భూయాజమాన్య వివాదం ‘సుప్రీం’లో పెండింగ్.. యథాతథస్థితి ఉత్తర్వులున్నా సతీష్ భవన నిర్మాణ పనులు
కబ్జాపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదు
హైదరాబాద్, న్యూస్‌లైన్: పీసీసీ అధ్యక్షుడు, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు సతీష్‌పై భూఆక్రమణ కేసు నమోదైంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారంటూ రెవెన్యూ అధికారులు నాలుగు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి... షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నం.12 కమాన్‌లో ఉన్న సర్వే నంబరు 403లోని 500 గజాల స్థలంలో బొత్స సతీష్ భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను రెండు నెలల క్రితమే అప్పటి తహసిల్దార్ చంద్రకళ అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాలను ఆధీనంలోకి తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ సంక్రాంతి సెలవుల్లో సతీష్ మళ్లీ నిర్మాణ పనులు మొదలెట్టారు. స్థలం చుట్టూ ఐరన్ షీట్లు వేస్తూ, లోపల పునాదుల తవ్వే పనులు చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆ ఐరన్ షీట్లను తొలగించారు.
సతీష్‌పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్థలం యాజమాన్యానికి సంబంధించిన వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. సతీష్ నిర్మాణం చేపట్టిన స్థలం భాగంగా ఉన్న మొత్తం 15 ఎకరాల భూమి తనదేనంటూ షేక్ అహ్మద్‌బిన్ ఆమోదీ అనే వ్యక్తి భూఆక్రమణల నిరోధక కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. అసలు ఇది ప్రభుత్వ స్థలమంటూ యథాతథ స్థితి ఉత్తర్వులతో అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా సతీష్ రాజకీయ బలంతో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సతీష్‌పై భూఆక్రమణ కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బొత్స సోదరుడిపై భూఆక్రమణ కేసు
Published Tue, Jan 28 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
Advertisement
Advertisement