజీ అంటూ మాట్లాడటం ఆయనరెండు నాల్కల ధోరణికి నిదర్శనమని విమర్శించారు. తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సమంజసమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
దేశంలో హిందీ మాట్లాడే ప్రజలకు ఏడు రాష్ట్రాలున్నాయనే సంగతిని సీమాంధ్ర నాయకులు గుర్తుంచుకోవాలని, రెచ్చగొట్టే ప్రకటనలు మానుకొని అన్నదమ్ముల్లా విడిపోవడానికి సహకరించాలని ఆయన కోరారు. సీమాంధ్రులు తమ సమస్యలను ఆంటోనీ కమిటీకి, కేంద్ర ప్రభుత్వం కొత్తగా వేసిన కమిటీకి తెలుపుకోవాలని మంత్రి సూచించారు. విలేకరుల సమావేశానికి ముందు మంత్రి సారయ్యను పూలమాలలు, శాలువాలతో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, పీసీసీ సభ్యుడు పాశం లక్ష్మీపతి గౌడ్, మాజీ ఎంపీపీలు పి.కృపేశ్, రాచర్ల వెంకటేశ్వర్లు, నాగన్‌పల్లి సింగిల్ విండో చైర్మన్ లక్ష్మణ్‌రావు, కాంగ్రెస్ నాయకులు పండాల రమేశ్ గౌడ్, కర్రె శశిధర్, కప్పాటి రఘు, శ్రీనివాస్‌గౌడ్, జగాల్‌రెడ్డి పాల్గొన్నారు.
బీసీ బాలికల వసతిగృహం తనిఖీ సమస్యలు ఏకరువు పెట్టిన విద్యార్థినులు, గ్రామస్తులు
యాచారం: మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతిగృహాన్ని ఆదివారం రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య తనిఖీ చేశారు. నేరుగా వంట గదిలోకి వెళ్లిన ఆయన వంటపాత్రల మూత లు తీసి భోజనాన్ని పరిశీలించారు. అనంతరం సమస్యల గురించి విద్యార్థినులను, గ్రామస్తులను ఆరా తీశారు. వార్డెన్ సక్రమం గా ఉండటం లేదని, ఆమె భర్త వచ్చి విద్యార్థినుల గదుల్లో కూర్చొని సిగరెట్లు తాగుతూ ఇబ్బంది కలిగిస్తున్నాడని గ్రామస్తులు ఫిర్యా దు చేశారు. వార్డెన్‌ను మార్చాలని మంత్రిని కోరారు. తాగునీటి వసతి లేకపోవడంతో సమీపంలోని పాఠశాల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని, నెలనెల బిల్లులు కూడా సక్రమంగా అందడం లేదని విద్యార్థినులు సమస్యలు ఏకరువు పెట్టారు.
వసతిగృహానికి ప్రహరీ కూడా లేకపోవడంతో రాత్రిళ్లు భయంభయంగా గడుపుతున్నామని తెలిపా రు. విద్యార్థినులు మాట్లాడుతుండగా వార్డెన్ కల్పించుకొని ఏదో చెప్పబోతుండగా మంత్రి వారించారు. పనితీరు మార్చుకోకపోతే చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. వెంటనే విద్యార్థినులకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ మారోజ్ కళమ్మను మంత్రి ఆదేశించారు. కాగా, భవనం కొత్తదైనా నాణ్యత లోపించిందని, పగుళ్లు కన్పిస్తుండటంతో ఎప్పుడు కూలుతోందనని విద్యార్థినులు భయపడుతున్నారని ఉప సర్పంచ్ బాషా, మాజీ ఎంపిపీ రాచర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. నూతన భవన నిర్మాణానికి రూ.30లక్షలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. విద్యార్థినులకు ఆంగ్ల భాషలో నైపుణ్యం కోసం ప్రత్యేక బోధకుడిని నియమించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థినుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఉన్నారు.
సీమాంధ్రుల భద్రతకు ఢోకాలేదు
Published Mon, Aug 26 2013 4:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement