బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు | Officers who blocked child marriage | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

Published Thu, Jun 29 2017 4:14 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

వేలూరు: కాట్పాడిలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అర్ధరాత్రి పెళ్లికి వచ్చిన బంధువులు పెళ్లి రద్దు చేసుకొని కల్యాణ మండపాన్ని ఖాళీ చేసి వెళ్లారు. వివరాల్లోకి వెళితే వేలూరు జిల్లా కాట్పాడి కయుంజూరుకు చెందిన క్రిష్ణమూర్తి కుమారుడు గణేష్‌కు ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు సమీపంలోని కొత్తూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు వివాహం నిశ్చయించి వివాహ ఏర్పాట్లను చేశారు.

కయుంజూరు రాధాక్రిష్ణ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం వివాహ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రం పెళ్లి కుమార్తె, వారి బంధువులు కయుంజూరులోని మండపానికి చేరుకున్నారు.ఇదిలా ఉండగా 17 ఏళ్ల బాలికకు వివాహం చేస్తున్నట్లు కాట్పాడి తహసీల్దార్‌ జగదీశన్‌కు బుధవారం వేకువజామున 3 గంటలకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో తహశీల్దార్, రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో కల్యాణ మండపానికి వెళ్లారు. అధికారులు వస్తున్న విషయం తెలుసుకున్న వివాహానికి వచ్చిన పెళ్లి జంటతో పాటు బంధువులు వివాహం జరపకుండా మండపాన్ని ఖాళీ చేసి పరారయ్యారు. అధికారులు వెళ్లి పరిశీలించగా మండపం బోసిపోయింది.

మండపం సమీపంలో వంట తయారు చేస్తున్న కార్మికుల వద్ద విచారణ జరపగా పెళ్లి బంధువులు పూర్తిగా ఇక్కడ నుంచి వెళ్లి పోయినట్లు తెలిపారు. పెళ్లిజంట చిత్తూరు జిల్లా కొత్తూరులోని పెళ్లి కుమార్తె ఇంటికి పరారై ఉండవచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కల్యాణ మండపానికి రూ.4 వేలు అడ్వాన్స్‌ ఇచ్చి ఉన్నారు. మండపంలో వంటకు ఉపయోగ పడే వస్తువులను పూర్తిగా అక్కడికక్కడే వదిలి వెళ్ల్లడంతో ఎలాగైనా పెళ్లి బంధువులు మండపానికి వస్తారని పోలీసు కాపలా కాశారు. బాల్య వివాహానికి ప్రయత్నించిన పెళ్లి పెద్దలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం పెళ్లిని చూడడానికి వచ్చిన పెళ్లి కుమారుడి స్నేహితులు, బంధువులు మండపం బోసిపోయి ఉండడంతో అవాక్కయ్యారు.

Advertisement
Advertisement