అప్పు కట్టలేదని వివాహిత కిడ్నాప్
కేకే.నగర్: తమిళనాడులోని తిరునిన్రవూరులో అప్పు చెల్లించలేదని ఓ మహిళను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానిక పాక్కం, మేలపేడు ప్రాంతానికి చెందిన మదివానన్ భార్య చిత్ర(27) బ్యూటీ పార్లర్ నడుపుతోంది. బ్యూటీపార్లర్‌లో విధినిర్వహణలో ఉన్న చిత్ర దగ్గరికి కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. వారు హఠాత్తుగా చిత్రను బెదిరించి కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. గందరగోళం నడుమ చిత్ర కిడ్నాప్కు గురైనట్టు తెలుసుకున్న స్థానికులు బాధితురాలు భర్త మదివానన్‌కు సమాచారం అందించారు.
దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్‌కు పాల్పడిన ముఠా చెవ్వాపేట సమీపంలో ఉన్నట్టు సమాచారం రావడంతో వారు ప్రయాణిస్తున్న కారును అడ్డుకుని పోలీసులు చిత్రను రక్షించారు. కారులో ఉన్న భాను, ఆమె తమ్ముడు రాధాకృష్ణన్, రాజేష్, కోకిలను అరెస్టు చేశారు. విచారణలో కోకిల వద్ద రూ.50వేలు అప్పు తీసుకున్న చిత్ర తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతుండడంతో కిడ్నాప్ చేసినట్టు అంగీకరించారు. ఆమె భర్త నుంచి సొమ్ము రాబట్టాలనుకున్నట్టు నిందితులు ఒప్పుకున్నారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.