సాక్షి,బెంగళూరు: మహిళల కోసం ప్రత్యేకంగా బ్యాంకును ప్రారంభించే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ బ్యాంకు మహిళ ఆర్థిక అవసరాలకు చేయూత నిస్తుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ అధ్వర్యంలో మంగళవారం ఇక్కడ నిర్వహించినకార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను ప్రభుత్వం తరఫున ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...
మహిళా రైతులకు అవసరమైన రుణాలు ఇవ్వడం మొదలు మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం వరకూ అవసరమైన ఆర్థిక అవసరాలు తీర్చడానికి వీలుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక బ్యాంకును ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ విషయమై నిపుణులతో చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. మహిళల పై జరుగుతున్న దౌర్జన్యాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చించడానికి ప్రతి శాసనసభ సమావేశాల్లో ప్రత్యేకంగా ఒక రోజు మొత్తాన్ని కేటాయించే ఆలోచన కూడా ఉందన్నారు.
మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు, వాటి ఖర్చును ఆర్థికశాఖలో ప్రత్యేక శీర్షిక కింద వివరించనున్నామన్నారు. వరకట్న, బ్రూణ హత్యల నిషేధం తదితర ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రజల ఆలోచనల్లో మార్పు రానంత వరకూ ప్రయోజనం శూన్యమన్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్టు పడాలంటే మహిళలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 1.5 లక్షల స్త్రీ శక్తి సంఘాలు ఉన్నాయని ఇందులో 21 లక్షల మంది సభ్యులుగా ఉన్నారన్నారు.
ఇంకా కొన్ని ప్రాంతాల్లో స్త్రీ శక్తి సంఘాలు లేవని వాటి ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల విషయంలో మహిళల కోసం ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సూచించారు.
మహిళలకు ప్రత్యేక బ్యాంకు: సీఎం
Published Wed, Mar 9 2016 3:38 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM
Advertisement
Advertisement