రజనీకాంత్ టైటిల్‌లో బాబిసింహా
తమిళచిత్ర పరిశ్రమలో తన ఎదుగుదలను వేగంగా పెంచుకుపోతున్న నటుడు బాబిసింహా. అతి కొద్ది చిత్రాలతోనే జాతీయ అవార్డును పొందిన అరుదైన నటుడు బాబిసింహా. పలు చిత్రాల అవకాశాలిప్పుడు ఆయన తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా ఒకే సంస్థలో ఒకేసారి మూడు చిత్రాల్లో నటిస్తున్న ఏకైక నటుడు బాబీసింహానేనని చెప్పవచ్చు. ఆ సంస్థే ఆర్‌ఎస్ ఇన్ఫోటెంట్ ప్రైవేట్ లిమిటెడ్. కో, యామిరుక్కభయమే తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆ సంస్థ అధినేత ఎల్ రెడ్ కుమార్ తాజాగా మూడు చిత్రాలను రూపొందిస్తున్నారు. ఈ మూడింటిలో నటుడు బాబిసింహా నటించడం విశేషం. ఒకటి కో-2 కాగా పేరు పెట్టని మరో చిత్రం నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా వీరా అనే చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇది ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం టైటిల్ అన్న విషయం గమనార్హం. బాబిసింహా హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్ర వివరాలను నిర్మాత వెల్లడిస్తూ ఇది యాక్షన్, కామెడీ మిళితమైన జనరంజిక కథా చిత్రంగా ఉంటుందన్నారు. భాగ్యశంకర్ కథ,కథనం,మాటలు అందిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజారామ్ అనే నవ దర్శకుడ్ని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. వర్ధమాన నటుడు బాలశరవణన్ కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రంలో ఐశ్వర్యామీనన్ అనే నటిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థ ద్వారా పరిచయం చేసిన దర్శకులందరు మంచి పేరు తెచ్చుకున్నారని ఇప్పుడీ రాజారామ్‌కు దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకుంటాడనే నమ్మకం ఉందని నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ అన్నారు. వీరా చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.