నడుస్తున్న కారులో మరో గ్యాంగ్ రేప్
లూధియానా: మహిళల భద్రతకు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్ని యాప్స్‌ను తీసుకొచ్చినా వారిపై ఆకృత్యాలకు, అత్యాచారాలకు తెరపడడం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే పంజాబ్‌లోని లూధియానాలో ఓ 23 ఏళ్ల యువతిని కిడ్నాప్‌చేసి ఆమెపై కారులోనే సామూహిక అత్యాచారం జరిపారు.
నగర పోలీసు కమిషనర్ ప్రమోద్ బాన్ కథనం ప్రకారం సంపన్నులు నివసించే రాజ్‌గురు నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువతి సమీపంలో నివసిస్తున్న తన స్నేహితురాలిని కలుసుకొని ఆదివారం రాత్రి తన నివాసానికి తిరిగొస్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఆమె పక్కనే ఆగింది. డ్రైవర్ కాకుండా ఆ కారులోవున్న ఇద్దరు యువకులు ఆమెను కిడ్నాప్‌చేసి కారులో ఎక్కించుకున్నారు.
ఆ తర్వాత నడుస్తున్న కారులోనే ఆమెపై ఆ ఇద్దరు యువకులు పలుసార్లు అత్యాచారం జరిపారు. అనంతరం ఆమెను అదే ప్రాంతంలో దింపి పారిపోయారు. బాధితురాలు వెంటనే సమీపంలోవున్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి సంఘటన గురించి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించగా ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
గుర్తుతెలియని వ్యక్తులపై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని కమిషనర్ ప్రమోద్ బాన్ తెలిపారు. బాధితురాలు కిడ్నాపయిన ప్రాంతంలోని సీసీటీవీ కెమేరాల ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు జరుపుతున్నామని, ఓ ఫుటేజ్‌లో ఓ కారు అనుమానాస్పదంగా తిరగడం కనిపించిందని ఆయన తెలిపారు.