ఓ బొజ్జ గణపయ్య.. నీ బంటు మేమయ్యా!
పళ్లిపట్టు :వినాయక ప్రతిమల తయారీ పళ్లిపట్టు ప్రాంతంలో జోరుగా సాగుతోంది. ఈ సారి కాలుష్య రహిత విగ్రహాల తయారీకే కార్మికులు మొగ్గుచూపుతున్నారు. ఈ నెల 29న వినాయక చతుర్థి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పళ్లిపట్టు సమీపంలోని కుమారాజుపేట ప్రాంతంలో బొజ్జ గణపయ్యల ప్రతిమల తయారీ పనులు ఊపందుకున్నాయి. ఇక్కడ మూడు నెలల నుంచి ప్రతిమలు తయారు చేస్తున్నారు.
కాలుష్య రహిత గణపయ్యలు
గణపతి చతుర్థి సందర్భంగా కాలుష్యరహిత గణపయ్యల ప్రతిమలు మాత్రమే చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేసేందుకు పోలీసులు అనుమతించారు. ఈ నేపథ్యంలో కొయ్యగంజపిండి, చాక్‌పీస్ పిండితో పాటు మైదా పిండితో గణపతి ప్రతిమలను తయారు చేస్తున్నారు. ఈ ప్రతిమలతో ఎలాంటి కాలుష్యం ఉండదని భావిస్తున్నారు. బాల గణపయ్యల నుంచి 20 అడుగుల వరకు బంక మట్టితో విగ్రహాలను తయా రు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు అడుగుల నుంచి 20 అడుగుల పొడవు గల ప్రతిమలు తయారుచేసి వాటికి వర్ణం వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. గణపయ్యల్లో సింహ వినాయకుడు, లింగ వినాయకుడు, నెమలి వినాయకుడు, అన్న వినాయకుడు, గజ వినాయకుడు ఇలా పదికి పైగా వాహన సేవల్లో కొలువుదీరిన వినాయకుని ప్రతిమలు తయారు చేశారు. సైజును బట్టి ప్రతిమల ధర నిర్ణయించారు. రూ.20 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు పలుకుతున్నాయి.