నవరస నాయకి మనోరమ
వెండి తెర మీద ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడి పోవడంలో దిట్ట్ట మనోరమ. నవరసాల్ని పండించి ప్రేక్షకుల్ని మైమరపించడంలో ఆమెకు సాటి మరొకరు లేరు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకున్న మనోరమ ఐదుగురు ముఖ్యమంత్రులతో కలసి నటించి సరికొత్త రికార్డును సైతం తన సొంతం చేసుకున్నారు. దక్షిణాది సినీ వినీలాకాశంలో హాస్యనటిగా, అక్కగా, అమ్మగా, అత్తగా, బామ్మగా.. ఇలా ఎన్నో వైవిధ్య పాత్రల్లో వెండి తెర మీద కన్పించిన మనోరమ జీవిత పయనం అన్నీ ఒడిదొడుకులే...
తమిళసినిమా : తంజావూర్ జిల్లా మన్నార్ కుడిలో 1937 మే 26వ తేదీన కాశీకిలకుడైయార్, రామామృతమ్మాళ్ దంపతులకు జన్మించిన గోపి శాంత అలియాస్ మనోరమ. బాల్య మంతా కారైకుడి సమీపంలోని పల్లత్తూర్‌లోనే గడిచింది. ఐదో తరగతి వరకు చదువుకున్న ఆమె తన దృష్టిని నాటకాల వైపునకు మళ్లించింది. 12వ ఏట వీధి నాటకాల ద్వారా నటన వైపునకు అడుగులు వేసిన గోపి శాంత అంచెలంచెలుగా ఆ రంగంలో ఎదిగారు. 1952లో మరుమగన్ నాటకంతో తన ప్రతిభ చాటుకున్న గోపి శాంత ఆతర్వాత పల్లత్తూర్ పాపగా నాటక రంగంలో ఓ వెలుగు వెలిగారు.
వెయ్యికి పైగా నాటకాల్లో వివిధ పాత్రల్లో నటించడంతో పాటుగా గాయనిగా తన ప్రతిభను చాటుకున్నారు.అండమాన్ కాదలీ నాటకం ద్వారా రంగస్థల నటిగా పరిచయమయ్యారు మనోరమ. అప్పట్లో ఆ పాత్ర పోషించాల్సిన నటి రాకపోవడంతో తనను అనూహ్యంగా స్టేజీ ఎక్కించి తనను నటిని చేశారని మనోరమ ఇక సారి తన మనోగతాన్ని వ్యక్తం చేశారు. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైతో కలసి నటించిన ఓ నాటకం ఆమె జీవితానికి ఓ మలుపుగా చెపవచ్చు. ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి కరుణానిధి రచించిన మణిమగుడం నాటకంలో మనోరమ పేరుతో ఆమె చేసిన హాస్య పాత్ర ప్రేక్షకుల హృదయాల్ని తాకింది.
ఆ నాటి నుంచి హస్యపాత్రల మీద దృష్టి కేంద్రీకరించిన గోపి శాంత తన పేరును కూడా మనోరమగా మార్చుకున్నారు. 1958లో కళంజ్జర్ కన్న దాసన్ ప్రొడక్షన్‌లో మాలై ఇట్ట మంగై చిత్రం ద్వారా గుర్తింపు ఉన్న పాత్రతో వెండి తెరకు మనోరమ పరిచయమయ్యారు. అయితే ఆమెను ప్రాచుర్యం చేసిన చిత్రం తిల్లానా మోహనాంబాళ్. అనాటి నుంచి తన జీవనగమనాన్ని వెండి తెరకు అంకితం ఇచ్చారు. 1500 వరకు చిత్రాల్లో ఎన్నెన్నో పాత్రలకు జీవం పోసిన మనోరమ నిర్మాత అవతారం కూడా ఎత్తారు. ఆమె నిర్మాణ సారథ్యంలో రూపొందించిన దూరత్తు సొందం చిత్రం ఇండియన్ పనోరమలో ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుంది.
ఐదుగురు ముఖ్యమంత్రులతో..
భారతీయ సినిమా గర్వించదగ్గ నటి మనోరమ .ఏ పాత్ర చేసినా అందులో జీవించిన మహానటి మనోరమ. ఒక తమిళంలోనే కాదు తెలుగు, మలయాళం, హిందీ,సింగళ్ మొదలగు ఐదు భాషల్లో నటించి ప్రపంచ ఖ్యాతి గాంచిన అభిమానుల మనోరమ్యం ఈమె. తమిళంలో మనోరమ నటించిన అద్భుత చిత్రాలు మచ్చుకు కొన్ని చెప్పాలంటే కల్లత్తేర్ కన్నయ్య, పార్ మగలే పార్, లవకుశ, తిరువిలైయాడళ్, కందనైకరుణై, యార్‌నీ, ఎదుర్‌నీశ్చల్, తిల్లానా మోహనాంబాళ్, పడిక్కాద పట్టణమా, ఇలా కటా రెండా చెప్పుకుంటూ పోతూనే ఉండవచ్చు. మనోరమలో మంచి గాయని కూడా ఉన్నారు. మగల్ ఉన్ సమత్తు చిత్రంతో గాయనిగా పరిచయమై 300కు పైగా పాటలు పాడారు. అంతే కాదు, ఐదుగురు ముఖ్యమంత్రులతో నటించిన అరుదైన ఘనత మనోరమది.
దివంగత డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్‌లతో కలిసి నటించారు. మనోరమ తెలుగు సినిమాతోనూ విడదీయరాని అనుబంధం ఉంది. శుభోదయం, రిక్షావోడు, అల్లరిప్రియుడు, బావనచ్చాడు, అరుంధతి, క్రిష్ణార్జున తదితర చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించారు. పలు పాత్రలకు జీవం పోసిన మనోరమ సినీ జీవితం అప్రహతంగా సాగి 2013లో రూపొందిన సింగం-2తో ఆగింది. ఆ తరువాత ఆనారోగ్యానికి గురవ్వడంతో నటనకు దూరమయ్యారు.అయితే ఇటీవల మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. సూర్య నటించనున్న సింగం-3లో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ చిత్రం ప్రారంభం కాకుండానే మనోరమ కన్ను మూయడం విచారకరం. మరో విషయం ఏమిటంటే కరెక్ట్‌గా పది రోజుల క్రితం తమిళ సినీ పత్రికా విలేకరుల కార్యక్రమంలో పాల్గొన్న మనోరమ కమల్‌హాసన్, శివకుమార్‌ల నుంచి సత్కారం పొంది తనకు ఇంతకంటే ఏమి కావాలి? ఈ క్షణంలో ప్రాణం పోయినా సంతోషమే అని పేర్కొనడం గమనార్హం.