విద్యకు పెద్ద పీట | pune municipal corporation prefers to education | Sakshi
Sakshi News home page

విద్యకు పెద్ద పీట

Published Fri, Dec 27 2013 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

pune municipal corporation prefers to education

పుణే: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను నగర పాలక సంస్థ (పీఎంసీ) పాఠశాల బోర్డు కోసం రూ. 305 కోట్ల వార్షిక బడ్జెట్‌ను స్థాయీ సమితి ఎదుట ప్రవేశపెట్టింది. నగరపాలక సంస్థకు చెందిన పాఠశాల బోర్డుకు రూ. 300 కోట్లకంటే ఎక్కువ అధిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ విషయమై స్థాయీ సమితి అధ్యక్షుడు విశాల్ తాంబే మాట్లాడుతూ ‘పాఠశాల బోర్డు రూ. 329 కోట్ల బడ్జెట్‌ను రూపొందించి దానిని పీఎంసీకి సమర్పించింది. అయితే పరిపాలనా విభాగం దానిలో కొన్ని సవరణలు చేసి రూ. 279 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనను స్థాయీసమితి ముందుంచింది. ఏదిఏమైనప్పటికీ రూ. 305 కోట్ల మేర నిధులను కేటాయించాలని మేం నిర్ణయించాం. ఆమోదం కోసం దీనిని సర్వసభ్య సమావేశం ముందుంచాం’ అని అన్నారు.
 ఉద్యోగులకు రుణాలు
 పీఎంసీ సిబ్బంది సొంత ఇళ్లను నిర్మించుకోవడంతోపాటు వాహనాలు, కంప్యూటర్లను కొనుగోలు చేసేందుకు రుణ పథకం అందుబాటులోకి తీసుకురావాలని స్థాయీ సమితి ప్రతిపాదించిందని విశాల్ తాంబే తెలిపారు. రూ. ఆరు వేల గౌరవ వేతనం అందుకుంటున్న శిశు పాఠశాలకు చెందిన అధ్యాపకులకు మరో రూ. 1,000 మేర పెంచాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందన్నారు. ఇక పాఠశాల అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులకు కూడా వేతనాలను పెంచనున్నామన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనం కూడా పెంచనున్నామన్నారు.ప్రత్యేక శిక్షణా కేంద్రం ఏర్పాటుకు కోటి రూపాయలు కేటాయించామన్నారు. స్థానిక ప్రభాత్ రోడ్డులోని సన్‌డ్యూ అపార్ట్‌మెంట్‌లో ఇది ప్రారంభమవుతుందన్నారు. పాఠశాలల నిర్వహణ సజావుగా సాగేందుకుగాను కార్పొరేట్ సంస్థల మద్దతు కోరాలని బోర్డు ప్రతిపాదించిందని, ఇందులోభాగంగా ఇప్పటికే కొన్ని సంస్థలను సంప్రదించిందని, అందుకు ఆయా సంస్థలు ముందుకొచ్చాయని వివరించారు.
 ఐఎంపీని అనుకరించండి
 బస్సు శీఘ్ర రవాణా వ్యవస్థను అమలు చేసే సమయంలో సమీకృత సంచార ప్రణాళిక (ఐఎంపీ)ని అనుకరించాలని నేషనల్ సొసైటీ ఫర్ క్లీన్ సిటీ (ఎన్‌ఎస్‌సీసీ) నగరపాలక సంస్థను కోరింది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థ ప్రతినిధులు ఇటీవల పీఎంసీతో సమావేశమైన సందర్భంగా నగర్ రోడ్డు, అలంది మార్గాల్లో బీఆర్‌టీఎస్ మౌలిక సదుపాయాల కల్పన పనుల పురోగతిపై ఓ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌సీసీ ఈ మేరకు పీఎంసీ కమిషనర్‌కు ఓ లేఖ రాసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement