Thiruthani
-
హోటల్లో నాగుపాము హల్చల్.. భయంతో కస్టమర్ల పరుగులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ పాము హల్చల్ చేసింది. తిరుత్తణి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లోని వంట గదిలోకి 5 అడుగుల పొడవైన పాము ప్రవేశించింది. నాగుపామును గుర్తించిన సిబ్బంది, కస్టమర్లు భయంతో హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హాటల్లోని వంటగదిలో దాక్కున్న పామును పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చదవండి: వాట్ ఏ గట్స్ బాస్! నీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్! -
పిల్లర్ల మధ్య చిక్కుకున్న చిన్నారి
చెన్నై ,తిరుత్తణి: రెండు స్తంభాల మధ్యలో తల చిక్కుకున్న చిన్నారిని ప్రయాణికులు రక్షించారు. ఈ సంఘటన తిరుత్తణిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. తిరుత్తణి సమీపంలోని కృష్ణసముద్రం గ్రామానికి చెందిన వేలు కార్మికుడు. అతని భార్య మాలతి, ఐదేళ్ల పాప కృత్తిక సహా గురువారం సాయంత్రం తిరుత్తణి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. చెన్నైకు రైల్లో వెళ్లేందుకు రెండవ ప్లాట్‌ఫాంలో వేచి ఉన్నారు. అక్కడ చిన్నారి ఆడుకుంటోంది. హఠాత్తుగా చిన్నారి తల ఇనుప పిల్లర్ల మధ్యలో చిక్కుకుంది. దీంతో చిన్నారి కేకలు వేసింది. ప్రయాణికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గడ్డపారతో రెండు స్తంభాలను చీల్చి చిన్నారిని క్షేమంగా వెలుపలికి తీశారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఊపరి పీల్చుకున్నారు. -
వేధిస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు
పళ్లిపట్టు: నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలని వేధిస్తున్నట్లు తొయిదావూర్ దళితులు తిరుత్తణి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తిరుత్తణి తాలూకాలోని తిరువాలాంగాడు మండలం తొయిదావూర్ దళితవాడలో దాదాపు 150 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 300 సంవత్సరాల పురాతన ఆదికుమరేశ్వరర్ ఆలయం దుస్థితికి చేరుకుని శిథిలావస్థలో ఉండేది. ఆ ఆలయాన్ని కొంత మంది మరమ్మతులు చేపట్టి దీపం వెలిగించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఆలయంలో విలువైన ఆభరణాలు ఉన్నందునే కొందరు పథకం ప్రకారం ఆలయాన్ని తమ చేతుల మీదకు తీసుకుని ఆలయానికి సమీపంలోని వున్న దళితుల ఇళ్లు కూల్చేందుకు కుట్ర పన్ని వేధిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తిరుత్తణిలోని ఆర్డీవో కార్యాలయం చేరుకున్న దళిత కుటుంబాలవారు తమ నివాస ప్రాంతాలను తొలగించేందుకు కొందరు ఆలయం పేరిట కుట్ర చేస్తున్నట్లు ఆలయంలోని విలువైన ఆభరణాలు దోపిడీ చేసేందుకు వీలుగా కుట్ర చేస్తున్నట్లు ఆరోపిస్తూ ఆర్డీవో విమల్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దళితుల ఫిర్యాదు స్వీకరించిన ఆర్డీవో తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
తిరుత్తణి స్వామివారికి టీటీడీ సారె
– ఈవో, తిరుమల జేఈవో దంపతులచే సమర్పణ తిరుపతి అర్బన్: ఆడికృత్తిక ఉత్సవాలను పురస్కరించుకుని తమిళనాడులోని తిరుత్తణి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ వళ్లీ–దేవసేన సమేత సుబ్రమణ్య స్వామివారికి టీటీడీ తరఫున సారె సమర్పించారు. ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు దంపతులు, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు దంపతులు గురువారం తిరుపతి నుంచి బయల్దేరి పట్టు వస్త్రాలు, సారెతో తిరుత్తణికి చేరుకున్నారు. తిరుత్తణి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ సుబ్రమణ్య స్వామివారికి సమర్పించారు. తిరుత్తణి ఆలయ అర్చకులు టీటీడీ పట్టు వస్త్రాలు, సారెను స్వామివార్లకు అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో సాంబశివరావు మాట్లాడుతూ ఆడికృత్తిక సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీ సుబ్రమణ్య స్వామివారి ఆలయానికి టీటీడీ నుంచి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తమిళనాడుకు చెందిన భక్తులే కాకుండా, సరిహద్దు జిల్లాల భక్తులు కూడా కావడులతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారని పేర్కొన్నారు. -
తిరుత్తణిలో వికలాంగుల దినోత్సవం
తిరుత్తణి, న్యూస్‌లైన్: తిరుత్తణిలోని మురుగప్ప నగర్లో ఉన్న రాస్ స్వచ్ఛంద సంస్థ మానసిక వికలాంగుల స్పెషల్ స్కూల్లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. తిరుత్తణి గోల్డన్ టవర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ హరికుమార్ శర్మ అధ్యక్షతలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ వెంకట సుబ్బు పాల్గొని వికలాంగ విద్యార్థులకు కౌన్సిలింగ్ జరిపారు. తర్వాత విద్యార్థులకు లయన్స్ క్లబ్ తరపున సిల్వర్ ప్లేట్లు, బిస్కెట్లు, పెన్సిల్ బాక్సులు, చాపలు అందించారు.లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు ఉదయశంకర్, జిల్లా మాజీ విద్యాశాఖ ప్రధాన అధికారి వెంకటశేషు, లయ న్స్ క్లబ్ కార్యదర్శి విశ్వనాథన్, ఉపాధ్యక్షులు గౌతంచంద్, టీడీ రంగనాథన్, ఉప కార్యదర్శి గిరిష్‌కుమార్, డెరైక్టర్లు మనోహర పాండ్యన్, మునికృష్ణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ మునస్వామి నాయుడు పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న కారు: ఇద్దరి మృతి
తిరుత్తణి, న్యూస్‌లైన్:తిరుత్తణిలో ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు చెన్నైలోని కీళకట్టలై, అరుల్‌మురుగన్ నగర్, తిరుప్పరం కుండ్రం వీధికి చెందిన రామస్వామి (70), భార్య మనోరంజితం (60), కొడుకు బాలాజి (41), కోడలు నాగమణి (34), మనువళ్లు విఘ్నేష్ (16), నందకుమార్ (1) గురువారం ఉదయం చెన్నై నుంచి తిరుమలకు దర్శనార్థం కారులో వెళ్లారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకుని గురువారం రాత్రి తిరుత్తణి మీదుగా చెన్నైకి కారులో వెళుతుండగా తిరుత్తణి వద్ద రెండవ చెన్నై బైపాస్ రోడ్డు వద్ద అక్కడ నెల్లూరు నుంచి పాండిచ్చేరికి పామాయిల్ తీసుకెళుతూ ఆగివున్న ట్యాంకర్ లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న విఘ్నేష్ (16) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన ఐదుగురిని పోలీసులు తిరుత్తణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నందకుమార్(1) మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం రామస్వామి, రంజితం, బాలాజీ, నాగమణిని పోరూరు రామచంద్ర ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ ధర్మపురి జిల్లాకు చెందిన కుమార్ (30)ని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.