జూన్‌లో ‘ఉరుమీన్’
ఉరుమీన్ చిత్రం వేరే ట్యూన్‌లో ఉంటుందంటున్నారు ఆ చిత్ర హీరో బాబిసింహా. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన పేరు బాబిసింహా చేసింది నాలుగే నాలుగు చిత్రాలు. వీటికి జాతీయస్థాయి గుర్తింపు. ఇది నిజంగా అరుదైన అంశమే. పిజ్జాతో నటనకు శ్రీకారం చుట్టిన ఈ యువ నటుడు ఆ తరువాత నేరం, సూదుకవ్వుం చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నాలుగవ చిత్రం జిగర్‌తండా బాబిసింహా పేరును జాతీయస్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో నటనకుగాను బాబి ఉత్తమ సహాయనటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్న బాబిసింహా నటించిన మరో విభిన్న కథా చిత్రం ఉరుమీన్.
యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత డి.ఢిల్లీబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శక్తివేల్ పెరుమాళ్‌స్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రేష్మిమీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గురించి బాబిసింహా తెలుపుతూ ఇది ఒక థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. లవ్, యాక్షన్‌తో పాటు చిన్న ఫాంటసీ సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటాయన్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు గ్రామం నుంచి చెన్నై మహానగరానికి వస్తాడని అక్కడ అతను ఎదుర్కొనే సమస్యలే చిత్ర కథ అని తెలిపారు. ఈ చిత్రంలో అన్ని అంశాలు వేరే ట్యూన్‌లో ఉంటాయని చెప్పారు. చిత్రాన్ని జూన్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత వెల్లడించారు. దీనికి అచ్చు రోజామణి సంగీతాన్ని అందిస్తున్నారు.