
మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్
సాక్షి, అమరావతి/హిందూపురం: రాష్ట్రంలోని మహిళలకు టీడీపీ కాలకేయుల నుంచి రక్షణ కల్పించాలని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ డిమాండ్ చేశారు. ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ అత్యంత దుర్మార్గమని, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ఆదివారం హిందూపురం డీఎస్పీ మహేష్‌ను ఆయన కార్యాలయంలో కలసి బాధితుల పరామర్శకు అనుమతించాలని కోరారు.
ఇందుకు ఆయన ససేమిరా అన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఇప్పుడు ‘తెలుగు దండుపాళ్యం పార్టీ’గా తయారైందన్న ఆమె.. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అమానుషం జరిగి రెండు రోజులైనా స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం బాధితులకు బాసటగా నిలవలేక పోయారని, నియోజకవర్గాన్ని గాలికి వదిలి సినిమాలకు పరిమితం కావడం బాధాకరమని నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు.
