బాబిసింహా సహకరించలేదు
నటుడు బాబి సింహా బ్లేమ్ చేస్తున్నారని దర్శక నిర్మాత మరుదపాండియన్ ఆరోపించారు. ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం చెన్నై ఉంగళై అన్బుడన్ వరవేర్కరదు. ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న బాబిసింహా, లింగా, ప్రభంజయన్‌లు హీరోలుగాను శరణ్యా సుందరరాజ్ హీరోయిన్‌గాను నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయడానికి బాబిసింహా సహకరించలేదని, ఐదు రోజులు షూటింగ్ కూడా చేయలేదని దర్శక నిర్మాత మరుదుపాండియన్ ఆరోపించారు. ఇంకా చెప్పాలంటే చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పలేదని, చిత్ర ప్రచారానికి కూడా సహకరించనన్నారని తెలిపారు. ఏమంటే చిత్ర వ్యాపారంలో, శాటిలైట్, ఎఫ్‌ఎంఎస్ హక్కుల్లో మేజర్ హక్కులు కావాలంటూ డిమాండ్ చేశారన్నారు.
అదే విధంగా లఘు చిత్రం అని చెప్పి సినిమా నిర్మించినట్లు దక్షిణ భారత నటీనటుల సంఘంలో తమపై ఫిర్యాదు చేశారని తెలిపారు. తాను చిత్ర నిర్మాణానికి ముందే చిత్ర స్క్రిప్టును అందరికీ వినిపించి కాల్‌షీట్స్ కోరినట్లు చెప్పారు. లఘు చిత్రం అంటున్న బాబిసింహా 30 రోజులు కాల్‌షీట్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆ విధంగా అకారణంగా తమను ఆయన బ్లేమ్ చేస్తున్నారని ఆరోపించారు. అయినా తాము కొన్ని చేర్పులు మార్పులు చేసి, సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రం పూర్తి చేసినట్లు దర్శక నిర్మాత వెల్లడించారు. సినీ దర్శకుడవ్వాలనే లక్ష్యంతో జీవించే యువకుడు తన లక్ష్యాన్ని చేరుకున్నారా? లేదా? అన్న ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం చెన్నై ఉంగళై అన్భుడన్ వరవేర్కిరదు చిత్రం అన్నారు.