పుణే: నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో స్థానిక సేనాపతి బాపట్ రోడ్డులోని చతుఃశృంగి ఆలయాన్ని యాజమాన్యం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. దీంతోపాటు ఫౌంటెయిన్లు, లాన్లు, పాలరాత్రి విగ్రహాలను కూడా ఏర్పాటుచేయనుంది. ఈ పండుగ సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం వస్తారు. దీంతో వారి భద్రత కోసం క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, ప్రత్యేకంగా ఓ రేడియో స్టేషన్, నిరంతరం సమాచారం అందించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. భద్రత, పరిశుభ్రత, వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ సముదాయాన్ని తీర్చిదిద్దుతోంది. అంతేకాకుండా మెట్ల పక్కన స్టీల్‌తో తయారుచేసిన రెయిలింగ్‌ను ఏర్పాటు చేస్తోంది.
ఈ విషయాన్ని చతుశృంగి దేవస్థానం ట్రస్టు సభ్యుడు నంద్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 18వ తేదీదాకా జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా హారతి, వేదమంత్ర పఠనం, భజనలు జరుగుతాయన్నారు. అమ్మవారికి రెండు మహా పూజలు నిర్వహించనున్నామన్నారు. తొలి పూజ ఐదో తేదీన, రెండో పూజ 13వ తేదీన జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యం కోసం ఆలయాన్ని 24 గంటలపాటు తెరిచి ఉంచుతామన్నారు. విజయదశమి సందర్భంగా నవచండి యజ్ఞం కూడా నిర్వహించనున్నామన్నారు. తొలిరోజు అమ్మవారిని మహాపల్లకీలో ఊరేగిస్తామన్నారు. ఊరేగింపు జరుగుతున్నంతసేపు హెలికాప్టర్ నుంచి అమ్మవారి పల్లకీపై పూలవర్షం కురిపిస్తామన్నారు. మేళతాళాలు, భాజాభజంత్రీలతో ఈ ఊరేగింపు ఘనంగా జరుగుతుందన్నారు. ఈ పల్లకీని 20 కిలోల వెండితో తయారు చేయించామన్నారు.
పండుగ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. 200 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వర్తించనున్నారన్నారు. వీరే కాకుండా 50 మంది వలంటీర్లు, 25 మంది సెక్యూరిటీ గార్డులు, మరో 25 మంది హోం గార్డులు ఆలయ సముదాయం పరిసరాల్లో తిరుగుతూ అందరిపైనా కన్నేసి ఉంచుతారన్నారు. ప్రతి ఏడాది ఇక్కడికొచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందన్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరు క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రవేశద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. కాగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక రేడియో స్టేషన్ ఈ ఏడాది ఉత్సవాల్లో ఆకర్షణగా నిలవనుందన్నారు. రేడియో జాకీలు భక్తులకు తగు సూచనలు ఇస్తుంటారన్నారు. దీంతోపాటు భక్తిగీతాలను కూడా వినిపిస్తారన్నారు.
సర్వాంగ సుందరంగా ‘చతుఃశృంగి’
Published Thu, Oct 3 2013 12:16 AM | Last Updated on Sat, Oct 20 2018 4:29 PM
Advertisement
Advertisement