
నా కుటుంబ చిత్రం
రోమియో జూలియట్ నా కుటుంబ చిత్రం అన్నారు ఆ చిత్ర కథా నాయకుడు జయం రవి. చాలాకాలం తరువాత ఈయన నగర నేపథ్యంలో సాగే స్టైలిష్ పాత్రలో నటించిన చిత్రం ఇది. మెడ్రాస్ ఎంటర్ ప్రైజస్ పతాకంపై నిర్మాత ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్న భారీ చిత్రం రోమియో జూలియట్. జయం రవి సరసన హన్సిక, పూనం బాజ్వాలు నాయికలుగా నటించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను లక్ష్మణన్ నిర్వహిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నైలో జరిగింది.
ఈ కార్యక్రమంలో జయం రవి, హన్సిక, పూనం బాజ్వా, ప్రభుదేవా, ధనుష్, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను మొదలగు పలువురు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ తన జీవితం, తన స్నేహితుల జీవితంలో జరిగిన సంఘటనలను కథగా తయారు చేసి రూపొందించిన చిత్రం ఈ రోమియో జూలియట్ అని వివరించారు. నిర్మాతగా తనకిది ఐదో చిత్రం అని అయితే ఇంత స్ట్రాంగ్ యూనిట్‌ను ఇంతకుముందు ఎప్పడూ చూడలేదని చిత్ర నిర్మాత ఎస్.నందగోపాల్ అన్నారు. చిత్ర యూనిట్ చాలా సపోర్టుగా ఉన్నారని తనకు ఈ చిత్రం చాలా సంతృప్తి నిచ్చిందని ఇదే యూనిట్‌తో మరో చిత్రం ఖచ్చితంగా నిర్మిస్తానని ఆయన అన్నారు.
చిత్ర నాయకుడు జయం రవి మాట్లాడుతూ రోమియో జూలియట్ తన సొంత ఫ్యామిలీ చిత్రంగా పేర్కొన్నారు. దర్శకుడు కథ చెప్పిన విధానం, నిర్మాత అప్రోచ్, చాలా నచ్చాయని అన్నారు. చిత్రాన్ని చాలా క్వాలిటీగా తీశారని తెలిపారు. ఈ చిత్రంలో నటించిన నటి హన్సిక నేచర్ గురించి, అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అయితే ఈ చిత్రంలో ఆమె నటనా ప్రతిభను చూస్తారని పేర్కొన్నారు. ఇక మరో నాయకిగా పూనం బాజ్వా చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించారని జయం రవి తెలిపారు.