మిస్ కూవాగం ‘ప్రవీణ’
సాక్షి, చెన్నై : మిస్ కూవాగం-2015గా మదురైకు చెందిన కంప్యూటర్ ఇంజినీర్ ప్రవీణ ఎంపికయ్యారు. కూత్తాండవర్ ఆలయం సన్నిధిలో తాళి బొట్లను ధరించి ఆనందోత్సాహంలో ిహజ్రాలు మునిగారు. రాత్రంతా జాగారంతో ఐరావంతుడి సేవలో తరించారు.
విల్లుపురం జిల్లా కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం మంగళవారం జరిగింది. కూత్తాండవర్(ఐరావంతుడు)ను ఆరాధించే హిజ్రాలు ఈ వేడుక నిమిత్తం వేలాదిగా కూవాగంకు తరలి వచ్చారు. హిజ్రాల పెళ్లి సందడి వేళకు సిద్ధం అయ్యారు. ముందు గా విల్లుపురం జిల్లా హిజ్రాల సంఘం నేత రాధా నేతృత్వంలో మిస్ కూవాగం పోటీలు జరిగాయి. ఇందులో తన అద్భుతమైన నటన తో ఆహూతుల్ని కట్టి పడేసిన తూత్తుకుడి శ్రీ వైకుంఠంకు చెందిన హిజ్రా రీమా ఉత్తమ నృత్య కారిణిగా, ఉత్తమ హిజ్రాగా ఎంపికయ్యారు.
ర్యాంప్‌పై వయ్యారాలను ఒలక బోస్తూ, అందగత్తెలకు తామేమి తీసి పోమన్నట్టుగా తమప్రతిభను చాటుకున్న చెన్నైకు చెందిన నమిత, కేరళకు చెందిన ప్రీతి, చెన్నైకు చెందిన రహస్య మొదటి మూడు స్థానాల్ని కైవశం చేసుకున్నారు. ఇక, తమ కోసం పార్లమెంట్‌లో గలం విప్పిన ఎంపీ తిరు చ్చి శివను ఈసందర్భంగా హిజ్రాల సంఘం ఘనంగా సత్కరించుకుంది. సినీ నృత్యదర్శకురాలు కళ, నటుడు విమల్, నటీమణులు షకీలా, అనురాధా, బాలాంబిక ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ వేడుకలకు హాజరు అయ్యారు. చివరగా మదురై కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్లు పరమేశ్వరన్, సుదర్శనం న్యాయ నిర్ణేతలుగా జరిగిన మిస్ కూవాగంలో కిరీటాన్ని మదురైకు చెందిన కంప్యూటర్ ఇంజినీర్ ప్రవీణ తన్నుకు వెళ్లారు.
రెండో స్థానంలో తూత్తుకుడికి చెందిన సుజి, మూడో స్థానాన్ని మదురైకు చెందిన హరిణి కైవశం చేసుకున్నారు. మిస్ కూవాగం-2015గా ఎంపికైన ప్రవీణకు నటి షకీల కిరీ టాన్ని అలంకరింప చేశారు. ఈసందర్భంగా ప్రవీణ మాట్లాడుతూ, హెఐవీ బాధిత హిజ్రాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. చీకటిలో ఉన్న హిజ్రాలు వెలుగులోకి వచ్చి బయటి ప్రపంచాన్ని చూడాలని పిలుపునిచ్చారు. చదువును మధ్యలో ఆపేసిన హిజ్రాల విద్యాభ్యాసం కొనసాగింపు, ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు.
పెళ్లి సందడి
మిస్ కూవాగం పోటీల అనంతరం హిజ్రాల పెళ్లి సందడికి సిద్ధం అయ్యారు. మధ్యాహ్నం పెళ్లి కూతుర్ల వలే ముస్తాబయ్యారు. ఆనందం గా, సరదాగా తమ వాళ్లతో కలసి షాపింగ్‌లో మునిగారు. ఎవరికి వారు తమకు తోచినట్టుగా తాళి బొట్లను కొనుగోలు చేసి సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం లో కూత్తాండవర్ విశ్వరూప ప్రదర్శన వేడుకలో పాల్గొని తమ ఆరాధ్యుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి అక్కడి పూజారుల చేత తాళి కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగారు. రాత్రంతా ఆలయ పరిసరాల్లో జాగారం చేస్తూ, ఆట పాటలతో ఆనందం తాండవం చేసిన హిజ్రా లు బుధవారం వితంతువులు మారనున్నారు.