Babisinha
-
ఛీఛీ ఏం పనిది!
చీ ఎం పనిది ఈ చీత్కారం ఎవరు, ఎవరిపై చేశారో తెలుసా? ఇవాళ సినిమా ట్రెండ్ మారిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1980–90 చిత్రాలతో నేటి చిత్రాలను ఏ విధంగానూ పోల్చజాలం. ముఖ్యంగా కథానాయికల దుస్తులు, వారి పాత్రల తీరు తెన్నులు చాలా మందికి నచ్చడం లేదు. కేవలం యూత్‌ను ఆకట్టుకుని వ్యాపార పరంగా లబ్ధి పొందే దృక్పథంతోనే హీరోయిన్ల రూపకల్పన జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సినిమా వ్యాపారమే కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడలేం. అసలు విషయం ఏమిటంటే తిరుట్టుప్పయలే–2 చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ఇందులో బాబీసింహా, ప్రసన్న, అమలాపాల్ ప్రధాన పాత్రలు పోషించారు. అందులో చిటపట చినుకుల్లో బొడ్డుకిందకు చీరకట్టుకున్న అమలాపాల్‌ను బాబీసింహా గట్టిగా బిగికౌగిలిలో బంధించేలా సన్నివేశం చోటుచేసుకుంది. చిత్ర ప్రకటనల్లోనూ ఈ ఫొటోనే వాడారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా నటి అమలాపాల్ ఒక పత్రికకిచ్చిన భేటీలో తాను బాబీసింహా కౌగిలించుకున్న సన్నివేశం చోటు చేసుకుందని, ఆ దృశ్యంలో తన నాభి గురించి ఇంత చర్చ జరుగుతుందని తాను ఊహించలేదంది. చిత్రంలో రొమాన్స్ సన్నివేశాల్లో నటించడానికి బాబీసింహా తటపటాయించారని, తానే చొరవ తీసుకుని ఆయన్ని నటింపజేశానని చెప్పింది. హిందీ చిత్రం పద్మావతి గురించి ఇటీవల ఒక టీవీలో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న ప్రముఖ ఎడిటర్ లెనిన్ అమలాపాల్ ఇంటర్వ్యూను ప్రచురించిన పత్రికను చూపిస్తూ ఛీ ఛీ ఏంపనిది అంటూ చీరేశారు. మరి ఈ విషయం నటి అమలాపాల్ దృష్టికి వెళ్లిందో లేదో? ఒక వేళ వెళితే తను ఎలా స్పందిస్తుందో చూడాలి. -
చిన్న చిత్రాలే సేఫ్
ఈ రోజుల్లో సినిమా విడుదలై వారం ఆడడమే గగనంగా మారింది. అలాంటి థియేటర్లలో ప్రదర్శన ఒక్క వారం దాటి అది మంచి విజయం సాధించినట్లే లెక్క. అలాంటి చిత్రాలే అరుదైపోయాయని చెప్పక తప్పదు. గత వారం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం మెట్రో. ఈ చిత్రం సెలైంట్‌గా సక్సెస్ వైపు దూసుకుపోతోంది. చిన్న చిత్రంగా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోందన్న ఆనందంతో చిత్ర యూనిట్ బుధవారం పత్రికల వారితో తన సంతోషాన్ని పంచుకున్నారు. యువ దర్శకుడు ఆనంద్‌క్రిష్ణన్ స్వీయ దర్శకత్వంలో నిర్మాత జయక్రిష్ణన్తో కలిసి నిర్మించిన చిత్రం మెట్రో. శిరీష్, బాబీసింహా, సెండ్రాయన్, సత్య, నిశాంత్, తులసి, ప్రీతి, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జోహాన్ సంగీతాన్ని అందించారు. సెన్సార్‌తో పోరాడి చివరికి ఏ సర్టిఫికెట్‌తోనే గత వారం తెరపైకి వచ్చిన మెట్రో చిత్రం చైన్ స్నాచింగ్ ఇతివృత్తంతో చాలా సహజసిద్ధంగా తెరపై ఆవిష్కరించారు. చిత్రం మంచి ప్రజాదరణ పొందడంతో పాటు పలువురు చిత్ర ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ మెట్రో చక్కని కథనంతో రూపొందిన చిత్రం అని చిత్రం చాలా నీట్‌గా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు. అదే విధంగా దర్శకుడు శీనూరామసామి మెట్రో చిత్రం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. అందులో అన్నదమ్ములుగా నటించిన నటులిద్దరు బాగా నటించారు అని ట్విట్టర్లో అభినందించారు. దర్శకుడు సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఒక ప్రణాళిక బద్ధంగా తెరకెక్కించిన చిత్రం మెట్రో అని తెలిపారు. చిత్రాన్ని చెన్నై పరిసర ప్రాంతాల్లోనే 40 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశామని తెలిపారు. చిన్న బడ్జెట్లో రూపొందించిన చిత్రం మెట్రో అని తెలిపారు. తాను ఇకపై కూడా చిన్న చిత్రాలనూ తెరకెక్కిస్తానన్నారు. ఇవి అయితే ఒక వేళ చిత్రం అటూఇటూ అయినా పెద్దగా నష్టం ఉండదన్నారు. అదే భారీ చిత్రం అపజయం పాలయితే నష్టం కూడా భారీగానే ఉంటుందన్నారు. తన వరకూ చిన్న బడ్జెట్ చిత్రాలే సేఫ్ అనే అభిప్రాయాన్ని దర్శకుడు ఆనంద్‌క్రిష్ణన్ వ్యక్తం చేశారు. -
రజనీకాంత్ టైటిల్లో బాబిసింహా
తమిళచిత్ర పరిశ్రమలో తన ఎదుగుదలను వేగంగా పెంచుకుపోతున్న నటుడు బాబిసింహా. అతి కొద్ది చిత్రాలతోనే జాతీయ అవార్డును పొందిన అరుదైన నటుడు బాబిసింహా. పలు చిత్రాల అవకాశాలిప్పుడు ఆయన తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా ఒకే సంస్థలో ఒకేసారి మూడు చిత్రాల్లో నటిస్తున్న ఏకైక నటుడు బాబీసింహానేనని చెప్పవచ్చు. ఆ సంస్థే ఆర్ఎస్ ఇన్ఫోటెంట్ ప్రైవేట్ లిమిటెడ్. కో, యామిరుక్కభయమే తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆ సంస్థ అధినేత ఎల్ రెడ్ కుమార్ తాజాగా మూడు చిత్రాలను రూపొందిస్తున్నారు. ఈ మూడింటిలో నటుడు బాబిసింహా నటించడం విశేషం. ఒకటి కో-2 కాగా పేరు పెట్టని మరో చిత్రం నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా వీరా అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం టైటిల్ అన్న విషయం గమనార్హం. బాబిసింహా హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్ర వివరాలను నిర్మాత వెల్లడిస్తూ ఇది యాక్షన్, కామెడీ మిళితమైన జనరంజిక కథా చిత్రంగా ఉంటుందన్నారు. భాగ్యశంకర్ కథ,కథనం,మాటలు అందిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజారామ్ అనే నవ దర్శకుడ్ని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. వర్ధమాన నటుడు బాలశరవణన్ కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రంలో ఐశ్వర్యామీనన్ అనే నటిని హీరోయిన్గా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థ ద్వారా పరిచయం చేసిన దర్శకులందరు మంచి పేరు తెచ్చుకున్నారని ఇప్పుడీ రాజారామ్‌కు దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకుంటాడనే నమ్మకం ఉందని నిర్మాత ఎల్రెడ్ కుమార్ అన్నారు. వీరా చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. -
బాబిసింహా సహకరించలేదు
నటుడు బాబి సింహా బ్లేమ్ చేస్తున్నారని దర్శక నిర్మాత మరుదపాండియన్ ఆరోపించారు. ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం చెన్నై ఉంగళై అన్బుడన్ వరవేర్కరదు. ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న బాబిసింహా, లింగా, ప్రభంజయన్లు హీరోలుగాను శరణ్యా సుందరరాజ్ హీరోయిన్‌గాను నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయడానికి బాబిసింహా సహకరించలేదని, ఐదు రోజులు షూటింగ్ కూడా చేయలేదని దర్శక నిర్మాత మరుదుపాండియన్ ఆరోపించారు. ఇంకా చెప్పాలంటే చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పలేదని, చిత్ర ప్రచారానికి కూడా సహకరించనన్నారని తెలిపారు. ఏమంటే చిత్ర వ్యాపారంలో, శాటిలైట్, ఎఫ్ఎంఎస్ హక్కుల్లో మేజర్ హక్కులు కావాలంటూ డిమాండ్ చేశారన్నారు. అదే విధంగా లఘు చిత్రం అని చెప్పి సినిమా నిర్మించినట్లు దక్షిణ భారత నటీనటుల సంఘంలో తమపై ఫిర్యాదు చేశారని తెలిపారు. తాను చిత్ర నిర్మాణానికి ముందే చిత్ర స్క్రిప్టును అందరికీ వినిపించి కాల్షీట్స్ కోరినట్లు చెప్పారు. లఘు చిత్రం అంటున్న బాబిసింహా 30 రోజులు కాల్షీట్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆ విధంగా అకారణంగా తమను ఆయన బ్లేమ్ చేస్తున్నారని ఆరోపించారు. అయినా తాము కొన్ని చేర్పులు మార్పులు చేసి, సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రం పూర్తి చేసినట్లు దర్శక నిర్మాత వెల్లడించారు. సినీ దర్శకుడవ్వాలనే లక్ష్యంతో జీవించే యువకుడు తన లక్ష్యాన్ని చేరుకున్నారా? లేదా? అన్న ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం చెన్నై ఉంగళై అన్భుడన్ వరవేర్కిరదు చిత్రం అన్నారు. -
జూన్‌లో ‘ఉరుమీన్’
ఉరుమీన్ చిత్రం వేరే ట్యూన్లో ఉంటుందంటున్నారు ఆ చిత్ర హీరో బాబిసింహా. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన పేరు బాబిసింహా చేసింది నాలుగే నాలుగు చిత్రాలు. వీటికి జాతీయస్థాయి గుర్తింపు. ఇది నిజంగా అరుదైన అంశమే. పిజ్జాతో నటనకు శ్రీకారం చుట్టిన ఈ యువ నటుడు ఆ తరువాత నేరం, సూదుకవ్వుం చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నాలుగవ చిత్రం జిగర్తండా బాబిసింహా పేరును జాతీయస్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో నటనకుగాను బాబి ఉత్తమ సహాయనటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్న బాబిసింహా నటించిన మరో విభిన్న కథా చిత్రం ఉరుమీన్. యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత డి.ఢిల్లీబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శక్తివేల్ పెరుమాళ్స్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రేష్మిమీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం గురించి బాబిసింహా తెలుపుతూ ఇది ఒక థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. లవ్, యాక్షన్‌తో పాటు చిన్న ఫాంటసీ సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటాయన్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు గ్రామం నుంచి చెన్నై మహానగరానికి వస్తాడని అక్కడ అతను ఎదుర్కొనే సమస్యలే చిత్ర కథ అని తెలిపారు. ఈ చిత్రంలో అన్ని అంశాలు వేరే ట్యూన్లో ఉంటాయని చెప్పారు. చిత్రాన్ని జూన్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత వెల్లడించారు. దీనికి అచ్చు రోజామణి సంగీతాన్ని అందిస్తున్నారు.