టమాట @100
* మరింత ప్రియం
* వినియోగదారుల గగ్గోలు
* ధర తగ్గేది అనుమానమే
సాక్షి, చెన్నై: టమాటా ధర ప్రజలకు చుక్కలు చూపించే పనిలో పడింది. పేద, మధ్య తరగతి వర్గాలకు అందనంతగా కేజీ ధర మంగళవారం రూ.వందను తా కింది. ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా వర్తకులు ప్రకటించడంతో వినియోగదారులు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి.
వంటకాల తయారీలో టమాట తప్పనిసరి. ప్రతి ఇంటా నిత్యం టామాట వాడకం జరుగుతూ వస్తున్నది. టామాట లేదంటూ వంట కాల్లో రుచి లేనట్టే. అందుకే మార్కెట్టుకు వచ్చే వాళ్లు తప్పనిసరిగా టామాట కొనుగోలు చేసి తీరుతారు. అందుకే ఈ టమాట తరచూ ప్రజలకు చుక్కలు చూపించే పనిలో పడింది. గత ఏడాది టమాట మరింత ప్రియంగా మారితే, ఈ ఏడాది ఆరంభంలో కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. మార్చిలో ఒక కేజీ రూ. 20 నుంచి రూ. 30 వరకు ధర పలికినా, చివరకు నెలాకరులో చతికిలబడింది.
మళ్లీ పుంచుకున్నట్టుగా ఏప్రిల్‌లో రూ.30 నుంచి రూ. 40 వరకు ధర పలికింది. మే నుంచి ధర అమాంతంగా పెరగడం మొదలైందని చెప్పవచ్చు. గత నెల రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలికిన టమాట జూన్ మొదటి వారం చివర్లో రూ.80కు చేరి, మంగళవారం రూ. వంద పలికింది. కేజీ టమాట ధర సెంచరీ కొట్టడంతో వినియోగదారులు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి. చెన్నై, కోయంబేడు మార్కెట్‌కు రోజుకు వంద నుంచి 150 వరకు టమాట లారీలు వస్తున్నట్టు, ప్రస్తుతం ఆ సంఖ్య సగానికి సగం పడి పోవడంతో ధర అమాంతంగా పెరగక తప్పలేదంటూ వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్, చిత్తూరు, కర్ణాటక రాష్ట్రం బళ్లారి, చింతామణిల నుంచి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి టామాట ఇక్కడి మార్కెట్‌కు వస్తున్నదని, అయితే, ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి లారీల రాక తగ్గినట్టు చెబుతున్నారు. పదిహేను కేజీలతో కూడిన టామాట గంప టోకు వర్తకంలో రూ.900 వరకు పలుకుతున్నదని, ఇది చిల్లర వర్తకానికి వచ్చే కొద్ది కేజి రూ. వంద చొప్పున విక్రయించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు.
ధర అమాంతంగా పెరగడం, ఇది మరో నెల రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా వ్యాపారులు పేర్కొనడంతో ఒకటి రెండు రోజుల్లో కేజి ధర సెంచరీని దాట వచ్చన్న ఆందోళన బయలు దేరింది. దుకాణాల వద్ద టామాట కేజీ వంద అంటూ బోర్డులు దర్శనం ఇవ్వడంతో కొనుగోలు దారులకు షాక్ తప్పలేదు. పేద, మధ్య తరగతి వర్గాలు టమాటాను కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. టమాట వాడకం కన్నా, చింతపండును వంటకాలకు ఉపయోగించుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, టమాట రుచి, చింతపండు రుచి వేరుగా ఉంటాయని, ధర అమాంతంగా పెరగడం వల్ల ఎక్కడ తాము కొనుగోలు చేయగలమని కేకే నగర్‌కు చెందిన లలిత, శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ధర తగ్గేందుకు తగ్గ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని క్రోంపేటకు చెందిన జయంతి విన్నవించారు. ఎండల ప్రభావం ఈ సారి అధికం కావడంతో టమాట ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్టు అందుకే, బయటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి సరుకులు రావడం లేదని టోకు వర్తకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో టమాట ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లో వర్షాలు చెదురుమదురుగా పడుతుండడంతో పంటదెబ్బ తింటున్నదని, అందుకే టమాట ప్రియంగా మారుతున్నదని చెబుతున్నారు.