
సచివాలయం.. గందరగోళమయం
అస్తవ్యస్తంగా ఉద్యోగులు, ఫైళ్ల మార్పిడి పలు శాఖలకు ఇక్కడ, అక్కడ ఐఏఎస్‌లు లేరు
ఇన్‌చార్జీలతో తాత్కాలిక ఏర్పాటు చేసిన సీమాంధ్ర సర్కారు
సీమాంధ్ర ఆర్థిక శాఖ ఉద్యోగులకు కుర్చీలు, టేబుళ్లు కరువు
సెక్షన్లకు అనువుగా లేని నార్త్ హెచ్ బ్లాకు
సీమాంధ్రకు కేటాయించిన బ్లాకుల్లో కనీస వసతులు లేవు
హైదరాబాద్: ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర రాష్ట్రాల పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో ఉద్యోగులు, ఫైళ్ల మార్పిడి గందరగోళంగా తయారైంది. అలాగే ఇటు తెలంగాణలోను, అటు సీమాంధ్రలోను పలు శాఖలకు ఐఏఎస్ అధికారులు లేకపోవడంతో సాధారణంగా కొనసాగాల్సిన పరిపాలన స్తంభించిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్‌లలో 44 మందిని తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తాత్కాలికంగా కేటాయించడంతో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్‌లను ఇచ్చింది. దీంతో ఆ ఐఏఎస్ అధికారులందరూ తెలంగాణ ప్రభుత్వానికి చెందిన శాఖల పాలన పనులకే పరిమితం అయ్యారు. ఉదాహరణకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె. జోషి తెలంగాణ ప్రభుత్వానికి వెళ్లిపోవడంతో సీమాంధ్ర ప్రభుత్వంలో మున్సిపల్ శాఖకు ముఖ్యకార్యదర్శి ఎవరూ లేరు. దీంతో ఆ శాఖలో విభజన పనులు అస్తవ్యస్తంగా మారాయి. ఇలా 44 మంది ఐఏఎస్‌లు వదిలి వెళ్లిన శాఖల్లో ప్రస్తుత పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రభుత్వం బుధవారం 22 శాఖలకు ఇన్‌చార్జిలుగా ఐఏఎస్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీమాంధ్ర పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణ సర్కారుకు కేవలం 44 మంది ఐఏఎస్‌లనే కేటాయించడంతో చాలా శాఖలకు ఐఏఎస్‌లు లేకుండా పోయారు. దీంతో ఆయా శాఖల్లో సాధారణ పరిపాలన అంశాలు కూడా ముందుకు కదలడం లేదు.
గదులున్నాయ్.. కుర్చీలు, టేబుళ్లు లేవ్..
మరో పక్క సీమాంధ్ర ప్రభుత్వానికి సచివాలయంలో కేటాయించిన చాలా బ్లాకుల్లో ఉద్యోగులు పనిచేయడానికి కనీస వసతులు కూడా లేవు. దీని కారణంగా తెలంగాణకు చెందిన బ్లాకుల నుంచి సీమాంధ్ర బ్లాకుల్లోకి ఉద్యోగుల మార్పిడిలో జాప్యం జరుగుతోంది. అదే సమయంలో తెలంగాణకు చెందిన ఉద్యోగులు, అధికారులు వారికి కేటాయించిన బ్లాకుల్లోకి రావాలంటే సీమాంధ్రకు చెందిన వారు ఆ బ్లాకులు మారి వెళ్లాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుతం సచివాలయంలోని డీ బ్లాకులో ఆర్థిక శాఖ పనిచేస్తోంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగులకు నార్త్ హెచ్ బ్లాకును కేటాయించారు. ఆ బ్లాకులో రెండో అంతస్తులోని ఐఏఎస్‌ల కార్యాలయాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. అయినా ఆర్థిక శాఖ అధికారులు అజేయ కల్లం, పీవీ రమేశ్, ప్రేమచంద్రారెడ్డి వెళ్లిపోయారు. అయితే అదే బ్లాకులో ఆర్థికశాఖ ఉద్యోగులు పనిచేయడానికి ఏ మాత్రం వీలుగా లేదు. సెక్షన్స్ పనిచేయడానికి వీలుగా అక్కడ విద్యుత్ కనెక్షన్లు, నెట్‌వర్క్ కనెక్షన్ లేదు. కంప్యూటర్లపై పనిచేయడానికి ఏర్పాట్లు కూడా లేవు. అక్కడ గదులు తప్ప వాటిలో కుర్చీలు, టేబుళ్లు లేవు.
ఏ సెక్షన్‌లో ఎన్ని ఫైళ్లు: బుధవారం డి-బ్లాకులోని సీమాంధ్ర ఆర్థిక శాఖ ఉద్యోగులు ఫైళ్లు, పుస్తకాలను గోనె సంచుల్లో కట్టి సిద్ధంగా పెట్టుకున్నారు. ఏ రాష్ట్రానికి చెందిన ఫైళ్లను ఆ రాష్ట్రానికి ఇచ్చేందుకు వీలుగా.. పలు ఫైళ్లను స్కానింగ్ చేశారు. అయితే ఏ సెక్షన్‌లో ఎన్ని ఫైళ్లు ఉన్నాయో లెక్క తేల్చలేదు. దీంతో ఇరు రాష్ట్రాలకు చెందిన సెక్షన్ ఆఫీసర్లు.. ఫైళ్ల మార్పిడిపై సందిగ్ధంలో పడ్డారు. ఎన్ని ఉన్నాయో తెలియకుండా ఫైళ్లు అప్పగించారంటూ.. నో డ్యూ సర్టిఫికెట్ ఎలా ఇస్తామనే సందేహం సెక్షన్ ఆఫీసర్లలో నెలకొంది.