టాంజానియా యువతిపై దాడి కేసులో హోం మంత్రి ఆదేశాలు
బెంగళూరు: టాంజానియా యువతిపై దాడికి సంబంధించిన కేసులో 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ వెల్లడించారు. గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టాంజానియా యువతిపై జరిగిన దాడికి సంబంధించిన కేసును సీసీబీకి అప్పగించామని ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పరమేశ్వర్ తెలిపారు. నిందితుల్లో ఐదుగురు లోకేష్ అలియాస్ బంగారి, వెంకటేష్, సలీం పాషా, భానుప్రకాష్, రహమత్‌వుల్లాగా గుర్తించామని, వీరిని విచారిస్తున్నారని చెప్పారు. అయితే విద్యార్థిని వివస్త్రను చేసి ఊరేగించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే డీజీపీ ఓం ప్రకాష్, నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ సంఘటనా స్థలాన్ని ఇప్పటికే సందర్శించి, స్థానికులతో మాట్లాడారని చెప్పారు. ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని పరమేశ్వర్ వెల్లడించారు. ఆఫ్రికాకు చెందిన విద్యార్థులతో పాటు ఇతర విదేశీ విద్యార్థులకు సైతం భద్రత కల్పించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బెంగళూరు నగరంలో ప్రస్తుతం 12వేల మందికి పైగా విదేశీ విద్యార్థులు నివసిస్తున్నారని, వీరి రక్షణకు సంబంధించిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంద న్నారు. వీసా అవధి ముగిసిన విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు అందజేసినట్లు చెప్పారు.
48 గంటల్లో నివేదిక ఇవ్వండి ..
Published Fri, Feb 5 2016 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM
Advertisement
Advertisement