Land acquisition case
-
రాబర్ట్ వాద్రాకు రాజస్తాన్ హైకోర్టులో ఎదురుదెబ్బ
జోద్పూర్: భూమి కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు రాజస్తాన్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. అయితే, ఆయనకు కొంత ఊరట కల్పించింది. ఇదే కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారంలో రాబర్ట్ వాద్రాను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన స్టేను మరో నాలుగు వారాలు పొడిగించింది. స్కై లైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ రాజస్తాన్‌లోని బికనేర్‌లో 41 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేసింది. ఈ సంస్థతో రాబర్ట్ వాద్రాకు, ఆయన తల్లి మౌరీన్ వాద్రాకు సంబంధాలు ఉన్నట్లు ఈడీ చెబుతోంది. భూకొనుగోలులో మనీ ల్యాండరింగ్ జరిగిందని, ఇందులో రాబర్ట్ వాద్రా పాత్ర ఉన్నట్లు గుర్తించింది. -
సీజేఐ వద్దకు భూ పంచాయితీ
న్యూఢిల్లీ: భూసేకరణకు సంబంధించిన కేసుల విచారణకు తగిన ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరుతూ కేసును ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిఫార్సు చేసింది. ఈ కేసులో ఫిబ్రవరి 8న వెలువరించిన తీర్పుపై బుధవారం ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్టే విధించడంతో వివాదం నేపథ్యంలో ఈ అంశాన్ని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాకు రిఫర్ చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్‌తో కూడిన ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని సీజేఐకి సిఫార్సు చేయడమే సరైన నిర్ణయమని, బుధవారం నాటి ఉత్తర్వుల నేపథ్యంలో ఈ అంశంపై విచారణను కొనసాగించాలా? లేదా? అనే విషయాన్ని ఆయనే తేలుస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్దేశిత ఐదేళ్ల కాలంలో పరిహారం చెల్లించనట్లయితే దాని పేరు చెప్పి భూ సేకరణను రద్దు చేయడం చెల్లదని ఫిబ్రవరి 8న జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. పుణే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో 2014లో మరో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అయితే దీనిపై జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థ అన్ని అంశాలపై ఒకేలా వ్యవహరించాలని పేర్కొంది. ఈనెల 8న వెలువరించిన తీర్పును పరిశీలించినట్లైతే.. న్యాయ వ్యవస్థ క్రమశిక్షణలో వ్యత్యాసం కనిపిస్తోందని, అభిప్రాయభేదాలు ఉన్నందున ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని, అలాగే హైకోర్టులు ఈ అంశంపై దాఖలైన కేసులను విచారించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం స్పందిస్తూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తీర్పు వెలువరించామని, తీర్పు పూర్తిగా చదవకుండానే దాడికి దిగుతారని, ముందు తీర్పు కాపీని చదివి ఆ తర్వాత మాట్లాడాలని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఎవరు విచారించాలనేది సీజేఐ నిర్ణయిస్తారని పేర్కొంది. -
ప్రాణాలు తీశాయా..?
మూడేళ్లుగా కోర్టులో నలుగుతున్న భూతగాదా కేసు నేపథ్యంలోనే ఆ దంపతుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ విధులు నిర్వహిస్తున్న భార్యాభర్తలు గురువారం రాత్రి మక్కువ మం డ లంలో హత్యకు గురయ్యారు. భూతగాదా కేసు వాయిదా శుక్రవారం ఉండగా ప్రత్యర్థులే మాటువేసి ముందు రోజు హత్యలకు తెగబడ్డారని స్థానికులు, బంధువులు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మక్కువ మండలంలోని ఎస్.పెద్దవలస గ్రామానికి చెందిన వేమల భాస్కరరావు(56), లక్ష్మీకాంతం(50) గురువారం రాత్రి హత్యకు గురైనా శుక్రవారం ఉదయం వరకూ బయట ప్రపంచానికి తెలియ లేదు. సొంత గ్రామానికి కూతవేటు దూరంలో ఈ సంఘటన జరిగినా, అది నిర్జన ప్రదేశం కావడంతో రాత్రంతా మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయారు. గ్రామానికి చెందిన భాస్కరరావు అదే వెంకటభైరిపురంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, భార్య లక్ష్మీకాంతం పాచిపెంట జెడ్పీ హైస్కూలులో పనిచేస్తున్నారు. లక్ష్మీకాంతం పనిచేస్తున్న పాఠశాలలో గురువారం జరిగిన వార్షికోత్సవానికి ఆమె హాజరై తిరిగి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. ఆటోలో శంబర వరకు ఆమె చేరుకోగా గ్రామం నుంచి భాస్కరరావు ద్విచక్రవాహనం తీసుకుని శంబర వెళ్లారు. రాత్రి సుమారు 9.30గంటల సమయంలో ఎస్.పెద్దవలస గ్రామం ముందు తీళ్లవాని చెరువు వద్ద దారికాసిన దుండగులు ఇనుప రాడ్డుతో ఇద్దరి తలలపై బలంగా మోదడంతో ఆ దంపతులు అక్కడే పడిపోయారు. తీవ్ర రక్తస్రావం అవడంతో భాస్కరరావు అక్కడే మృ తి చెందారు. శంబర గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు శుక్రవారం ఉదయం చూడడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సంఘటనా స్థలానికి వచ్చి లక్ష్మీకాంతం కొనఊపిరితో ఉన్నట్లు గమనించి వెంటనే 108 వాహనంలో బొబ్బిలి తరలించారు. అయితే ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. మృతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె నీలిమరాణి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి-భీమవరంలో, చిన్నకుమార్తె భారతీ దేవి విశాఖలో, కుమారుడు సాయిఅభిలాష్ ఒడిశాలోని రౌర్కెలాలో చదువుతున్నారు. పిల్లలు ముగ్గురు చదువుకునే వయసులో ఉండగా తల్లిదండ్రులు హత్యకు గురికావడంతో వారు అనాథలయ్యారని బంధువులు, గ్రామస్తులు రోదించారు. తగాదా నేపథ్యం ఇది.. గ్రామానికి చెందిన అల్లు సత్యనారాయణకు, హత్యకు గురైన ఉపాధ్యాయ దంపతులకు మధ్య కొంతకాలంగా భూవివాదం ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామసమీపంలో ఉన్న భూమిని అల్లు సత్యనారాయణ తల్లి అప్పలనరసమ్మ గతంలో భాస్కరరావుకు విక్రయిం చారు. అయితే అప్పట్లో తక్కువ ధరకు భూమిని అమ్మేశారని అపోహ పెట్టుకున్న సత్యనారాయణ మూడేళ్లుగా భాస్కరరావుతో గొడవ పడుతున్నాడు. వీటిపై పోలీస్‌స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ ఎప్పటికప్పుడు తిరుగుతున్నారు. శుక్రవారం బొబ్బిలి కోర్టులో వాయిదా ఉండగా గురువారం రాత్రి హత్యకు గురయ్యారు. మద్యం సేవించి...రాడ్డుతో బాది ఉపాధ్యాయ దంపతులు హత్యకు గురైన ప్రదేశానికి సమీపంలో హంతకులకు చెందిన పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. తీళ్లవాని చెరువు సమీపంలోని అరటితోటలో మద్యం సీసాలు, వాటర్ ప్యాకెట్లు, గారెలు వంటివి లభ్యమయ్యాయి. దీనిని బట్టి భా స్కరరావు ఒంటరిగా ద్విచక్రవాహనంపై వెళ్లడాన్ని గమనించి పక్కా ప్రణాళిక వేసుకున్నట్టు అర్థమవుతోంది.. అలాగే హంతకుల్లో ఒకరి సెల్‌ఫోన్, చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు కూడా సంఘటనా స్థలానికి సమీపంలోనే దొరికింది. అయితే భూ తగదా జరుగుతున్న సత్యనారాయణపై అనుమానంతో పొలీసులు ఆరాతీయగా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆదిశగా పోలీసు లు విచారణ మొదలు పెట్టారు. శోకసంద్రంలో గ్రామం గ్రామానికి చెందిన భార్యాభర్తలు హత్యకు గురికావడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉపాధ్యాయ దంపతులు హత్య వార్త తెలుసుకుని మక్కువ, సాలూరు ,పాచిపెంట మండలాలనుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న నాయకులు హత్య జరిగిన విషయం తెలుసుకున్న సాలూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీడిక రాజన్నదొర, మక్కువ మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు బొంగుచిట్టినాయుడు, లండ నరసింహమూర్తి, బొమ్మి కృష్టమూర్తిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన ఉపాధ్యాయుల మృతదేహాలను చూసి విచారం వ్యకం చేశారు. సాలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పి.భంజ్ధేవ్, మాజీ ఎంపీపీ మావుడి శ్రీనివాసరావు, మండలకాంగ్రెస్నాయుకులు మావుడి రంగునాయుడు, మండలటీడీపీ అధ్యక్షుడు పెంట తిరుపతిరావు, సీపీఎం మండల నాయకులు చింతల తవిటినాయుడులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
బొత్స సోదరుడిపై భూఆక్రమణ కేసు
భూయాజమాన్య వివాదం ‘సుప్రీం’లో పెండింగ్.. యథాతథస్థితి ఉత్తర్వులున్నా సతీష్ భవన నిర్మాణ పనులు కబ్జాపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదు హైదరాబాద్, న్యూస్‌లైన్: పీసీసీ అధ్యక్షుడు, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు సతీష్‌పై భూఆక్రమణ కేసు నమోదైంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారంటూ రెవెన్యూ అధికారులు నాలుగు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి... షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నం.12 కమాన్‌లో ఉన్న సర్వే నంబరు 403లోని 500 గజాల స్థలంలో బొత్స సతీష్ భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను రెండు నెలల క్రితమే అప్పటి తహసిల్దార్ చంద్రకళ అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాలను ఆధీనంలోకి తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ సంక్రాంతి సెలవుల్లో సతీష్ మళ్లీ నిర్మాణ పనులు మొదలెట్టారు. స్థలం చుట్టూ ఐరన్ షీట్లు వేస్తూ, లోపల పునాదుల తవ్వే పనులు చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆ ఐరన్ షీట్లను తొలగించారు. సతీష్‌పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్థలం యాజమాన్యానికి సంబంధించిన వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. సతీష్ నిర్మాణం చేపట్టిన స్థలం భాగంగా ఉన్న మొత్తం 15 ఎకరాల భూమి తనదేనంటూ షేక్ అహ్మద్బిన్ ఆమోదీ అనే వ్యక్తి భూఆక్రమణల నిరోధక కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. అసలు ఇది ప్రభుత్వ స్థలమంటూ యథాతథ స్థితి ఉత్తర్వులతో అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా సతీష్ రాజకీయ బలంతో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సతీష్‌పై భూఆక్రమణ కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.