వేధిస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు
Published Tue, Sep 27 2016 3:26 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
పళ్లిపట్టు: నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలని వేధిస్తున్నట్లు తొయిదావూర్ దళితులు తిరుత్తణి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తిరుత్తణి తాలూకాలోని తిరువాలాంగాడు మండలం తొయిదావూర్ దళితవాడలో దాదాపు 150 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 300 సంవత్సరాల పురాతన ఆదికుమరేశ్వరర్ ఆలయం దుస్థితికి చేరుకుని శిథిలావస్థలో ఉండేది.
ఆ ఆలయాన్ని కొంత మంది మరమ్మతులు చేపట్టి దీపం వెలిగించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఆలయంలో విలువైన ఆభరణాలు ఉన్నందునే కొందరు పథకం ప్రకారం ఆలయాన్ని తమ చేతుల మీదకు తీసుకుని ఆలయానికి సమీపంలోని వున్న దళితుల ఇళ్లు కూల్చేందుకు కుట్ర పన్ని వేధిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం తిరుత్తణిలోని ఆర్డీవో కార్యాలయం చేరుకున్న దళిత కుటుంబాలవారు తమ నివాస ప్రాంతాలను తొలగించేందుకు కొందరు ఆలయం పేరిట కుట్ర చేస్తున్నట్లు ఆలయంలోని విలువైన ఆభరణాలు దోపిడీ చేసేందుకు వీలుగా కుట్ర చేస్తున్నట్లు ఆరోపిస్తూ ఆర్డీవో విమల్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దళితుల ఫిర్యాదు స్వీకరించిన ఆర్డీవో తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Advertisement