♦ కల్తీ చేస్తే కఠిన శిక్షలేనన్న సీఎం
♦ ఉరిశిక్ష పడేలా చట్ట సవరణ చేసేందుకు సిద్ధమని వెల్లడి
ముంబై : ఆహారం, పాలు, మందులు వంటి వాటిని కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కల్తీ కేసుల్లో దోషులుగా తేలితే ఉరిశిక్ష పడేలా చట్ట సవరణ చేసేందుకు తాము సిద్ధమని విధానమండలిలో ప్రభుత్వం గురువారం పేర్కొంది. ‘రాష్ట్రంలో ఇకపై కల్తీ వ్యాపారాలు బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ సందేశం ఇచ్చేందుకే ‘మాల్వణీ కల్తీ సారా’ నిందితులపై సెక్షన్ 302 (హత్య) నేరం మోపాం. దోషులకు ఉరిశిక్ష పడేలా చూస్తాం. అవసరమైతే చట్ట సవరణ చేసేందుకు కేంద్రాన్ని సంప్రదిస్తాం’ అని సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు. కాలింగ్ అటెన్షన్ మోషన్‌లో భాగంగా మాట్లాడిన ఆర్పీఐ ఎమ్మెల్సీ జోగేంద్ర కవాడే, 100 మందికి పైగా మృతికి కారణమైన ‘మాల్వణీ కల్తీసారా’ నిందితులకు ఉరిశిక్ష విధించేలా ప్రభుత్వం చొరవ చూపించాలని డిమాండు చేశారు.
గడ్చిరోలీ, వార్ధా, చంద్రాపూర్ జిల్లాల్లో మద్యపాన నిషేధం విధించిన ప్రభుత్వం, దాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలని కోరారు. కవాడాకు జవాబిచ్చిన ఫడ్నవీస్, నాటుసారా పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతోందని వివరణ ఇచ్చారు. ప్రభుత్వం మద్యపాన నిషేధం విధించిన జిల్లాల్లో ఒక్క ఫోన్ చేస్తే ఇంటికే మద్యం సరఫరా అవుతోందని, యావత్మల్ జిల్లాలో ఒక వేళ ప్రభుత్వం నిషేధం విధించినా ఇదే పునరావృతం అవుతుందని ఎన్సీపీ ఎమ్మెల్సీ ప్రకాశ్ గజ్భియే అన్నారు. మద్యపాన నిషేధం విధించాలంటే తొలుత ఈ విషయంపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని సీఎం ఫడ్నవీస్ తెలిపారు.
‘కల్తీ’పై కొరడా..
Published Fri, Jul 24 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM
Advertisement