న్యూఢిల్లీ: భూసేకరణకు సంబంధించిన కేసుల విచారణకు తగిన ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరుతూ కేసును ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిఫార్సు చేసింది. ఈ కేసులో ఫిబ్రవరి 8న వెలువరించిన తీర్పుపై బుధవారం ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్టే విధించడంతో వివాదం నేపథ్యంలో ఈ అంశాన్ని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాకు రిఫర్ చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్‌తో కూడిన ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
ఈ అంశాన్ని సీజేఐకి సిఫార్సు చేయడమే సరైన నిర్ణయమని, బుధవారం నాటి ఉత్తర్వుల నేపథ్యంలో ఈ అంశంపై విచారణను కొనసాగించాలా? లేదా? అనే విషయాన్ని ఆయనే తేలుస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్దేశిత ఐదేళ్ల కాలంలో పరిహారం చెల్లించనట్లయితే దాని పేరు చెప్పి భూ సేకరణను రద్దు చేయడం చెల్లదని ఫిబ్రవరి 8న జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. పుణే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో 2014లో మరో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
అయితే దీనిపై జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థ అన్ని అంశాలపై ఒకేలా వ్యవహరించాలని పేర్కొంది. ఈనెల 8న వెలువరించిన తీర్పును పరిశీలించినట్లైతే.. న్యాయ వ్యవస్థ క్రమశిక్షణలో వ్యత్యాసం కనిపిస్తోందని, అభిప్రాయభేదాలు ఉన్నందున ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని, అలాగే హైకోర్టులు ఈ అంశంపై దాఖలైన కేసులను విచారించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం స్పందిస్తూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తీర్పు వెలువరించామని, తీర్పు పూర్తిగా చదవకుండానే దాడికి దిగుతారని, ముందు తీర్పు కాపీని చదివి ఆ తర్వాత మాట్లాడాలని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఎవరు విచారించాలనేది సీజేఐ నిర్ణయిస్తారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment